‘వాల్మీకి’కి కలెక్టర్ షాక్!.. విడుదలకు బ్రేక్ !!

అక్కడ వాల్మీకి సినిమా విడుదల నిలిపివేత

వరుణ్‌తేజ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు (సెప్టెంబరు 20న) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్లు తెలిపారు.

వివరాల్లోకి వెళితే…గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుండి అనేక వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ టైటిల్‌ను మార్చాలని వాల్మీకి తమ కులానికి చెందిన వ్యక్తి అని ఆ పాత్రను నెగిటివ్ గా చూపించడంపై బోయ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ అనంతపురానికి చెందని బోయ కులస్థులు జిల్లా కరెక్టర్‌ను కోరారు. దీంతో శాంతి భద్రత దృష్ట్యా ‘వాల్మీకి’ సినిమా విడుదలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ పకీరప్ప ఆదేశాలు జారీ చేశారు.

కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ బోయ కులస్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతపురం ముందబండపల్లిలో వాల్మీకి షూటింగ్ సమయంలో బోయకులస్థులు చిత్ర యూనిట్‌పై దాడికి దిగారు. ఆ సందర్భంలో షూటింగ్‌ కూడా నిలిపివేశారు. అయితే వివాదం పూర్తిగా సద్దుమణగకుండానే సినిమా విడుదలకు రెడీ కావడంతో శాంతి భద్రత దృష్ట్యా అనంతపురంలో ‘వాల్మీకి’ నో ఎంట్రీ బోర్డ్ పెట్టారు కలెక్టర్.

అంతేకాదు కర్నూలు జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన చోట్ల యదావిధిగా ‘వాల్మీకి’ చిత్రం ప్రదర్శితం కానుంది. కాగా హైదరాబాద్‌లో కూడా వాల్మీకి’ టైటిల్ విషయంలో వివాదాలు చెలరేగుతున్నాయి.