వంగవీటి మోహన రంగా ఎంత మంచోడంటే.!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఓ ‘నాయకుడి’ని గొప్పోడిగా చెప్పేందుకు నానా తంటాలూ పడుతున్నాయి.

 సాధారణంగా అయితే, టీడీపీ – వైసీపీ మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కనిపించదు.

 కానీ, వంగవీటి మోహన రంగా విషయంలో మాత్రం వైసీపీ, టీడీపీ ఏకాభిప్రాయంతో కొట్టుకు ఛస్తున్నాయ్.

 ఏకాభిప్రాయమేంటి.? కొట్టుకు ఛావడమేంటి.? వంగవీటి మోహన రంగా వర్ధంతి నేడు. మూడు దశాబ్దాలయ్యింది ఆయన హత్యకు గురై.

 ఆ దివంగత నేత వంగవీటి మోహన రంగా వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకోసం అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నానా తంటాలూ పడ్డాయి.

 బోల్డంత ఖర్చు చేశాయి. జనాన్ని కూడా పోగేశాయి. ఈ క్రమంలో బాహాబాహీకి దిగాయి కూడా.వంగవీటి మోహన రంగా ఎంత పెద్ద నాయకుడంటే..

 ఆయనెంత గొప్పవాడంటే.. అంటూ అటు వైసీపీ నేతలు, ఇటు టీడీపీ నేతలు పోటీ పడి మరీ ఆయన భజనలో మునిగి తేలడం గమనార్హం.

 కాంగ్రెస్ నేతగా వున్న సమయంలో రంగా హత్యకు గురయ్యారు. ఆ హత్య టీడీపీ హయాంలో జరిగింది.

 రంగాని హత్య చేసినవాళ్ళు ఆ తర్వాత వివిధ పార్టీలు మారారు. ఆ వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ కూడా పలు పార్టీ మారారు. రాజకీయం అంటేనే అంత.

 ఇంతా చేసి ఇప్పుడేమో, రంగా విషయంలో రాజకీయాలు చేయకూడదంటున్నారు రాధాకృష్ణ. మరోపక్క, ఆ రాధాకృష్ణ మీద అమితమైన ప్రేమ ప్రదర్శించేస్తున్నాయి టీడీపీ, వైసీపీ.!

 అప్పట్లో రౌడీ షీటర్ అన్నారు రంగా గురించి. ఇప్పుడాయన్ని మహానుభావుడంటున్నారు. ఇదీ రాజకీయమంటే.