క‌ళ్యాణ్‌ దేవ్ చప్పటి ‘విజేత’ : సినిమా రివ్యూ 


రచన –  ద‌ర్శ‌క‌త్వం: రాకేష్ శ‌శి
తారాగ‌ణం: క‌ళ్యాణ్‌ దేవ్‌, మాళ‌వికా నాయ‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప్ర‌గ‌తి,  జ‌య‌ప్ర‌కాశ్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు
సంగీతం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న రామేశ్వ‌ర్‌  ఛాయాగ్ర‌హ‌ణం: కె.కె.సెంథిల్ కుమార్‌
బ్యానర్ : నిర్మాణ సంస్థ‌: వారాహి చ‌ల‌న చిత్రం
నిర్మాత‌: ర‌జ‌నీ కొర్ర‌పాటి, సాయికొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్స్‌
రేటింగ్ : 2/5
***

          మెగా వారసుల వరసలో మరో హీరో చేరిపోయాడు. మెగా శ్రేణిలో ఎంతమంది హీరోలున్నారో గుర్తుంచుకోవడం కష్టవుతున్న తరుణంలో, ఈసారి అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడే బరిలోకి దూకాడు. అల్లుడు కళ్యాణ్ దేవ్ మామగారి సినిమా టైటిల్ ‘విజేత’ తో, మామగారి నాటి శైలిగల సినిమానే, మామగారి కనుసన్నల్లో రంగప్రవేశం చేసి కానిచ్చాడు. యూత్ ని ఉర్రూతలూగించే సినిమాతో కాకుండా,  యూత్ కి నీతిబోధ చేసే అధిక మోతాదు సెంటి మెంటల్ ఫ్యామిలీ డ్రామాకి తెర తీశాడు. కొత్త దర్శకుడు రాకేష్ శశికి ఈ కొత్త మెగా వారసుణ్ణి పరిచయం చేసే అదృష్టం దక్కింది. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం దీన్ని చేపట్టింది. ‘బాహుబలి’  ఫేం సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం చేపట్టారు. ఆకర్షణలన్నీ బాగా కుదిరాయి.  మరి ఆకర్షణలకి తగ్గట్టుగా ఈ ఫ్యామిలీ డ్రామా- తండ్రి కొడుకుల అనుబంధం వుందా?  ఏ మేరకు కొత్త దర్శకుడు దీన్ని నిలబెట్టి, కళ్యాణ్ దేవ్ ని కొత్త మెగా విజేతగా ఎస్టాబ్లిష్ చేశాడు? ఒకసారి చూద్దాం…

కథ
          ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగి శ్రీనివాసరావు (మురళీశర్మ)  కొడుకు రామ్ (కళ్యాణ్ దేవ్) ఇంజనీరింగ్ చేసి, ఏ పనీ చేయక ఫ్రెండ్స్ తో అవారాగా తిరుగుతూంటాడు. తండ్రి చేత చివాట్లు తింటూంటాడు. తల్లి, చెల్లెలు వుంటారు. ఎదురింట్లో దిగిన చైత్ర (మాళవికా నాయర్) ని చూసి ఆమె వెంటపడడం ఇంకో కార్యక్రమంగా పెట్టుకుంటాడు రామ్. ఒకానొక సమయంలో ప్రయోజకుడు కావాలన్న ఉద్దేశంతో ఈవెంట్ మేనేజిమెంట్ ని చేపడతాడు. ఆ సందర్భంగా జరిగిన ఒక తప్పువల్ల తండ్రి శ్రీనివాసరావు గుండెపోటుకి గురవుతాడు. అప్పుడు శ్రీనివాసరావు స్నేహితుడు (తనికెళ్ళ భరణి), శ్రీనివాసరావు గురించి ఒక నిజం చెప్తాడు. తను గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలన్న కలని కుటుంబ బాధ్యతల కారణంగా తండ్రి వదులుకున్నాడన్న నిజం తెలుసుకున్న రామ్ ఇక తండ్రి కోరికని తీర్చాలని నిర్ణయిం చుకుంటాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ
          ముందే చెప్పినట్టు ఫ్యామిలీ జానర్ కథ. ఇలాటి కథలు గతంలో ఎన్నో వచ్చాయి. అదే టెంప్లెట్ లో పెట్టి దీన్నీ తీశారు. తెలుగులో ఫ్యామిలీ సినిమాలంటే పాత ఫార్ములా టెంప్లెట్టే ఇంకా పనిచేస్తుందన్న అపోహతో వున్నారు. ఇవాళ్టి మార్కెట్ యాస్పెక్ట్ ని గుర్తించడం లేదు. దాంతో క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా మూస లోనే వుంటోంది. ఈ రెండిటి పరంగా ఇది కాలం చెల్లిన కథలా తయారయ్యింది. తండ్రి కల కొడుకు తీర్చాలన్న పాయింటు యూనివర్సల్ అప్పీలున్నదే. కొత్త యువదర్శకుడు కూడా వచ్చి  ఇంకా పాత మూసలోనే తీస్తానంటే అది వృధా ప్రయాసే. ప్రేక్షకులు పాత ఫ్యామిలీ సినిమాలే చూసుకోగలరు. మళ్ళీ కొత్తగా పాత సినిమా తీయాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడైన ఈ దర్శకుడు కథ ఆయనకి విన్పించి సలహా సూచనలు పొంది వుండడు. పొంది వుంటే పాతని కొత్త ఎలా చేయాలో తెలిసేదేమో.

