కరోనా కల్లోలం బోలెడన్ని పాఠాలు నేర్పిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ కి రకరకాల పాఠాలు నేర్పిస్తోంది. కమల్ హాసన్ ప్రవచించిన డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్)కి ఈసారి పాజిబిలిటీ కనిపిస్తోంది. జనం థియేటర్లకు రారు ఇక. ఓన్లీ డిజిటల్! అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏడాది తర్వాత సంగతేమో కానీ.. ఈలోగా ఇదే పరిస్థితి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
ఇక కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగుల్లేక చిన్నా చితకా ఆర్టిస్టులు కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నదే. సీసీసీ కమిటీ సహా ధాతలు అందించే నిత్యావసరాల కోసం బారులు తీరి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఆర్టిస్టులెందరో. ఇక ఇలాంటి చిన్నా చితకా ఆర్టిస్టులతో ప్రారంభించిన టీఎంటీఏయు (తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం) లో అసలు లుకలుకలు బయటపడుతున్నాయి. గత ఐదారేళ్లుగా ఎంతో యాక్టివ్ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంఘంలో మొత్తం 800 పైగా ఆర్టిస్టులు ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తర్వాత అంతే పెద్ద అసోసియేషన్ గా పాపులరైంది. 24 క్రాఫ్టుల్లో ఇది లేకపోయినా మెర్జ్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతున్నారు. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ గ్రూపులో ఉన్న చాలా మంది నిత్యావసరాల కోసం సీసీసీని అర్థించారు. అట్నుంచి 50 మంది వరకూ సరుకుల్ని అందించే ఏర్పాటు సాగింది. కొందరు దాతలు మరీ పేద ఆర్టిస్టులకు చిన్నా చితకా ఆర్థిక సాయం చేసిన సందర్భాలున్నాయి.
ఇకపోతే ఇప్పుడు టీఎంటీఏయుకి చెల్లిస్తున్న 10 వేల అద్దెతోనే వచ్చింది చిక్కు. కరోనా వల్ల షూటింగుల్లేవ్. అసోసియేషన్ కి ఆదాయం లేదు. పైగా ఉన్న ఫండ్ అంతా ఖర్చయిపోతోంది. ఎలానూ కరోనా ఏడాది పాటు దిగ్భంధనం చేసేయనుంది కాబట్టి ఇప్పుడు ఆఫీస్ ని రిమూవ్ చేయాలని భావిస్తున్నారు. అయితే కరోనా వేళ 3నెలలకు 30 వేలు ఖర్చయిపోవడంపై యూనియన్ సభ్యులు అభ్యంతరం లేవనెత్తుతున్నారు. పరిస్థితిని గ్రహించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడం లేదని అధ్యక్షుడిపైనా దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై గ్రూప్ సభ్యుల్లో కలతలు మొదలయ్యాయి. ఇక ఇటీవలే 30 ఇయర్స్ పృథ్వీపై పొలిటికల్ ఆరోపణల నేపథ్యంలో తి.తి.దే భక్తి చానెల్ పదవి నుంచి తప్పుకున్నట్టే టీఎంటీఏయు సంఘం అధ్యక్ష పదవికి రాజీ నామా చేశారు. త్వరలోనే అసోసియేషన్ ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షుడిని ప్యానెల్ ఈసీ కమిటీల్ని ఎంపిక చేయనున్నారు. ఈలోగా జరుగుతున్న రాద్ధాంతంపై సభ్యుల్లో వాడి వేడి చర్చ సాగుతోంది. ఇక ఆర్టిస్టుల నుంచి డబ్బు గుంజే కోఆర్డినేటర్ వ్యవస్థను నాశనం చేయాలన్న డిమాండ్ యూనియన్ లో ఎప్పటి నుంచో ఉన్నా ఏమీ చేయలేని ధైన్యం అలానే ఉంది. కరోనా ఇలాంటి చిన్న వాళ్లపైనే ఏ రేంజులో ప్రభావం చూపిస్తోందో అర్థమవుతోంది కదూ?
