ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమయ్యే క్యాప్సికం మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. సాధారణంగా క్యాప్సికం గ్రీన్, రెడ్ , ఎల్లో కలర్స్ లో లభ్యమవుతాయి.
అయితే మనకు గ్రీన్ కలర్ క్యాప్సికం మాత్రమే మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతుంది. సాధారణంగా క్యాప్సికం వెజిటేబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, సూప్స్, సలాడ్స్ లో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
అలా కాకుండా మన రోజువారి ఆహారంలో క్యాప్సికం ను ఉపయోగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు.
అయితే క్యాప్సికం తినే విషయంలో కొందరిలో కొన్ని ఆపోహాలు ఉన్నాయి వీటిని ఎక్కువగా తింటే జీర్ణం అవడంలో సమస్య తలెత్తి
తీవ్రమైన కడుపు మంట కడుపునొప్పి భరించాల్సి ఉంటుందని చెబుతుంటారు. ఇది కొంతవరకు వాస్తవమే అయితే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మాత్రం
క్యాప్సికం తక్కువ మోతాదులో తీసుకోవడమే ఉత్తమం. ఏదైనా మితంగా తీసుకుంటేనే వాటి నుంచి సంపూర్ణ ప్రయోజనాలను పొందవచ్చు.
ముఖ్యంగా క్యాప్సికంలో ఐరన్, ఫోలిక్, లుటిన్, జియాక్సిటిన్ అనే మూలకాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి.
క్యాప్సికంలో సమృద్ధిగా లభించే విటమిన్ సి, విటమిన్ b6, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి పోషకాలు జీవ ద్రవాలను సమన్వయపరిచి నాడీ కణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. నరాల బలహీనతను తొలగించి మనలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.
రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా క్యాప్సికం లో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు,
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో తోడ్పడతాయి. క్యాప్సికం లో ఉండే ఫాస్పరస్, కాపర్, మాంగనిస్ ఎముకల్లో కొల్లాజన్ ఉత్పత్తికి సహాయపడి ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది.