కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రపంచ దేశాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఇక వినోదరంగం తో పాటు ఎడ్యుకేషన్ రంగంలోనూ ఇది పెను మార్పులు తీసుకురానున్నదన్న విశ్లేషణ సాగుతోంది. ఇప్పటికే సినిమా వీక్షణకు డిజిటల్ – ఓటీటీ వేదికల్ని ఫాలో అవుతున్నారు యూత్. డిజిటల్ వల్ల ఇంటిల్లిపాదీ ఇంట్లోనే సినిమాలు చూసే వెసులుబాటు కలిగింది. ఇక అమెరికా వెళ్లి చదువుకోవాలని చూసే విద్యార్థులు సహా ఉద్యోగార్థులు కూడా అధ్యక్షుడు ట్రంప్ విదేశీయులకు చెక్ పెడుతూ కొత్త రూల్ ప్రతిపాదించడంతో ఒక్కసరిగా మైండ్ సెట్ మార్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ ఎడ్యుకేషన్ పురోభివృద్ధి అన్న మాట ప్రముఖంగా వినిపిస్తోంది.
ఈ వ్యవస్థ ఇప్పటికే అందుబాటులో ఉన్నా దీనికి మునుముందు మరింత ఆదరణ పెరగనుందని ప్రముఖ
ప్రింట్ అండ్ టెక్నాలజీ దిగ్గజం మణిపాల్ టెక్నాలజీస్ లిమిటెడ్ పేర్కొంటోంది. 2015 నుంచి ఆన్ లైన్ లెర్నింగ్ సొల్యూషన్స్ లో కొనసాగుతున్న ఈ సంస్థకు కరోనా నేపథ్యంలో విపరీతమైన డిమాండ్ పెరిగిందిట. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థ కూడా గందరగోళంలో పడింది. ఈ ఏడాది అకడమిక్ స్టడీపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో డిజిటల్ విద్యా విధానం వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి పెరిగిందని మనిపాల్ టెక్నాలజీస్ సంస్థ చెబుతోంది.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు.. విద్యా సంస్థల్ని మూసి వేశారు. దీని ప్రభావం దాదాపు 20 కోట్ల మంది విద్యార్థులపై పడనుందని సదరు సంస్థ అధ్యయనంలో తేలిందిట. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు `మి క్లాస్` పేరిట ఆన్ లైన్ తరగతుల్ని ప్రారంభించడం విద్యార్థి లోకంలో ప్రధానంగా చర్చకొచ్చింది. ఈ విధానంలో ఈ టెక్స్ట్ బుక్స్.. నోట్స్ తో అసెస్ మెంట్స్ చేస్తూ విద్యా భోధన సాగిస్తారు. బేసిక్ స్మార్ట్ ఫోన్.. డెస్క్ టాప్ యాప్ వంటి వాటితోనే స్టడీ చేయడం సులువు అని చెబుతున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ లపై ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. విద్యార్థులు ఇంటి వద్ద నుంచే నేర్చుకునేందుకు హెవీ డేటా(నెట్) ప్యాకేజీ మాత్రం అవసరం. ప్రస్తుతం సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యార్థులకు ఇప్పటికే ప్రొఫెషనల్ సంస్థలు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా క్లాసుల్ని బోధిస్తున్నాయి. దాదాపు 51 వేలకు పైగా కాలేజీలు..14 లక్షల స్కూళ్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నాయని మణిపాల్ సంస్థ చెబుతోంది. కెన్యాలో 150 పైగా సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న లాంఘోమ్ పబ్లిషర్స్ తో జతకట్టి డిజిటల్ విద్యా విధానంలో ముందడుగు వేస్తున్నామని మణిపాల్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక కరోనా అల్లకల్లోలం నేపథ్యంలో ఈ లెర్నింగ్ విధానం ఎడ్యుకేషన్ రంగంలో ఏ మేరకు విస్తరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. మణిపాల్ టెక్నాలజీస్ బాటలోనే పలు సంస్థలు భారతదేశంలో ఈ ఎడ్యుకేషన్ విధానాన్ని డెవలప్ చేసే ప్రతిపాదనలో ఉన్నాయి. ఇప్పటికే ఈ విధానం ఉన్నా ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు సాగే వీలేందని గణాంకాలు చెబుతున్నాయి.
