తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారా.? కొత్త రాజకీయ కుంపటి పెట్టబోతున్నారా.?
తెలంగాణ సామాజిక కాంగ్రెస్ అనే పేరుతో రేవంత్ రెడ్డి పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం వెనుక అసలు కారణమేంటి.?
ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఓ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.
జనం పోటెత్తారు ఆ బహిరంగ సభకి. దాంతో, తెలంగాణలో టీడీపీ తిరిగి పుంజుకోబోతోందన్న ప్రచారం జరిగింది.
ఇంతలోనే, రేవంత్ రెడ్డి కొత్త పార్టీ.. అనే ప్రచారం తెరపైకి రావడం గమనార్హం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వున్నా, ఆయన చంద్రబాబు అనుచరుడే.
ఇది జగమెరిగిన సత్యం. పైగా, నిష్టుర సత్యం కూడా. ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు ఓ వెలుగు వెలిగారు. అది తట్టుకోలేకనే చాలామంది టీడీపీని వీడారనుకోండి.. అది వేరే సంగతి.
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే భారత్ రాష్ట్ర సమితి అయ్యిందో..
తెలంగాణ సెంటిమెంట్ కూడా అటకెక్కింది.ఇప్పటికైతే తెలంగాణ పేరుతో తెలంగాణలో వున్న పార్టీ అంటే అది వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే.
దాంతోపాటు తెలంగాణ జన సమితి వున్నా.. ఈ రెండు పార్టీలకూ పెద్దగా క్రేజ్ లేదు జనాల్లో.
ఈ నేపథ్యంలోనే, తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పేరుతో పార్టీ పెడితే, రాజకీయంగా బావుంటుందని చంద్రబాబు సూచించారట.
పైగా, తెలంగాణ కాంగ్రెస్‌లో టీడీపీ నుంచి వచ్చిన వారి పట్ల వివక్ష పెరుగుతున్న దరిమిలా, వారంతా కలిసి రేవంత్ నేతృత్వంలో కొత్త రాజకీయ శక్తిగా అవతరించేందుకు ఇదే సరైన తరుణమని చంద్రబాబు భావిస్తున్నారట.