`ఆర్ ఆర్ ఆర్` వ‌ర‌ల్డ్‌కి స్వాగ‌తం చెప్పేశాడు!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` సెట్‌లో హంగామా మొద‌లైంది. హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ అజ‌య్‌దేవ‌గ‌న్‌, రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌గా పతాక ఘ‌ట్టాల‌ని త‌ల‌పించే కీల‌క స‌న్నివేశాల‌ని జ‌క్క‌న్న షూట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఈ ముగ్గురు `ఆర్ ఆర్ ఆర్‌` సెట్‌లో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చిన ఓ ఫొటోని రిలీజ్ చేసింది. అజ‌య్‌దేవ్‌గ‌న్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి వున్న కూల్ పిక్ ఆక‌ట్టుకుంటోంది.

అయితే ఇదే ఫొటోని మ‌రో స్టైల్లో త‌న అభిమానుల కోసం హీరో యంగ్ టైగ‌ర్ షేర్ చేశారు. బాలీవుడ్ హీరో అజ‌య్‌దేవ‌గ‌న్‌కి స్వాగ‌తం ప‌లుకుతూ ఓ పోస్ట్ పెట్టారు. `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌పంచానికి మిమ్మ‌ల్ని ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా వుంది అజ‌య్‌దేవ‌గ‌న్ స‌ర్` అంటూ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గ‌త వారం రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో రాజ‌మౌళి కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. అజ‌య్‌దేవ్‌గ‌న్ బ్రిటీష్ అధికారుల‌తో క‌లిసి ప‌నిచేసే పోలీస్ ఆఫీస‌ర్‌గా ఇందులో క‌నిపిస్తార‌ని, ఆయితే ఆయ‌నే ఈ ఇద్ద‌రికి ఓ సంద‌ర్భంలో సహాయంగా నిలుస్తార‌ని తెలుస్తోంది.