స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్. నారాయణమూర్తికి మరో వెర్షన్ అనుకోవచ్చు. ఆయన విప్లవ చిత్రాలని డైరెక్ట్ మోటీవ్తో చేస్తే అదే తరహా కథాంశాలకు కమర్షయల్ హంగుల్ని జోడించి అభ్యుదయభావాలతో సినిమాలు చేస్తుంటారు కొరటాల శివ. వామపక్ష భావాలున్న కుటుంబం నుంచి వచ్చిన కొరటాలకు సామాజిక బాధ్యత, సమాజం పట్ల అవగాహన ఎక్కువే. సమాజానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపన, కసి ఆయన చిత్రాల్లో కనిపిస్తూ వుంటుంది.
కెరీర్ ప్రారంభం నుంచి నిన్నటి `భరత్ అనే నేను` వరకు ఆయనది అదే పంథా. ప్రస్తుతం మెగాస్టాన్ చిరంజీవి హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న భారీ చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలోనూ ఆయన తన పంథానే అనుసరిస్తున్నారు. దాదాపు రామ్చరణ్ పాత్ర మినహా చిత్రీకరణ యాభై శాతం పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. ఇదిలా వుంటే కరోనా క్రైసిస్ కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు, సినీ కార్మికుల పరిస్థితి మరీ దైన్యంగా మారింది.
దీంతో చిరంజీవి చైర్మన్గా కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) పేరుతో సినీ పరిశ్రమ వర్గాలు ఓ ఛారిటీని ప్రారంభించారు. దీనికి చాలా మంది హీరోలు, నిర్మాతలు విరాళాలు అందించారు. దాదాపు 6 కోట్లకు పైగానే వసూళ్లు అందాయి. దీనికి కొరటాల కూడా తన వంతుగా కొంత మొత్తాన్ని అందించాడు. అయితే తన ప్రతి సినిమా నుంచి వచ్చే మొత్తంలో సగం చారిటీలకే ఖర్చు చేస్తుంటాడట. `ఆచార్య`కు కొరటాల రెమ్యునరేషన్ 15 కోట్లు. అందులో సగం చారిటీలకే ఇచ్చేశాడట. అంటే ఏడున్నర కోట్లు..ఇంత గొప్ప మనసు ఎవరికుంటుంది. ఈ విషయం తెలిసిన సినీ వర్గాలు కొరటాల నిజంగా గ్రేట్ అంటున్నారు.