సోషల్ మీడియా వేదికగా మొదలైన ఒక పనికిమాలిన పంచాయతీ… చినికి చినికి గాలివానగా మారి.. గన్నవరం నియోజకవర్గాన్ని రావణకాష్టంలా మార్చేలా ఉంది!
ఇప్పటికే టీడీపీ ఆఫీసు ధ్వంసం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గొడవ జరిగిన గన్నవరం టీడీపీ కార్యాలయానికి బయలుదేరిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్నారు.
ఏదో హర్రర్ సినిమాలో చూసినట్లుగా ప్రస్తుతం ఏపీలో సీనుంది! టీడీపీ నేతలు గన్నవరం బయలుదేరడం.. హైరానా చేయడం..
పోలీసులు వారిని అరెస్టు చేయడం.. అనంతరం వారి అడ్రస్ లేకుండాపోవడం.. ప్రస్తుతం ఈ సీన్స్ వరుసగా జరుగుతున్నాయి!
ముందుగా… టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రాం.. గన్నవరం వ్యవహారంపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్లిన అనంతరం మిస్ అయ్యారు! పట్టాభిని ఎవరు తీసుకెళ్లారు..
ఎక్కడికి తీసుకెళ్లారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో… తన భర్త ఆచూకీ తెలియజేయాలని పట్టాభి సతీమణి పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ ఆమె వెల్లడించారు.
అనంతరం… గన్నవరానికి చేరుకున్న దేవినేని ఉమ కూడా.. ఘటనాస్థలానికి చేరుకున్న పదినిమిషాల అనంతరం అరెస్టు కాబడ్డారు.
తర్వాత నుంచి ఆయనకు సంబందించిన సమాచారం కూడా బయటకు రాలేదు. ఇదేక్రమంలో దేవినేని ఉమాతో పాటు..
పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ.. వారిని ఏ స్టేషన్ లో పెట్టారు, ఎక్కడ ఉంచారు అన్నదానికి మాత్రం నో ఆన్సర్!
ఇలా అరెస్టు కాబడిన టీడీపీ నేతలు, అనంతరం ఎక్కడ ఉన్నారన్నది తెలియకపోవడంతో టీడీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.