మన హిందూ సంప్రదాయంలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ రోజున రంగురంగుల ముగ్గులతో ఇంటిలోగిళ్లను అందంగా అలంకరించి రకరకాల పిండి వంటకాలు తయారు చేస్తారు. ఈ మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఉంది.
సంక్రాంతి పండుగ రోజున దానధర్మాలు చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతి పండుగ రోజున నిరుపేదలకు కొన్ని రకాల వస్తువులను దానం చేయాలి.
ఇలా వస్తువులను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే సంక్రాంతి పండుగ రోజున ఏ ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• పండ్లు, అన్న దానం: అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా పవిత్రమైనది. మకర సంక్రాంతి రోజున నిరుపేదలకు అన్నదానం చేయడంతో పాటు పండ్లు దానం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.
• నువ్వులు: మకర సంక్రాంతిని నువ్వుల సంక్రాంతి అని కూడా అంటారు. మకర సంక్రాంతి రోజున నువ్వులతో చలివిడి చేయడం కూడా సాంప్రదాయంగా వస్తోంది.
సంక్రాంతి రోజున నువ్వులను దానం చేయడం శ్రేయస్కరం మాత్రమే కాదు, విష్ణువు, సూర్యుడు, శనీశ్వరుడిని అనుగ్రహం కూడా లభిస్తుంది.
• బెల్లం: సంక్రాంతి పండుగ రోజున నిరుపేదలకు బెల్లం దానం చేయడం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం.
నువ్వులు, బెల్లం లడ్డూను డబ్బులతో కలిపి దానం చేయవచ్చు. దీనిని గుప్త లక్ష్మి దానం అంటారు.
• గాలిపటాలు : మకర సంక్రాంతి పండగ రోజున కల్మషం లేని చిన్న పిల్లలకు గాలిపటాలు దానం చేయటం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది.
పండుగ రోజున ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా ఇలా పేదలకు దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. ఇలా చేసే దానానికి చాలా విశిష్టత కూడా ఉంటుంది.