మన భారతీయ సంస్కృతిలో పూజలు, పండుగలకు చాలా విశిష్టత ఉంది. దేశ ప్రజలందరూ ప్రతిరోజు పూజలు చేయడమే కాకుండా పండగ పర్వదినాలను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఇలా భారతీయ ప్రజలు జరుపుకునే పండుగలలో వసంత పంచమి కూడా ఒకటి. వసంత రుతువు ప్రారంభమైన తర్వాత ఐదు రోజులకు ఈ పండుగని జరుపుకుంటారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. వసంత పంచమి రోజున సరస్వతీ దేవికి పూజలు చేయటం పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తోంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం 2023వ సంవత్సరంలో వసంత పంచమి జనవరి 26వ తేదీన జరుపుకోవాలి.
ఈ సంవత్సరం మాఘ శుక్ల పంచమి జనవరి 25, 2023 మధ్యాహ్నం 12.34 గంటలకు ప్రారంభమై 2023 జనవరి 26 వ తేదీ ఉదయం 10.28 గంటలకు ముగుస్తుంది.
అందువల్ల ఉదయ తిథి ప్రకారం, ఈ సంవత్సరం వసంత పంచమి 26 జనవరి తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
వసంత పంచమి రోజున సరస్వతీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజ చేసి సరస్వతి దేవి అనుగ్రహం పొందాలి.
సృష్టి, జ్ఞానం, సంగీతం, కళలు, జ్ఞానం, అభ్యాసానికి సరస్వతి దేవి అధిపతురాలు.
సరస్వతీ దేవిని సంతోషపెట్టడానికి, కృతజ్ఞతలను తెలియజేయడానికి గృహాలు, దేవాలయాలు, విద్యాలయ ప్రదేశాలలో ప్రజలు విశిష్ట పూజలు చేస్తారు.
ఈ వసంత పంచమి రోజున శుభ సందర్భంలో పిల్లలకు విద్యను ప్రారంభించడానికి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా ఏదైనా శుభకార్యం చేయడానికి వసంత పంచమి అత్యంత పవిత్రమైన రోజు.
అందుకే దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రజలు వసంత పంచమి రోజున ముఖ్యమైన పనులు ప్రారంభించటమే కాకుండా ఈ రోజున నూతన వస్తువులు కొనుగోలు చేయటం కూడా శుభం గా భావిస్తారు.
వసంత పంచమి నాడు చేసే సరస్వతి పూజ చంద్రుడు, గురు, శుక్ర మరియు బుధ గ్రహాల దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తుందని ప్రజల నమ్మకం.