ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కొద్ది దూరం నడవంగానే లేదా చిన్నపాటి శ్రమ చేస్తేనే విపరీతమైన అలసట నీరసం వస్తుంది అంటూ గగోలు పెడుతుంటారు.
కానీ ఇలా జరగడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు. సాధారణంగా మన శరీర నిత్య జీవక్రియలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందకపోతే
పోషకాహార లోపం వల్ల మనలో నీరసం, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనివలన మనలో చురుకుదనం తగ్గి ఏ పని చేయాలన్నా ఆసక్తి చూపడానికి ఇష్టపడరు.
అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా తరచూ నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటివారు కచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులు సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది.
రోజువారీ కార్యకలాపాలు ఉత్సాహంగా పాల్గొనాలంటే ఉదయాన్నే కాఫీ, టీ లాంటి పానీయాలకు బదులుగా రాగి జావాను సేవిస్తే వీటిలో అధికంగా ఉండే ఫైబర్, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజలవణాలు మన శరీరాన్ని ఎల్లప్పుడు దృఢంగా ఉండునట్లు చేస్తాయి.
రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి మనలో అలసటను, నీరసాన్ని తొలగిస్తుంది.
ప్రతిరోజు ఉదయాన్నే నవధాన్యాలను మొలక కట్టి ప్రతిరోజు అల్పాహారానికి ముందే ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా విటమిన్స్ , మినరల్స్ , కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్ మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉండునట్లు చేస్తుంది.
అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మనకు నీరసంగా ఉన్న సమయంలో ఒక అరటి పండును తింటే ఇందులో పుష్కలంగా ఉన్న కార్బోహైడ్రేట్స్ మనకు తక్షణ శక్తిని ఇస్తుంది.
అలాగే అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం ,ఫైబర్ పుష్కలంగా ఉండడంవల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
అలాగే గుప్పెడు నానబెట్టిన ఖర్జూర పండ్లను అల్పాహారానికి ముందే తీసుకుంటే మన శరీరానికి కావలసిన క్యాలరీలు పుష్కలంగా లభిస్తాయి.
ఖర్జూర పండ్లలో కొవ్వు పదార్థాలు తక్కువ క్యాలరీలు ఎక్కువ కావున మన రోజువారి జీవక్రియలకు అవసరమైన క్యాలరీలు పుష్కలంగా లభిస్తాయి.