టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోనే వున్నారట. అదేంటి.?
చాలాకాలంగా ఆయన టీడీపీకి దూరంగా వుంటున్నారు కదా.? విశాఖలో చంద్రబాబు పర్యటనలకు సైతం ఆయన అందుబాటులో వుండటం లేదు కదా.?
అయినా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు, ఆ రాజీనామాని ఆమోదించుకోవడంలో ఎందుకు విఫలమయ్యారోగానీ..
టీడీపీకి చాలాకాలంగా దూరంగా వుంటోన్న ఆయన, చివరికి టీడీపీలోనే కొనసాగాలనే నిర్ణయానికి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వైసీపీలోకి వెళ్ళాలనుకున్నారు.. జనసేన వైపూ చూశారు. మధ్యలో బీజేపీతోనూ మంతనాలు జరిపారు గంటా శ్రీనివాసరావు. కానీ, ఎక్కడా ఆయనకు సానుకూలత రాలేదు.
అంటే, ఏ పార్టీ కూడా ఆయన్ని చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. దాంతో, చివరికి టీడీపీలోనే కొనసాగాలని గంటా ఫిక్సయిపోయారట.
మరోపక్క, గంటా శ్రీనివాసరావు త్వరలో నారా లోకేష్ చేపట్టబోయే ‘యువగళం’ పాదయాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారట.
కొన్ని నియోజకవర్గాల్లో నారా లోకేష్ వెంట తిరగాలని కూడా గంటా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, నిజంగానే ఇది చాలా పెద్ద మార్పు గంటా శ్రీనివాసరావుకి సంబంధించి.
ఇలా ఎలా జ్ఞానోదయం అయ్యిందబ్బా.? అని గంటా అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.