‘అంతరిక్షం’ మూవీ రివ్యూ

-సికిందర్

***
తెలుగులో తొలి అంతరిక్ష సైన్ ఫిక్షన్స్ ‘అంతరిక్షం’ అందించాడు ‘ఘాజీ’ ఫేమ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈసారి గ్లామర్ తారలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపే ప్రయత్నం చేశాడు.

మొన్నే రజనీకాంత్ 2.0 సైన్స్ ఫిక్షన్ వచ్చిన నేపధ్యంలో, ‘అంతరిక్షం’ లో అలాటిదే కమ్యూనికేషన్ వ్యవస్థని ప్రస్తావిస్తూ తీశారు. రెండిటి రేంజిలు వేర్వేరు అయినా ‘అంతరిక్షం’ దాని పరిధిలో ఏ మేరకు బాక్సాఫీసుకి న్యాయం చేకూర్చిందో చూద్దాం.

కథ

ఫ్లోరిడా లోని శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్ నుంచి ఇండియన్ స్పేస్ సెంటర్ (ఇ ఎస్ సి) కి ఎలర్ట్ వస్తుంది. ఇ ఎస్ సి ప్రయోగించిన ఉపగ్రహం మిహిర గతి తప్పింది. ఇది ఇతర దేశాల ఉపగ్రహాలని ఢీకొంటే అవి ద్వంసమై ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కుప్పకూలు తాయి. దీంతో (ఇ ఎస్ సి) చైర్మన్ (రెహ్మాన్) వెంటనే చర్యలు గైకొంటాడు. కానీ మిహిరని తిరిగి కక్ష్యలోకి రప్పించాలంటే మాన్యువల్ ప్రయత్నం అవసరం. ఇది చేపట్టగల ఒకే ఒక్క వ్యోమగామి దేవ్ (వరుణ్ తేజ్). ఐదేళ్ళక్రితం ప్రయోగించిన విప్రయాన్ ఉపగ్రహ వైఫల్యంతో బాధపడి అతను వెళ్ళిపోయాడు. అతనెక్కడున్నాడో వెతికి తీసుకొచ్చే బాధ్యత వ్యోమగామి రియా (అదితీరావ్ హైదరీ) తీసుకుంటుంది.

దేవ్ ఓ మారుమూల గ్రామంలో పిల్లలకి సైన్స్ పాఠాలు చెప్పుకుంటూ వుంటాడు. అతన్ని కలుసుకుని విషయం చెప్తుంది. అతను ఈ మిషన్ లో సాయమందించడానికి నిరారిస్తాడు. ఎలాగో ఒప్పించి తీసుకు వస్తుంది. ఇక దేవ్, రియాలతో బాటు మరో ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోకి బయల్దేరతారు. ఈ క్రమంలో ఉపగ్రహం మిహిర సమస్యని ఫిక్స్ చేయడానికి ఈ బృందం ఎదుర్కొన్న సాదకబాధకాలే మిగతా కథ.

ఎలావుంది కథ

అమెరికా అంతరిక్ష విజయాలు ఇప్పుడున్నంత టెక్నాలజీ అభివృద్ధి చెందని కాలంలోనే చంద్రమండలం చేరుకునే దాకా సాగాయనీ హాలీవుడ్ క్రిటిక్ రోజర్ ఎబర్ట్ పేర్కొన్నాడు. ఇప్పుడు కొత్త మిశ్రమ లోహాలు, ఇంజన్లు, ఇంధనాలు, కంప్యూటర్లు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కూడా తగిన సంకల్ప బలం (సంకల్ప్ రెడ్డి కాదు) లేక అంతరిక్ష వైఫల్యాలెదుర్కొంటున్నామనీ, ‘అపోలో 13’ (1995) కి రివ్యూ రాస్తూ ఆయన నోట్ చేశాడు.

ఇప్పుడు టాలీవుడ్ అందించిన ‘అంతరిక్షం’ లో ఈ వైఫల్యాలే – ఒకటి కాదు రెండు సార్లు వైఫల్యాలు చూపించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. పైగా ఇందులో వ్యోమగామి పాత్రలు ఏదో ఘన కార్యం సాధించినట్టు, దేశానికి గర్వకారణంగా, పనిలో పనిగా దేశభక్తి ఫార్ములా జోడించి చూపించారు. విఫల ప్రయోగాలు చూపించి, వాటిని బాగు చేయడం దేశానికే గర్వకారణమెలా అవుతుందో అర్ధంగాదు. ఇండియా అంతరిక్ష ప్రయోగాలు ఇలా మేలు రకంగా వుండవని ప్రపంచానికి ప్రకటించుకోవడమేమో.

