అంతా అనుకున్నదే అయ్యింది. వైసీపీ సర్కారు తీసుకొచ్చిన జీవో తాత్కాలికంగా సస్పెండ్ అయ్యింది.
రోడ్లపై రాజకీయ ప్రదర్శనలకు ఆస్కారం లేకుండా వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
పూర్తిగా అనుమతుల్లేవని చెప్పలేదుగానీ, అత్యంత ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే.. అని పేర్కొంటూ జీవో ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
‘మీరెలా పాదయాత్ర చేశారు..?’ అంటూ వైసీపీ మీద విపక్షాలే కాదు, సాధారణ ప్రజానీకం కూడా ప్రశ్నలు సంధించే పరిస్థితి వచ్చింది.
కందుకూరు, గుంటూరుల్లో టీడీపీ కార్యక్రమాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన దరిమిలా,
ఈ తరహా కార్యక్రమాల విషయమై వైసీపీ సర్కారు కొరడా ఝుళిపిస్తూ జీవో నెంబర్ వన్ తీసుకొచ్చింది.
అయితే, ఆయా తొక్కిసలాటల వెనుక పోలీసు శాఖ వైఫల్యం సుస్పష్టమన్న వాదనలు లేకపోలేదు.
టీడీపీ అయితే, ఏకంగా వైసీపీ కుట్ర పన్ని ఆ పదకొండు మందిని చంపేసిందనే విమర్శలు చేయడమూ చూశాం.
రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్ల మీద తిరగొద్దంటే ఎలా.? అన్న ప్రశ్నలోనూ అర్థం లేకపోలేదు.
ప్రభుత్వ ఉద్దేశ్యం మంచిదే అయినా, నిర్ణయం కఠినమైనది కావడంతోనే సహజంగా విమర్శల తీవ్రత పెరిగింది. కమ్యూనిస్టు పార్టీ నేత రామకృష్ణ కోర్టును ఆశ్రయించిన దరిమిలా,
జనవరి 23 వరకు జీవో నెంబర్ వన్ మీద సస్పెన్షన్ వేటు వేసింది ఉన్నత న్యాయస్థానం. ఆ తర్వాత ఏమవుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
కొత్త ఏడాదిలో తొలి జీవోనే ఇలా వివాదస్పదమై, సస్పెండ్ కూడా అవడం గమనార్హం.