ఫస్ట్ టైం ఓడిపోయానంటూ హరీష్ శంకర్
వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఈ రోజు విడుదల అవుతున్న ‘వాల్మీకి’ చిత్రానికి టైటిల్ మార్చిన సంగతి తెలిసిందే.నిన్న రాత్రి ఆ నిర్ణయం తప్పని సరి పరిస్దితుల్లో జరిగింది. వాల్మీకి టైటిల్ మార్చాలి అని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టు లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ పిటీషన్ కే సంబంధించి హైకోర్టు చిత్ర యూనిట్ కు నోటీసులు పంపింది. నోటీసుల పై వివరణ ఇచ్చిన వాల్మీకి చిత్ర యూనిట్.. మొత్తానికి ‘వాల్మీకి’ అనే టైటిల్ మారుస్తున్నామని హైకోర్టుకు తెలిపింది.
కొత్త టైటిల్ “గద్దలకొండ గణేష్”గా పెడుతున్నట్లు హైకోర్టుకి నిర్మాతలు, దర్శకుడు తెలిపారు. అయితే టైటిల్ మార్పుకి సంబధించి చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి.. తమ సినిమా టైటిల్ ఇక నుండి “గద్దలకొండ గణేష్” అని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో హరీష్ శంకర్ కాస్త నిరాశగా మీడియా దగ్గర మాట్లాడాడు. ఫస్ట్ టైం తాను ఓడిపోయాను అని అన్నారు. సినిమా టైటిల్ ని సినిమా విడుదలకి కొద్దీ గంటల ముందు మార్చాల్సి రావడంతో బాధ పడుతున్నాను అని చెప్పుకొచ్చాడు.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ…వాల్మీకి టైటిల్ చాలా మంచి టైటిల్ …ఫస్ట్ టైం ఓడిపోయాను .ఆ మహర్షి మీద వున్న గౌరవం తో ఈ టైటిల్ పెట్టాను. నేను వాల్మీకి మహర్షి గొప్పతనం గురించి చెప్పాను. నా బాధ ఏమిటంటే సినిమా చూడకుండా ఇలా డిస్ట్రబ్ చేయడం కరెక్ట్ కాదు. కోట్ల రూపాయలతో సినిమా తీసినప్పుడు ఏరి కోరి కాంట్రవర్సీ ఎందుకు తెచ్చుకుంటాము. బోయ సోదరులకు నా విజ్ఞప్తి ఏమిటంటే సినిమా చూసి చెప్పండి… మేము చేసింది కరెక్టా కదా అనేది మీకు తెలుస్తుంది.
సెన్సార్ వాళ్ళు సినిమా చూసి మెచ్చుకున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ నష్ట పోకూడదని ఈ సినిమా టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చాము. వాళ్లకు సినిమా చూపిస్తాము అని అన్నాము. కానీ వారు సినిమా చూడకుండా అపార్ధం చేసుకున్నారు. నేను ఓడిపోయినా సినిమా ఘన విజయం సాధిస్తుంది అని అన్నారు.