కరోనాని అప్ప‌నంగా వాడేస్తున్న విల‌న్

కరోనాని అప్ప‌నంగా వాడేస్తున్న విల‌న్

కరోనా వైర‌స్ ని కొంత మంది సెల‌బ్రిటీలు ప్ర‌చారం కోసం ఓ రేంజ్ లో ఉప‌యోగించేస్తున్నారు. సీరియ‌స్ గా కొవిడ్ -19పై ఫైట్ చేసేవారు కొంద‌రైతే… టిక్ టాక్ వీడియోల‌తో పాపుల‌ర్ అవుతోన్న సెల‌బ్రిటీలు ఇంకొంద‌రు. కార‌ణ‌మేదైనా క‌రోనా పేరుతో త‌మ దైన ప్ర‌చారం చేసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఉప్పెన‌ క్యారెక్ట‌రైజేష‌న్ ని ఉద్దేశించి “అత‌ను ఓ క‌రోనా లాంటాడు!“ అంటూ ఓ కొత్త ప్ర‌చారం తెర‌పైకి తెచ్చాడు. తెలుగు మీడియాలో ఈ త‌ర‌హా ప్ర‌చారానికి తెర తీసారు. అస‌లు ఇదెలా అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

విజ‌య్ సేతుప‌తి న‌ట‌న గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. హీరో గెట‌ప్ అయినా…విల‌న్ గెట‌ప్ అయినా రియ‌లిస్టిక్ పెర్పామెన్స్ తో మెప్పిస్తాడు. అందుకే కోలీవుడ్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టి స్టార్ అయ్యే స‌త్తా విజ‌య్ కే ఉంద‌ని కోలీవుడ్ మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న ఉప్పెన సినిమాలో విల‌న్ పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో విజ‌య్ పాత్ర క‌రోనా వైర‌స్ లా ఉంటుందంటూ యూనిట్ ఇన్ సైడ్ ప్ర‌చారం చేసుకుంటోంది. ఈ విష‌యం ఆ నోటా .. ఈనోటా చేరి చివ‌రికి వెబ్ మీడియాకి ఎక్కేసింది. ఉప్పెన‌లో విజ‌య్ రోల్ అంద‌ర్నీ ఆవ‌హించేలా..అత్యంత క్రూరంగా…కర్క‌శంగా ఉంటుంది. అత‌ని పాత్ర‌లో స‌న్నివేశానుసారం ఎమోష‌న్స్ వైర‌స్ లా త‌న చుట్టు ప‌క్క‌న ఉన్న‌వారికి పాకేస్తాయంటూ ప్ర‌చారం వేడెక్కించేస్తున్నారు. హీరోకి ధీటుగా ఆ పాత్ర సినిమాలో అంతే హైలైట్ గా నిలుస్తుంద‌నేది యూనిట్ ధీమా. ఇలా క‌రోనా వైర‌స్ ని ఉప్పెన టీమ్ వాడుకోవ‌డం విశేషం. అన్న‌ట్లు ఉప్పెన క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.