ప్రపంచానికి కరోనా లెస్సన్స్ ఓ రేంజులో ఎక్కేస్తున్నాయి. పరిమితంగా ఖర్చు చేయడం.. పొదుపుగా ఉండడం.. ఆచి తూచి అడుగులేయడం.. పద్ధతిగా ఉన్నది తిని బతకడం.. ఇలా ఎన్నిటినో నేర్పిస్తోంది కరోనా. వాతావరణ కాలుష్యం పెంచకుండా బతకడాన్ని అలవాటు చేస్తోంది. ఇక పై క్వాలిటీస్ అన్నిటినీ టాలీవుడ్ సైతం జీర్ణించుకుంటోంది.
ఇన్నాళ్లు పాన్ ఇండియా పేరుతో అన్ లిమిటెడ్ బడ్జెట్లతో చెలరేగిన మన నిర్మాతలు ఇటీవల యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న సన్నివేశంలో డబ్బును మంచి నీళ్లలా వెదజల్లితే ఆ మేరకు రిటర్నులు రాబట్టడం అంత సులువు కాదని అర్థమైపోయింది. ముఖ్యంగా ఒక మంచి సినిమా తీసినా కరోనా వల్ల జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత సులువు కాదని ప్రాక్టికల్ గానే ఆలోచిస్తున్నారు.
అందుకే ఇప్పుడు అంతా కాస్ట్ కంట్రోల్ అన్న పంథాని అనుసరిస్తున్నారు. ఈ ఒరవడిలోనే వకీల్ సాబ్ కి కాస్ట్ కంట్రోల్ పెడుతున్నారట దిల్ రాజు. ఒరిజినల్ వెర్షన్ పింక్ తో పోలిస్తే.. వకీల్ సాబ్ లో కమర్షియల్ అంశాల్ని అదనంగా చేర్చాలని భావించారు. ఆ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఓ రొమాంటిక్ లవ్ ట్రాక్ ఉండాలని భావించి నాయికను ఎంపిక చేశారని ప్రచారమైంది. అయితే కరోనా క్రైసిస్ నేపథ్యంలో కాస్ట్ కంట్రోల్ అంశం తెరపైకి రావడంతో ఆ లవ్ ట్రాక్ ని పూర్తిగా తొలగిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్ల కొంతవరకూ ఖర్చు అదుపులో ఉంటుందని దిల్ రాజు భావిస్తున్నారట. ఇక ఇప్పటికే ఈ మూవీ కోసం నెలరోజుల కాల్షీట్లు కేటాయించిన పవన్ కి 50 కోట్ల మేర చెల్లించేందుకు దిల్ రాజు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో కూడా రాజా వారు బార్ గెయిన్ చేస్తున్నాని.. దానిపై పవన్ గుర్రుగా ఉన్నారని కూడా ఇంతకుముందు ప్రచారమైంది. అయితే కరోనా సమ్మెట దెబ్బకు పవన్ సైతం దిగి రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి పారితోషికంలో తగ్గుదల ఏదైనా ఉంటుందా? అన్నది చూడాలి.
