హాలీవుడ్ చిత్రాలు గతంలో డబ్బింగ్ అయ్యి విడుదల అయ్యేటప్పుడు ఇక్కడ నేటివిటి అద్దాలనే సమస్య లేదు. హాలీవుడ్ సినిమాలు అక్కడ నేటివిటీతోనే ఉంటాయనే నిర్ణయంతో నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ మార్కెట్ ని గ్రాబ్ చేయాలి, భారీగా విడుదల చేయాలంటే ఇక్కడ హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తే ఫలితం ఉంటుందని కాలక్రమేణా అక్కడ నిర్మాతలకు తెలిసి వచ్చింది. దాంతో ‘అవెంజర్స్’ సినిమాలో రానా చేత డబ్బింగ్ చెప్పిస్తే…ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ ల చేత అలాడిన్ సినిమాకు డబ్బింగ్ చెప్పించి హిట్ కొట్టారు. అదే కోవలో త్వరలో తెలుగులో రిలీజ్ కానున్న ది లయిన్ కింగ్ సినిమాకు సైతం మన స్టార్స్ నిసీన్ లోకి తెస్తున్నారు.
గతంలో మణిరత్నం `ఓకే బంగారం`లో హీరో పాత్రకు, `అ` సినిమాలో చేప పాత్రకు నాని డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు `ది లయన్ కింగ్`లో సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్తూ వార్తల్లో నిలిచారు. ఈ చిత్రంలో పలు పాత్రలకు ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పడం విశేషం.
అడివి పంది `పుంబా`కు బ్రహ్మానందం, ముంగిస `టిమోన్`కు ఆలీ, `సింబా` తండ్రి `ముఫాసా`కు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. హిందీలో ముఫాసా పాత్రకు షారుఖ్, సింబా పాత్రకు ఆయన కుమారుడు ఆర్యన్ డబ్బింగ్ చెప్పారు. అలాగే తమిళంలో సింబా పాత్రకు సిద్ధార్థ్ గొంతు అరువిచ్చాడు. ఈ సినిమా జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను కూడా జంగిల్ బుక్ సినిమాను తెరకెక్కించన జాన్ ఫెరో ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.
ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా నాని తెలియజేశాడు. ‘‘ఈ ఏడాదిలో నన్ను తండ్రి పాత్రలో చూశారు.. ఇప్పుడు కొడుకు పాత్రలో చూడబోతున్నారు. ఈ జూలైలో నాకు ‘సింబ’ అనే కొత్త పేరు రాబోతోంది.’’ అంటూ నాని ట్వీట్ చేశాడు.