గత జూన్ లో తమిళంలో ‘టిక్ టిక్ టిక్’ అనే అంతరిక్ష చలన చిత్రం వచ్చింది. అందులో అంతరిక్ష విజయం చూపించారు. అంతరిక్షం లోకెళ్ళి చెన్నై వైపు దూసుకొస్తున్న గ్రహ శకలాన్ని పేల్చి వేసే వీరోచిత అంతరిక్ష సాహసం. ఇలాటి ముప్పులెదుర్కొని ప్రపంచాన్ని రక్షించే పని అమెరికా మాత్రమే గుత్తకి తీసుకుని చేస్తుందని చిత్రిస్తూ, హాలీవుడ్ సినిమాలు తీస్తూంటుంది. ఈ పొగరు అణిచారు ‘టిక్ టిక్ టిక్’ తో.

2019 లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ‘చందమామా దూర్ కే’ అనే మరో అంతరిక్ష అడ్వెంచర్ హిందీలో రాబోతోంది. కానీ వీటన్నికంటే ముందే గతంలో ఎప్పుడో హిందీ తమిళ భాషల్లో అంతరిక్ష సినిమాలు తీశారు. 1967 లో దారాసింగ్, పద్మాఖన్నా లతో ‘చాంద్ పే చడాయీ’ అనే హిందీ, 1963 లో ఎంజీఆర్, భానుమతి లతో ‘కలై అరసి’ అనే తమిళం తీశారు.

‘అంతరిక్షం’ కథా ప్రయోజనమెలా వుందో, దీని ద్వారా చెప్పకనే ఏం చెప్పారో పైన చూశాం. ఇంకా రిపేర్లు చేసుకునే దశలోనే ఇండియన్ సైన్సు వుందని రికార్డు చేశారు- ఒకవైపు ఇస్రో దిగ్విజయంగా గంపగుత్తగా ఇతర దేశాల ఉపగ్రహాలని తీసికెళ్ళి అంతరిక్షంలోకి ప్రవేశ పెడుతూంటే, మొన్న బుధవారమే అతిబరువైన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగిస్తే కూడా. కథా ప్రయోజనం సంగతలా వుంచితే, ఇదసలు కథేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకంటే, దీనికి సినిమాకుపయోగపడే కథా లక్షణాల కన్నా, సినిమాకి ఉపయోగపడని గాథ లక్షణాలున్నాయి. ఇందుకే ఇది బలహీన ఎంటర్ టైనర్ లా కన్పిస్తుంది. దీని గురించి చివర చెప్పుకుందాం.

ఎవరెలా చేశారు

తెలుగులో రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంగా తొలి అంతర్జాతీయ కథా చిత్రం ‘కంచె’ లో నటించి పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్, ఇప్పుడు తెలుగులో తొలి అంతరిక్ష సైన్స్ ఫిక్షన్ ‘అంతరిక్షం’ లో నటించి తన రికార్డు తనే బ్రేక్ చేసుకున్నాడు. స్టార్ ఇమేజి చట్రాల్ని బ్రేక్ చేసే ఇలాటి ఇంకో అంతర్జాతీయ కథా చిత్రంతో హ్యాట్ ట్రిక్ కూడా పూర్తి చేస్తాడని ఆశిద్దాం. ఐతే తను ఫ్లాష్ బ్యాక్ లో లావణ్యా త్రిపాఠీతో రోంమాంటిక్ యాంగిల్ లో ఉన్నంత హుషారుగా వ్యోమగామి పాత్రలో లేకపోవడం బాక్సాఫీలు అప్పీల్ కి తోడ్పడేదిగా లేదు.

తన పాత్రకి అసలుండాల్సిన హుషారు, థ్రిల్, సస్పన్స్ వ్యోమగామి పాత్రలోనే. ఇంకా ఫ్లాష్ బ్యాకు తాలూకు విషాదాన్నే భారంగా మోస్తూ వుండాల్సిన అవసరం లేదు. అలాటి ఫ్లాష్ బ్యాక్ వుండీ, రియా పాత్రలో అదితీరావ్ తనని వెతుక్కుంటూ వచ్చాక, అక్కడి నుంచి తను వ్యూహాత్మకంగా హుషారుగా మారవచ్చు. ఇదెలాగో చివర చూద్దాం.

ఇక ఒక ట్రాజడీ కారణంగా అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన కథనాన్ని హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లోంచి తీసుకోవడం బావుంది. యాక్షన్ సినిమాల్లోంచి కాకుండా జేమ్స్ బాండ్ సినిమాల్లోంచి తీసుకోవాలంటే జేమ్స్ బాండ్ కి అలాటి ట్రాజిక్ గతాలుండవు. అతను అజ్ఞాతంలో కూడా వుండడు. జేమ్స్ బాండ్ తో ప్రభుత్వానికి అవసరం పడి – జేమ్స్ బాండ్ ఎక్కడ? అంటే, అతను ఎక్కడో ఒక అడ్వెంచర్ చేస్తూ ఓపెనవుతాడు. లేదా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ వుంటాడు. అతడికి సొంత జీవితం, బాధలు వుండవు. ప్రపంచ బాధే తన బాధ. పనుంది రమ్మంటే వూపుకుంటూ వచ్చేస్తాడు.

