మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ `ఆచార్య` పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై హీరో రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. `సైరా నరసింహారెడ్డి` సమయంలోనే ఓకే చేసిన స్క్రిప్ట్ కావడంతో వెంటనే మొదలు పెట్టారట.
ఈ చిత్రంలో 30 నిమిషాల నిడివిగల రెబల్ స్టూడెంట్ లీడర్ పాత్రని ముందు రామ్‌చరణ్ చేత చేయించాలనుకున్నారు. కానీ అందుకు రాజమౌళి అంగీకరించకపోవడం, సినిమా ఆలస్యం అవుతుండటంతో కొరటాల అసహనానికి గురయ్యారట. అయితే ఆ తరువాత ఆ పాత్రలో మహేష్ నటిస్తారనే ప్రచారం ఊపందుకుంది.
దీనిపై తొలిసారి కొరటాల శివ స్పందించారు. కరోనా తరువాత ఏ సినిమా ఏమిటనేది ఎవరీకీ తెలియదు. ఇది సినిమాల గురించి మాట్లాడే సమయమే కాదు. తన సినిమాలు, తన ప్రాధాన్యతలు తనకున్నా ఎవ్వరూ ఊహించని రీతిలో మహేష్ నేనున్నాను అన్నారంటే ఆయనకు ఎంత పెద్ద మనసుండాలి?.. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా` అన్నారు కొరటాల. అంటే తన సినిమా `ఆర్ ఆర్ ఆర్` కారణంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తిందని కొరటాల ఫీలవుతుంటే ఆ పాత్రని తాను చేస్తానని స్వచ్ఛందంగా మహేష్ ముందుకొచ్చారట. చివరి నిమిషంలో మళ్లీ చిరు ఆ పాత్రలో చరణ్ వుండాల్సిందేనని పట్టుపట్టడం వల్లే మహేష్ తప్పుకున్నారని కొరటాల మాటల్లో తేలిపోయింది.