పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి.! చంద్రబాబుకి వేరే ఛాన్స్ లేదు.!

 ఎన్నికలకు ఇంకా ఏడాది పైనే సమయం వుంది. కానీ, ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో రేపో మాపో ఎన్నికలు జరుగుతాయన్నట్లుగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.

 చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమంటూ జనసేన అధినేతపై ‘దత్త పుత్రుడు’, ‘ప్యాకేజీ స్టార్’ ఆరోపణలు చేస్తోంది అధికార వైసీపీ.

 ఇక్కడ వైసీపీ వ్యూహం సుస్పష్టం. కాపు ఓటు బ్యాంకుని టీడీపీకి పవన్ కళ్యాణ్ అమ్మేస్తాడనే సంకేతాలు పంపడం ద్వారా, కాపు సామాజిక వర్గంలో అలజడి సృష్టించాలన్నది వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడ.

 అది ఎంతవరకు ఫలిస్తుంది.? అన్నది వేరే చర్చ. ‘వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనివ్వను..’ అని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడాన్ని, వైసీపీ అవకాశంగా తీసుకుంది.

  ప్రస్తుత రాజకీయ సమీకరణాల్ని చూస్తే, టీడీపీ నుంచి ఓ పాతిక ముప్ఫయ్ సీట్లు తీసుకుని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమొక్కటే జనసేన ముందున్న మార్గం.

 కానీ, అందుకు జనసేన సుముఖంగా వుందా.? లేదా.? అంటే, దానికి మళ్ళీ భిన్న వాదనలున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏమంత బలంగా లేదిప్పుడు.

 ‘కాపు ఓటు బ్యాంకుని పవన్ కళ్యాణ్, టీడీపీకి అమ్మేస్తాడు..’ అన్న ప్రచారం టీడీపీ విజయావకాశాల్ని కూడా దెబ్బ తీస్తుంది.

 ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి.. అన్న దిశగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. ‘చెరిసగం సీట్లలో పోటీ చేద్దాం..

 ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరునే ముందు పెడదాం.. గెలిచే సీట్లు ఎక్కువగా మనమే తీసుకుందాం..’ అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచిస్తున్నారట.

 కానీ, ఈ వ్యూహం వర్కవుట్ అవుతుందా.? వేచి చూడాల్సిందే.