యూత్ హీరో నితిన్ చేసిన తాజా చిత్రం ‘చెక్’. ‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత నితిన్ మీద అంచనాలు పెరిగాయి. ఆయన తర్వాతి సినిమాను చాలా కొత్తగా ఆశించారు ప్రేక్షకులు. కొందరైతే నితిన్ ఓ మంచి లవ్ స్టోరీనా లేకపోతే కమర్షియల్ సినిమానో చేస్తే బాగుంటుందని ఆశించారు. కానీ నితిన్ భిన్నమైన సినిమాతో వెళదామని డిసైడ్ చేసుకుని చేసిన చిత్రం ‘చెక్’. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం కావడంతో నితిన్ ఛాయిస్ సరైందే అనుకున్నారు. డిఫరెంట్ సినిమా ఏదైనా వస్తుందని ఆశపడ్డారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. చెస్ బ్యాక్ డ్రాప్లో చేసిన ‘చెక్’ నిరాశను మిగిల్చింది.
లాక్ డౌన్ అనంతరం రవితేజ నుండి వచ్చిన ‘క్రాక్’ తర్వాత మంచి మార్కెట్ ఉన్న నితిన్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు. ఆసాంతం బోరింగ్ కథనంతో సాగే చిత్రం కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. సినిమా మొత్తం బిజినెస్ రూ.16 కోట్లు వరకు ఉంది. అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే ఆ మొత్తాన్ని టచ్ చేయాలి. కానీ వారం రోజులకు సినిమా వెనక్కు రాబట్టిన మొత్తం 9 నుండి 10 కోట్లకు మధ్యలోనే ఉంది. పైగా ఈ వారం ఆరేడు సినిమాలున్నాయి. వచ్చే వారం ఇంకో అరడజను సినిమాలున్నాయి. వీటిలో ఐదారు చెప్పుకోదగిన సినిమాలున్నాయి. వాటిలో ఏ రెండు మూడు హిట్ అయినా ‘చెక్’ సంగతి క్లోజ్ అయినట్టే.
ట్రేడ్ వర్గాల అంచనా మేరకు ఇంకో రెండు మూడు రోజుల్లో సినిమా రన్ పూర్తవుతుంది. ఈ లెక్కన 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అసాధ్యమనే అనాలి. మంచి హిట్ తర్వాత కమర్షియల్ ఫార్ములాలను పక్కనబెట్టి ఏదో కొత్తదనం చూపిద్దామనుకుని చేసిన ‘చెక్’ సినిమా చివరకు నితిన్ స్పీడుకు బ్రేకులు వేసేసింది.