దెయ్యం లేకున్నా ఫరక్ పడదు!  ‘వేరీజ్ వెంకట లక్ష్మి’ (మూవీ రివ్యూ)

దెయ్యం లేకున్నా ఫరక్ పడదు!  
‘వేరీజ్ వెంకట లక్ష్మి’
దర్శకత్వం :  వై. కిషోర్ కుమార్ 
తారాగణం : లక్ష్మీ రాయ్, రాంకార్తీక్, పూజితా పొన్నాడ, మధునందన్, ప్రవీణ్, పంకజ్ కేసరి తదితరులు 
రచన : టి. కిరణ్,  సంగీతం : హరి గౌర, ఛాయాగ్రహణం : వెంకట రమణ 
నిర్మాతలు : ఆనంద్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి 
విడుదల : మార్చి 15, 2019
1.75 / 5

          ఇంకా హార్రర్ కామెడీలు చూసే ప్రేక్షకులున్నారా? ఒక దెయ్యం, ఆ దెయ్యాన్ని చూసి కామెడీగా జడుసుకునే పాత్రలు, ఆ దెయ్యం డిమాండ్లూ చూసి చూసి వున్న ప్రేక్షకులకి మళ్ళీ ఇంకోటి చూపించారు. దీనికి లక్ష్మీరాయ్ తో క్రేజ్ వస్తుందనుకుని వుంటారు. ఒకవేళ ఈ సబ్జెక్టు దెయ్యం కామెడీల ట్రెండ్ లో ఓకే అయి, ఇప్పుడు తీయడం పూర్తయిందేమో. దీంతో పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది. దీనికోసం ఏంతో శ్రమించి వుండే కొత్త దర్శకుడికి మైనస్సే అయింది. అయినా ఇందులో దెయ్యం లేకపోయినా ఏం తేడా రాదన్నట్టుగా తీశాడు. ఇది మంత్రాల పెట్టే కోసం మామూలు కామెడీయే అయినప్పుడు,  హార్రర్ కామెడీ అంటూ హడావిడీ చేయడమెందుకు? 
కథ 
          ఆ గ్రామంలో రమేష్ (ప్రవీణ్), సురేష్ (మధునందన్) లు బామ్మ (అన్నపూర్ణ) పెంచుకున్న అనాధలు. వీళ్ళకి చంటి, పండు అనే మారు పేర్లుంటాయి. వూళ్ళో నానా రకాల పిచ్చి చేష్టలకి పాల్పడి బతికేస్తూ అందరికీ తలనొప్పిగా తయారవుతారు. వీళ్ళకి శేఖర్ (రాం కార్తీక్) అనే  మిత్రుడు వుంటాడు. ఇతడి మాటే వింటారు. ఇతను పక్క వూళ్ళో ముఠా నాయకుడు వీరా రెడ్డి (పంకజ్ కేసరి) చెల్లెలు గౌరీ (పూజితా పొన్నాడ) ని ప్రేమిస్తూంటాడు. ఆ ప్రేమలో ఒక సమస్య వస్తే అభ్యంతరకరంగా తీరుస్తారు చంటీ పండులు. దీంతో ఆమె శేఖర్ కి ఛీ కొట్టి వెళ్ళిపోతుంది. ఇంతలో ఊళ్ళోకి వెంకట లక్ష్మి (లక్ష్మీరాయ్) అనే సౌందర్యవతి  టీచర్ గా వస్తుంది. చంటి, పండులు ఆమె వెంటపడి  వసతి ఏర్పాటు చేస్తారు. ఆమె పనులు చేస్తూంటారు. ఎలాగైనా ఆమెని పెళ్లి చేసుకోవాలని పోటీలు పడతారు. అప్పుడామె మనిషి కాదు దెయ్యమని తెలుస్తుంది. దెయ్యంగా వున్న వెంకట లక్ష్మి బీభత్సం సృష్టించి, వీరారెడ్డి దగ్గరున్న ఒక పెట్టె  తెచ్చివ్వక పోతే చంపేస్తానని బెదిరిస్తుంది. ఇరుకున పడ్డ చంటి, పండులు ఆ పెట్టె కోసం ఏం పాట్లు పడ్డారన్నది మిగతా కథ. 