యాక్షన్ సినిమాల్లో హీరో ఇలా కాదు. ఇతను మాజీ సీఐఏ ఏజంటో, మిలిటరీ ఉద్యోగియో అయి వుంటాడు. గతంలో ఏదో విషాదం వల్ల ఉద్యోగం మానేసి మందు కొడుతూ అజ్ఞాతంలో వుంటాడు. లేదా ‘ఈక్వలైజర్ 2’ లోలాగా టాక్సీ నడుపుకుంటూ వుంటాడు. అవసరం పడి రమ్మన్నా రాడు. ‘టైగర్ జిందా హై’ లో సల్మాన్ ఖాన్ కూడా ఇలాటి పాత్రలో సిరియా సంగతి చూద్దాం రమ్మన్నా, అంత ఈజీగా రాడు.

ఈ పాత్ర చిత్రణని వరుణ్ తేజ్ ఫ్లాష్ బ్యాక్ కోసం వాడుకున్నారు. ఐతే ఇదే విషాద భావంతో సినిమా సాంతం వుంచెయ్యడం మాత్రం బాక్సాఫీలు అప్పీల్ అన్పించుకోలేదు. లోకకళ్యాణమే జీవితంగా వుండే వ్యోమగామి పాత్రకి, ఆ కాస్ట్యూమ్స్ లో దాని విశిష్టతకీ గ్లామర్ తీసుకువచ్చే ప్రెజెంటేషన్ ఏమీ చేయలేదు.

కమర్షియల్ సినిమాకి ఇద్దరు హీరోయిన్లనే రెగ్యులర్ ఫార్ములాలో మాత్రం లావణ్యా త్రిపాఠీ, అదితీరావ్ లని చూపించారు. అదితీరావ్ ని అంతరిక్ష యానంలో కీలక పాత్రలో చూపించారు. స్పేస్ సెంటర్ లో అవసరాల శ్రీనివాస్ నీటైన పాత్రని పోషించాడు. సత్యదేవ్ ఇంకో స్పేస్ సెంటర్ పాత్రలో వరుణ్ తేజ్ తో విభేదిస్తూ కనిపిస్తాడు. కానీ స్పేస్ సెంటర్ చైర్మన్ పాత్రలో రెహ్మాన్ మిస్ మ్యాచ్. ఇంకా ఎక్కువ వయసున్న, తల నెరిసిన సీనియర్ నటుడుంటే, అనుభవానికీ – ఆవేశానికీ (వరుణ్ తేజ్) మధ్య సంఘర్షణకి కాంట్రాస్ట్ వుండేది.

ఇక టెక్నికల్ గా ఎలాటి ఫిర్యాదులూ లేవు. వీఎఫ్ఎక్స్ రిచ్ గా నీటుగా వుంది. అయితే చంద్రమండలాన్ని సమీపించినప్పుడు ఆ ఈవెంట్ ని అసలు పట్టించుకోనట్టు సీదా సాదాగా చూపించారు. పైగా వరుణ్ తేజ్ తో తిలక్ కవిత్వం ఉటంకిపు. భూమ్మీద నుంచి చంద్రుణ్ణి చూసి కవిత లల్లేంత సీను చంద్రుడి సమీపంలో వుండదు. ఆ చంద్రుడి దృశ్యానికి సంభ్రమాశ్చర్యాలతో గుండె పగిలినంత పనవుతుంది. ఆనందాతిరేకాలు ఆవిరై పోతాయి. ఈ విషయం 1969 లో చంద్రుడి మీద కాలుమోపిన మొదటి అమెరికన్ వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లు రాశారు. ఈ ప్రత్యక్ష్యానుభవాన్ని దృశ్యమానం చేసి ప్రేక్షకుల్ని మమేకం చేయాల్సింది ఈ బిగ్ ఈవెంట్ తో. పోతే సంగీతం ఓకే.

