ఎంజీఆర్ లుక్ వ‌చ్చేసిందిగా!

దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, న‌టి పురుచ్చిత‌లైవి జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా ఓ బ‌యోపిక్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. వెబ్ సిరీస్‌తో పాటు నిత్యామీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా కూడా రాబోతోంది. అయితే అంద‌రి చూపు మాత్రం ఏ.ఎల్‌. విజ‌య్ రూపొందిస్తున్న `త‌లైవి` చిత్రంపైనే వుంది. ఇందులో జ‌య‌ల‌లిత‌గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న‌ర‌నౌత్ న‌టిస్తోంది. ఎంజీఆర్ (ఎంజీ రామ‌చంద్ర‌న్‌) పాత్ర‌లో అర‌వింద‌స్వామి న‌టిస్తున్నారు.

క‌రుణానిధిగా ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌గా ప్రియ‌మ‌ణి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కంగ‌న లుక్‌తో పాటు టీజ‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. జ‌య‌ల‌లిత పాత్ర‌లో కంగ‌న ఒదిగిపోయిన‌ట్టుగా క‌నిపించింది. అయితే స‌భా ప్రాంగ‌ణానికి సంబంధించిన స‌న్నివేశాల్లో మాత్రం కంగ‌న క‌నిపించ‌లేదు. ఆ స‌న్నివేశాల్లో జ‌య‌ల‌లిత మాత్ర‌మే క‌నిపించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. తాజాగా ఎంజీఆర్ జయంతి సంద‌ర్భంగా సినిమాలో ఆయ‌న పాత్ర పోషిస్తున్న అర‌వింద‌స్వామి లుక్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప‌ల్ల వ‌రుస‌, మూతి భాగం, క్రాఫ్ మార్చేయ‌డంతో అర‌వింద స్వామి అచ్చం ఎంజీఆర్‌ని త‌ల‌పిస్తున్నారు.

ఈ లుక్ ఎంజీఆర్ అభిమానుల‌తో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ చిత్రాన్ని విష్ణు వ‌ర్థ‌న్ ఇందూరి, శైలేష్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కె.వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందించిన ఈ చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో జూన్ 26న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.