అన్నాదమ్ములు కలిసి ప్రయాణించడం.. విడిపోవడం ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగుతున్నదే. తాజాగా ఇది దిల్ రాజు కుటుంబంలోనూ జరుగుతోంది. టాలీవుడ్లో పేరున్న సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్. ఈ బ్యానర్‌ని ముగ్గురు బ్రదర్స్ దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ స్థాపించారు. `దిల్` నుంచి వీరి ప్రయాణం గత 17 ఏళ్లుగా నిర్విరామంగా సాగింది. కొన్ని సందర్భాల్లో సూపర్హిట్లు చూసింది. కొన్ని సందర్భాల్లో వరుస ఫ్లాప్‌లని కూడా చవిచూసింది.
గత కొంత కాలంగా దిల్ రాజు చెప్పినదానికి తలాడించిన లక్ష్మణ్ తాజాగా ఎదురు తిరగడం ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణం చూసుకుంటే ఇంత కాలం లక్ష్మణ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వున్న ఎస్వీసీ థియేటర్ల నిర్వహణ బాధ్యతల్ని చూసుకుంటూ వచ్చారు. గత కొంత కాలంగా దిల్ రాజు తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదిస్తూ వచ్చిన లక్ష్మణ్ తాజాగా ఎస్వీసీ నుంచి బయటికి వచ్చినట్టు తెలిసింది. బయటికి రావడమే కాకుండా సొంతంగా దిల్ రాజుకు పోటీగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించాడు.
తొలి ప్రయత్నంగా పవన్‌కల్యాణ్, క్రిష్‌ల కలయికలో వస్తున్న సినిమా నైజాం రైట్స్‌ని సొంతం చేసుకోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. చిరు- కొరటాల చిత్రానికి లక్ష్మణ్ తనయుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో అతన్ని ప్రొడ్యూసర్‌గా లక్ష్మణ్ పరిచయం చేయాలనే ప్రయత్నాల్లో వున్నట్టు తెలుస్తోంది.