ఎలా వుంది కథ 

          దీన్ని హార్రర్ కామెడీ అనుకుని తీశారు. కానీ ఇందులో దెయ్యానికి పనేలేదు, కమెడియన్ లిద్దరికి మాత్రమే పనుంది – పెట్టె తెచ్చి పెట్టే పని. దెయ్యం చేసేదల్లా అప్పుడప్పుడు కనిపించి వీళ్ళని బెదిరించడమే. బెదిరించే పనే అయితే ఆమె దెయ్యమెందుకవ్వాలి? టీచర్ గా ఊళ్ళోకి వచ్చిన తను మనిషిగానే వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పెట్టె తెప్పించుకోవచ్చు. లేదా తనంటే పడి చస్తున్న వీళ్లకి పెళ్లిని ప్రామీస్ చేసి పని పూర్తి చేసుకోవచ్చు. ఈ కామన్ సెన్స్ లేకుండా ఈ కథ చేశారు. ఆమె దెయ్యమే అయితే ఆ పెట్టె తనే తెచ్చుకోవచ్చుగా అన్న సందేహానికి – వీరారెడ్డి ఇంటి చుట్టూ బంధం వేశాడని చెప్పించారు. ఇంటి చుట్టూ కాదు ఈ సినిమా జాతకానికే బంధం వేసినట్టయ్యింది. ఇంటి చుట్టూ బంధం వేశాడని దెయ్యాన్ని ఆపడం వల్ల – దెయ్యం పని లేకుండా కూర్చుని, పనంతా కమెడియన్లు మీదేసుకోవాల్సి వచ్చింది. ఆ బంధాన్ని బ్రేక్ చేయాలనీ దెయ్యం బీభత్సం చేసే కథగా వుండాల్సింది, దద్దమ్మ దెయ్యం కథగా – కాదు – నాటు కమేడియన్ల ‘కత’ గా తయారయ్యింది. 

ఎవరెలా చేశారు 

          టీచర్ గా వచ్చి దెయ్యంగా బయట పడే లక్ష్మీ రాయ్ టీచర్ గా ఎక్స్ పోజ్ చేసి, దెయ్యంగా మైనస్ అయిపోయింది – అర్ధం లేని దెయ్యం పాత్రవల్ల. కమెడియన్లని చూసి గట్టి అరుపులు అరవడం తప్ప పనే లేకుండా పోయింది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో ఆమె కథకూడా బలహీనమే. క్లయిమాక్స్ డిటో.  ఆమె ఎక్స్ పోజింగ్ కి కింది తరగతి ప్రేక్షకులు కనెక్ట్ కావచ్చేమోగానీ, దెయ్యంగా చూస్తే హార్రర్ ఫీల్ కారు, కామెడీ ఎంజాయ్ చేయరు.

          కమెడియన్లు ప్రవీణ్, మధునందన్ లది నాటు కామెడీ. కొన్ని చోట్ల వెగటు పుట్టే కామెడీ. పెట్టె కోసం విలన్ ఇంట్లో చేరి పాల్పడే చేష్టలు శ్రీను వైట్ల సెకండాఫ్ ఫార్ములానే. ఆడ వేషం వేసి పాటలు పాడడం, రేప్ చేయడానికి విలన్ మనుషులు వెంట పడడం మొదలైన అసభ్య చేష్టలతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా వీళ్ళకి మొట్టమొదటి సారిగా హీరోలుగా దక్కడం పేరు చెడగొట్టు కోవడానికే అన్నట్టుంది. విలన్ గా పంకజ్ కేసరికి అంత స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. లవర్స్ గా రాం కార్తీక్, పూజితా పొన్నాడ ఇంప్రెస్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళకి అడల్ట్ సీన్లు పెట్టారు. కొత్త దర్శకుడు –  ఆ మాటకొస్తే దర్శకులందరూ ఎప్పట్నించో కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం అన్నీ తామే చేసుకునే మేకర్లుగా రావడం మొదలెట్టేశారు. ఈ మూవీకి కొత్త దర్శకుడు కిషోర్ కుమార్ మాత్రం కథ – మాటలు – స్క్రీన్ ప్లే కొత్త రచయిత కిరణ్ కిచ్చేశాడు. ఇద్దరూ ఈ మూవీ విషయంలో చేతులెత్తేశారు. ఈ మూవీలో బావున్నదల్లా రెండు పాటలు, కెమెరా వర్క్ మాత్రమే. 

చివరికేమిటి           

పూరీ జగన్నాథ్ – శ్రీను వైట్ల ఇద్దరి టెంప్లెట్స్ ని ఫస్టాఫ్ – సెకండాఫ్ లుగా జోడించి పని కానిచ్చేశారు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ కథ లేని కమెడియన్ల కామెడీలు. ఇంటర్వెల్లో దెయ్యం ఎంట్రీ, బెదిరింపు. సెకండాఫ్ లో కమెడియన్లు విలన్ ఇంట్లోకి ఎంట్రీ, కామెడీలు. దెయ్యంతో హార్రర్ కథ పేరుకే. మొత్తం కమెడియన్ల కామెడీలే. సెకండాఫ్ భరించడం చాల కష్టం. కేవలం పెట్టె తీసుకు వచ్చే బలహీన పాయింటుతో విషయం లేని కథనం. బోరు కొడుతుందని లక్ష్మీ రాయ్ తో ఐటెం సాంగ్. ఆడ వేషాల్లో కమెడియన్లతో రీమిక్స్ సాంగ్. ఒక సినిమాగా వుండాల్సిన అసలు విషయం వదిలేసి, నిలబెట్టడానికి నానా పాట్లు. ఈ సినిమా కి లక్ష్మీ రాయ్ ని ఒప్పించడమే దర్శకుడు, నిర్మాతలు సాధించిన గొప్ప విజయం!

―సికిందర్