బ్లాక్ బ‌స్ట‌ర్‌కా బాప్ సెల‌బ్రేష‌న్స్ అక్క‌డే!

సూప‌ర్‌స్టార్ ప్రిన్స్ మ‌హేష్ న‌టించిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి త‌న మార్కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి సందేశాన్ని జోడించి తెర‌కెక్కించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. మ‌హేష్ తొలి సారి ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టించ‌డం, 13 ఏళ్ల విరామం త‌రువాత లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి రీఎంట్రీ ఇవ్వ‌డంతో ఈ సినిమాపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుండ‌టంతో తొలి రోజు తొలి ఆట నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.

దిల్ రాజుతో క‌లిసి అనిల్ సుంక‌ర నిర్మించిన ఈ చిత్రం మ‌హేష్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తుండ‌టంతో టీమ్ అంతా సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. గురువారం సంబ‌రాల్లో భాగంగా టీమ్ అంతా క‌లిసి త‌రుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని సంద‌ర్శించింది. నైజామ్‌లో భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తుండ‌టం, దిల్ రాజు రిలీజ్ చేయ‌డం వంటి కార‌ణాల‌తో ఈ చిత్ర స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ని హ‌న్మ‌కొండ‌లో శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించ‌బోతున్నారు.

హ‌న్మ‌కొండ‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రారంభించ‌బోతున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్ పేరుతో నిర్వ‌హించ‌బోతున్న ఈ కార్య‌క్ర‌మానికి మ‌హేష్ ఫ్యాన్స్ భారీగానే త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.