ఎవరెలా చేశారు
          కళ్యాణ్ దేవ్ శిక్షణ పొందిన నటుడే. కెమెరాకి  ఇంకా పాత బడాలి. ముఖ్యంగా కళ్ళల్లో భావాలు పలికించగల్గాలి. తనకున్న  పెద్ద మైనస్ భావాలు పలకని కళ్ళే. దీన్ని సవరించుకో గల్గాలి. ఇక సినిమాలో నటించేశానని వూరుకోకుండా, శిక్షణ పొందుతూనే వుండాలి. సాధారణంగా కొత్తగా వచ్చేహీరోలు తేలికపాటి యూత్ అప్పీలున్న సినిమాలు నటించేస్తూంటారు. తను భారీ సీరియస్ ఎమోషనల్ డ్రామా భుజాన వేసుకున్నాడప్పుడే. కామెడీ, హీరోయిన్ తో రోమాన్స్ కూడా అంతంత మాత్రమే. ఈ సినిమాలో జరిగిన  లోపాలు సవరించుకోవడానికి కృషి చేస్తే,  మెగా వారసుడిగా నిలబడ గల్గుతాడు.
పేరుకి కళ్యాణ్ దేవ్ సినిమానే గానీ, అంతా భుజాన మోసేది తండ్రి పాత్రలో మురళీ శర్మనే. ఈయన లేకుండా వుంటే ఈ ఫ్యామిలీ డ్రామా కుప్పకూలేదే. పరకాయప్రవేశం చేయడం, పాత్రకి జీవం పోయడం వంటి విశేషణాలకి పర్యాయపదంగా మారాడు. ఏమైనా ఈ ఫ్యామిలీ డ్రామాకి కమర్షియల్ విలువంటూ వుంటే ఈయనతోనే. ఈయన గురించి మౌత్ టాక్ తోనే ఈ సినిమాకి ఫ్యామిలీ ప్రేక్షకులు తరలిరావాలి.
హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్‌ కి సరైన పాత్రే లేదు. దానికి ప్రముఖ్యమే లేదు. అసలు ప్రేమకి కూడా స్థానమే లేదు ఈ తండ్రీ కొడుకుల ఫ్యామిలీ డ్రామాలో. సత్యం రాజేష్ కామెడీ ఫర్వాలేదు. తనికెళ్ళ భరణీ ఓకే.
ఖర్చు బాగానే పెట్టారుగానీ, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం తప్ప ఇతర సాంకేతికాలు ఏమంత గొప్పగా లేవు. పాటలు కూడా చప్పగా వున్నాయి.

చివరికేమిటి
          ఇది కొత్త దర్శకుడు తీసిన ఫ్రెష్ సినిమాగా ఎక్కడా అన్పించదు. అంత పాత మూసలోనే వుంటుంది. తెలుగు సినిమా అంటే ఫస్టాఫ్ కామెడీతో కాలక్షేపం చేయడం, సెకండాఫ్ లో మాత్రమే కథని అందుకోవడం లాంటి రొటీన్ టెంప్లెట్ తప్ప, తను కనబరచిన తేడా ఏమీ లేదు. అంతా  హీరో ఆవారాగిరీతో కథలేకుండా కామెడీగా కాలక్షేపం చేశాక, వచ్చే మలుపుతో సెకండాఫ్ లోనే కథ వస్తుంది. తండ్రి కల హీరో నెరవేర్చే కథ. ఈ కథనం కూడా తెగుతూ అతుకుతూ సాగుతుంది. చివరి పది నిమిషాల్లోనే  గాడిలో  పడుతుంది. చివరి పది నిమిషాలు ప్రేక్షకుల్ని కట్టి పడేయగల్గితే చాలు,  మిగతా ఎలా వున్నా వున్నా మర్చిపోతారనే స్కీము ఒకటి వుంది. ఈ స్కీము వర్కౌట్ అయితే ఈ సినిమా నిలబడుతుంది, లేకపోతేలేదు. మర్కెట్ యాస్పెక్ట్ కి ఒకటి గుర్తించలేదు. ఎంత ఫ్యామిలీ డ్రామా తీయాలన్నా ఈ రోజుల్లో యూత్ అప్పీల్ ఆక్సిజన్ తప్పని సరని!

సికిందర్