దిల్‌రాజుకు నాగ‌చైత‌న్య షాక్ ఇచ్చాడా?

ఇబ్బందుల్లో చైతూ సినిమా!

దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ సినిమా ద్వారా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. దీని కోసం బాలీవుడ్ హిట్ `బ‌ధాయి హో` సినిమా రీమేక్ రైట్స్‌ని సొంతం చేసుకున్నారు. అంతా ఓకే తెలుగు వెర్ష‌న్ స్క్రిప్ట్ రెడీ అయింది. అంతా ఓకే అనుకున్నారు. కానీ స‌డెన్ షాక్.. ఆ క‌థ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని దిల్ రాజు ఇచ్చిన ఆఫ‌ర్‌ని నాగ‌చైత‌న్య తిర‌స్క‌రించాడ‌ట‌.

నాగాచైత‌న్య‌తో ప‌దేళ్ల క్రితం దిల్ రాజు `జోష్` చిత్రాన్ని నిర్మించాడు. వాసు వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌మ‌బైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో దిల్ రాజుకు ఎందుకు చైని అప్ప‌గించానా? అని నాగార్జున ఫీల‌య్యాడు. ఆ త‌రువాత మ‌హేష్ సోద‌రి మంజుల నిర్మించిన `ఏమాయ చేసావె` చైకి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించింది.

ఆ త‌రువాత కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసుకోని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం స‌మంత త‌ర‌హాలో త‌ను చేయ‌ద‌గ్గ చిత్రాలు మాత్ర‌మే ఎంచుకుంటూ త‌న కెరీర్‌ని మ‌లుచుకుంటున్నాడు. ఈ స‌మ‌యంలో దిల్ రాజు రీమేక్ సినిమా చేద్దామ‌నడం నాగచైత‌న్య‌కు న‌చ్చ‌లేద‌ట‌. దాంతో ఆ సినిమాని ప‌క్క‌న పెట్టండి. కావాలంటే స్ట్రెయిట్ స్టోరీతో సినిమా చేద్దామ‌ని చెప్పాడ‌ట‌. దీంతో హిందీ రీమేక్ `బ‌ధాయి హో` చిత్రం రీమేక్ రైట్స్ కోసం పెట్టిన డ‌బ్బులు వేస్ట‌యిపోయిన‌ట్టేన‌ని, దిల్ రాజు ఆ మొత్తం న‌ష్ట‌పోయిన‌ట్టేన‌ని చెబుతున్నారు.