లోకేష్ వర్సెస్ రోజా.! ఈ తిట్ల పర్వం ఎక్కడిదాకా.?

 ఎవరూ తక్కువ కాదిక్కడ.! ఔను, నిన్న మొన్నటిదాకా వైసీపీ నేత రోజా ఏం మాట్లాడినా చెల్లిపోయేది. కానీ, ఇప్పుడు సీన్ మారింది.

 మాటకు మాట వచ్చి పడుతోంది. నారా లోకేష్ ‘రూపం’పై మంత్రి రోజా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘డిక్కీ బలిసిన కోడి’ అని పదే పదే రోజా విమర్శించడం చూశాం.

  ‘నిన్ను నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.. రోజా.?’ అంటూ టీడీపీ నేతలు ఇప్పుడు ఎదురు ప్రశ్నిస్తున్నారు. సన్నగా వుండడం, లావుగా వుండడం..

 నల్లగా, తెల్లగా వుండడం.. వీటి మీద అభ్యంతరకర వ్యాఖ్యలేంటి.? పైగా, రోజా ఇప్పుడు మంత్రి పదవిలో వున్నారు. బాధ్యతగా వుండాలి కదా.?

 ‘పప్పు.. పులకేశి..’ అంటూ లోకేష్ మీద రోజా పంచ్ డైలాగులు పేల్చుతున్నారు. ‘జబర్దస్త్ ఆంటీ.. డైమండ్ రాణి..’ అంటున్నారు నారా లోకేష్. ‘పళ్ళు రాలిపోతాయ్..’

 అంటూ లోకేష్ మీద రోజా హెచ్చరికల దాడి చేస్తున్నారు. ‘జనాన్ని పెట్టి కొట్టిస్తాను’ అంటున్నారామె. ‘ఏం మాకు లేరా జనం.? మేం కొట్టించలేమా..’ అంటున్నారు లోకేష్ తరఫున టీడీపీ నేతలు.

 ‘లోకేష్‌కి చీర, గాజులు పంపిస్తా..’ అంటూ రోజా ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 లోకేష్ ఏకంగా ‘చీర, గాజులు’ నేరుగా రోజా ఇంటికే తెలుగు మహిళలతో పంపించేశారు. ఇదీ వరస.! ఎవరూ తగ్గడంలేదు.

 ఒకరేమో మంత్రి.. ఇంకొకరేమో మాజీ మంత్రి.! రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలిలా బజార్న పడి రాజకీయం చేస్తోంటే,

 జనానికి నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు. ఇదా రాజకీయం.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

 మీడియా మాత్రం పండగ చేసుకుంటోంది. ‘నువ్వేం తిడతావో తిట్టు..’ అంటూ ఇరువురి ముందరా మైకులు పెట్టి, చోద్యం చూస్తున్నారు మీడియా ప్రతినిథులు.