అయినా పర్లేదు… జీవో నెం.1 వద్దు!

 ప్రతిపక్షాలు అంటే కేవలం ప్రభుత్వాలను విమర్శించడమేనా? ప్రభుత్వం ఏదైనా ఒక జీవో విడుదల చేసిందంటే.. కనీసం ఆ జీవో వెనక ఉన్న ముఖ్య ఉద్దేశ్యంలో ప్రజాశ్రేయస్సు ఏమేరకు ఉంది?

 అసలు ఆ జీవో రావడానికి కారణం ఏమిటి? అని ఆలోచించరా? జీవో నెంబర్ 1 గురించి ప్రతిపక్షాలు చేస్తున్న రచ్చపై..

 ప్రజాస్వామ్య వాదులు, ప్రజల ప్రాణాలకు విలువ ఇచ్చేవారు, ప్రజలందరూ సమానమే అని నమ్మేవారు ప్రశ్నిస్తున్నారు!

 అవును… ఇరుకు సందుల్లో సభలు పెట్టవద్దు.. తొక్కిసలాటలు జరిగే ప్రమాధం ఉంది. ఇప్పటికే జరిగింది కూడా! ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు.

 చుట్టూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుని, కేరవాన్ ఎక్కి సేఫ్ గా ఉండే నేతలు – కిందున్న జనాల గురించి కూడా ఆలోచించండి. సభలు వద్దనడం లేదు.. కాస్త ఖాళీగా ఉన్న చోట్ల పెట్టుకోండి..

 కావాల్సినంత సేపు పెట్టుకోండి! దాదాపుగా ఈ కోణంలో జీవో నెంబరు 1 ని విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం! శివరాత్రి కారణంగా శివాలయానికి వెళ్లే భక్తుల హడావిడి ఎక్కువగా ఉండే రోడ్లపై మీటింగులు పెడతామంటే ఎలా?

 బాధ్యత ఉండక్కర్లేదా? వద్దంటే పోలీసులను తిట్టడం, ప్రభుత్వాధినేతను అసభ్యకరంగా మాట్లాడటం. పోలీసులు అడ్డొస్తే.. కేసులు పెట్టుకోండి అని బరితెగించడం!

 దీనికి ఇంగితం లేని వ్యక్తులు, వ్యవస్థలు మద్దతు పలకడం! ఇది ఎంతవరకూ కరెక్ట్? ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా పర్లేదు.. స్కూలు నుంచి పిల్లలు ఇంటికొచ్చే సమయంలో ఎంత నరకం అనుభవించినా మాకు పట్టదు..

 నాలుగు రోడ్ల కూడలిలో, రద్దీగా ఉన్న జంక్షన్ లో తాము సభ పెట్టుకుంటామంతే! తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే హాస్పత్రికి వెళ్లి పరామర్శించి వస్తాము..

 లక్షో రెండులక్షలో చెక్కు ఇస్తాము! ఈ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ప్రవర్తించడం ఎంతవరకూ కరెక్ట్? అసలు రాజకీయ పార్టీలు మీటింగులు పెట్టుకుంటే.. సామాన్యులు ఎందుకు ఇబ్బందులు పడాలి?

 ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వారికి సేవ చేసుకుంటామని జోలెపట్టుకుని ఓట్లకోసం తిరిగే వారు.. ఈ ప్రభువులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం ఏమిటి?

 అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? వెనక నాలుగురిని వేసుకుని మైకందుకుని, కారెక్కి రచ్చ చేస్తాము.. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా మాకేమీ పట్టదు అన్నట్లుగా ఉంటే ఎలా?

 ఇలాంటప్పుడు బాధ్యత గల ప్రభుత్వ పెద్దలు స్పందించి నిబంధనలు పెడితే, వాటిని ఆచరించకపోతే ఎలా? బాధ్యత ఉండక్కరలే?

 అర్జెంటు పనిమీద బస్సెక్కి బయలుదేరిన వ్యక్తి గంటల పాటు నడిరోడ్డుపై ఆగిపోతే.. స్కూలు నుంచి ఇంటికి అలసిపోయి, ఆకలితో వస్తున్న పిల్లల స్కూలుబస్సు నడిరోడ్డుపై కదలలేకుంటే..

 ఆసుపత్రికని బయలుదేరిన పెద్దావిడ ఆటో, జనాల్లో ఇరుక్కుపోతే.. హార్ట్ ప్రాంబ్లం ఉన్నవారు అరుగుమీద కూర్చుని ప్రశాంతంగా ఉన్నప్పుడు, డీజే పాటలు పెట్టుకుంటుపోతే..

 ఒకేసారి వేలమంది రోడ్లపైకి వచ్చి తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే.. అయినా పర్లేదు…! జీవో నెంబరు 1 వద్దు!!