నాగ‌శౌర్య‌కు తెలివిగా కౌంట‌రిచ్చిన వెంకీ!

`ఛ‌లో` సినిమాతో వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడిగా మారిన విష‌యం తెలిసిందే. నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ఈ సినిమా అత‌ని కెరీర్‌లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఆ ఆనందంలో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌కు నాగ‌శౌర్య మ‌ద‌ర్ ఓ కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతా బాగానే వుంది. అయితే ఆ త‌రువాతే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల `అశ్వ‌థ్థామ‌` సినిమా రిలీజ్ సంద‌ర్భంగా నాగ‌శౌర్య ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త‌మ ఇంట్లో వ్య‌క్తిగా చేర‌దీస్తే ఇప్పుడు త‌మ‌తోనే మాట్లాడ‌టం లేద‌ని, కానుక‌గా ఇచ్చిన కారుని ఎవ‌రికో అమ్మేశాడ‌ని, న‌మ్మిన త‌మ‌కు న‌మ్మ‌క‌ద్రోహం చేశాడంటూ వెంకీ కుడుముల‌పై నాగ‌శౌర్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా వెంకీ కుడుముల రూపొందించిన `భీష్మ‌` చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చాడు వెంకీ కుడుముల‌. ఇటీవ‌ల నాగ‌శౌర్య చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌శ్నిస్తే ఇచ్చిన గిఫ్ట్‌ని అమ్ముకునే వాడిన కాద‌ని, ఈ విష‌యం గురించి మాట్లాడ‌టం త‌న‌కు ఇష్టం లేద‌ని, త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు `భీష్మ‌` విజ‌య‌మే స‌మాధానం చెబుతుంద‌ని తెలివిగా కౌంట‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ కౌంట‌ర్‌పై హీరో నాగ‌శౌర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.