తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా కందుకూరు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.
‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అంటూ తెలుగుదేశం పార్టీ, అధికార వైసీపీకి వ్యతిరేకంగా నినదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే నినాదంతో కందుకూరులో చంద్రబాబు ఓ రోడ్ షో చేశారు.
అయితే, రోడ్ షో కోసం జనాన్ని భారీగా తరలించే క్రమంలో టీడీపీ స్థానిక నేతలు అత్యుత్సాహం చూపగా, వారి ఉత్సాహం ఫలించిందిగానీ, అత్యుత్సాహం కొంప ముంచేసింది.
తొక్కిసలాట చోటు చేసుకుని, పలువురు అక్కడే వున్న ఓ కాలువలో పడిపోయారు.
వారిలో చాలామందికి తీవ్ర గాయాలు కాగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా వుండడంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
కాగా, కందుకూరులో జరిగిన దుర్ఘటన తన మనసుని కలచివేసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించిన చంద్రబాబు బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
బాధితుల పిల్లల్ని ఎన్టీయార్ ట్రస్ట్ విద్యా సంస్థల్లో చదివిస్తామనీ చంద్రబాబు ప్రకటించారు.
నిజానికి, ఈ తరహా రాజకీయ సభల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీలు ఒకటికి పదిసార్లు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. జనాన్ని పోగెయ్యడం మీదున్న శ్రద్ధ వారి, భద్రత మీద వుండటంలేదు.