పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత టాలీవుడ్ లో హీరోలతో పాటు నిర్మాతలు కూడా తమను తాము పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే డైరెక్ట్ గా పాన్ ఇండియా కథలతోనే కాకుండా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ అక్కడ నిర్మాణ భాగస్వాములుగా మారి ప్రేక్షకులకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో అల్లు అరవింద్ అమీర్ ఖాన్ తో గజిని సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.
తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నిర్మాణ భాగస్వామిగా అల్లు అరవింద్ హిందీలో సినిమాలు చేస్తున్నారు.
ఇదేలా ఉంటే ఈ మధ్యకాలంలో నిర్మాత దిల్ రాజు కూడా హిందీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు.
అందులో భాగంగా సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీతో కలిసి నాని జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. అది కాస్త డిజాస్టర్ అయింది.
తర్వాత తెలుగులో హిట్ అయిన హిట్ మూవీని హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా శైలేష్ కోలను దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. అయితే అక్కడ ఆ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
తాజాగా అల్లు అరవింద్, హారిక హాసిని క్రియేషన్స్ ఎస్ రాధాకృష్ణ నిర్మాణ భాగస్వామిగా అలవైకుంఠపురంలో సినిమాను హిందీలో కార్తీక్ ఆర్యన్ తో రీమేక్ చేశారు.
సెహజాదా టైటిల్ తో రీమేక్ అయిన ఈ మూవీ కూడా హిందీలో డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఒరిజినల్ వెర్షన్ కి దగ్గరగా కూడా లేదనే మాట వినిపించింది.
ఇలా తెలుగు నిర్మాతలకు హిందీలో వరుసగా మూడు భారీ ఫ్లాప్ సినిమాలు రావడం గమనార్హం.
అయితే ఫ్లాప్ అయిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో హిట్ అయినవి కావడం విశేషం. కానీ అదే కథలను హిందీలో రీమేక్ చేస్తే ప్రేక్షకులు ఆదరించలేదు.
దీనిని బట్టి అన్ని తెలుగు కథలు హిందీ లో సక్సెస్ కావనే విషయాన్ని తెలుగు నిర్మాతలు అర్థం చేసుకోవాలి అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.
హిందీలో సక్సెస్ కావాలంటే కచ్చితంగా ఒరిజినల్ కథలతో సినిమాలు చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.