చివరికేమిటి

పైన చెప్పుకున్నట్టు మేకింగ్ క్వాలిటీ బావుంది. కానీ రైటింగ్ క్వాలిటీయే స్పీడ్ బ్రేకర్ లా వుంది. అంతరిక్షంలోకి పంపిన పూర్వ ఉపగ్రహం విప్రయాన్, ప్రస్తుత ఉపగ్రహం మిహిర రెండూ తెచ్చి పెట్టిన రిపేర్లు ఏమోగానీ, దీని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ బాగా మరమ్మత్తు కోరుకుంటోంది. ముందు దీన్ని ఫిక్స్ చేస్తే, రెండు ఉపగ్రహాల గాథలు కథల్లాగా మారి పరుగుతీస్తాయి. సినిమాకి కథ అవసరంగానీ కార్యక్రమం కాదుకదా. ఈ స్క్రీన్ ప్లే లో విషయం కార్యక్రమంలా వుంది తప్ప కథలా లేదు. దీనికి కారణం స్ట్రక్చర్ లో ప్లాట్ పాయింట్స్ దగ్గర చేసిన పొరపాట్లు.

మిహిర ఉపగ్రహంలో లోపంవల్ల విశ్వ సమాచార వ్యవస్థకి ముప్పుందని, దీన్ని నివారించే ఏకైక వ్యోమగామి దేవ్ వున్నాడని, అతన్ని బతిమాలుకుని పిలిపించుకుంటారు. దేవ్ కి గతంలో తను పనిచేసిన ఈ స్పేస్ సెంటర్ తో చేదు అనుభవముంది. విప్రయాన్ అనే తన బేబీ లాంటి ఉపగ్రహం ప్రాబ్లం పెట్టిన సమయంలో, రోడ్డు ప్రమాదం జరిగి తను ప్రేమిస్తున్న పార్వతి చనిపోయింది. దీంతో విప్రయాన్ మీద దృష్టి పెట్టలేక అది పతనమయింది. పార్వతి స్పేస్ సెంటర్ చైర్మన్ కూతురు. అతను ఈ రెండు సంఘటనలకీ దేవ్ నే నిందించి డిస్మిస్ చేశాడు. ఆతర్వాత ఐదేళ్లూ దేవ్ ఎక్కడో పాఠాలు చెప్పుకు బతుకుతున్నప్పుడు, చైర్మన్ కి అతడి అవసరం పడింది మిహిర విషయంలో. ఇది ప్లాట్ పాయింట్ వన్ మలుపు. ఇది స్క్రీన్ మీద ముప్పై నిమిషాల కొస్తుంది.

దేవ్ కాంప్రమైజ్ అయి, కక్ష్య తప్పిన మిహిరని కక్ష్యలోకి తీసుకురావడానికి అంతరిక్షం లోకి వెళ్తాడు. దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాడు. ఇది సెకండాఫ్ లో అరగంటకి ముగుస్తుంది. దీంతో సినిమా పూర్తయినట్టే. కానీ పూర్తయిన సినిమాని పొడిగిస్తూ విప్రయాన్ సమస్య తెర పైకి తీసుకు వచ్చారు. మిహిరతో మిషన్ పూర్తయిన తర్వాత వెనక్కి రావడానికి దేవ్ నిరాకరిస్తాడు. చంద్ర మండలం దగ్గరి కెళ్ళి తనకెంతో ప్రియమైన విప్రయాన్ని కూడా యాక్టివేట్ చేసివస్తానని, ఇది పార్వతి కోరుకుందనీ భీష్మించుకుంటాడు. ఇది ప్లాట్ పాయింట్ టూ మలుపు.

ఒక సినిమా ఒకే కథతో వుంటుంది. ఒక హీరోకి రెండు గోల్స్ తో రెండు కథలుండవు. దేవ్ కి విప్రయాన్ తో జరిగిన ట్రాజడీ గతం. ఆ గతంలోంచి వచ్చి మిహిరని కక్ష్యలో పెట్టడం అతడెంచుకున్న గోల్. అది పూర్తి చేశాడు. ఇంకేంటి? మళ్ళీ గతాన్ని ముందుకు తెచ్చి విప్రయాన్ ని కూడా బాగు చేస్తానంటే, ఇది అయిపోయిన కథకి ఇంకో పిట్టకథ అతికించినట్టు లేదా? తెచ్చి అతికించిన విప్రయాన్ కథతో చైర్మన్ తో వాదోపవాదాలు, ఇంకా ఇతర వివరణలూ అసందర్భంగా లేవా? మళ్ళీ ఇందులోకి చైల్డ్ ని లాగి చైల్డ్ సెంటిమెంటు చూపడం బావుందా?

మిహిర, విప్రయాన్ రెండిటి కథలూ చెప్పాలనుకుంటే వాటిని ఒకే కథగా చూపించాలి. దీనికి ప్లాట్ పాయింట్స్ లో పొరపాట్లు దిద్దుకోవాలి. మొదటి ప్లాట్ పాయింట్ లో దేవ్ ని బతిమాలుకుని గతంలోంచి బయటికి తెచ్చుకున్నారు. మిహిర మిషన్ ఒప్పజెప్పారు. అప్పుడు తీరా అంతరిక్షంలో మిహిరకి చేరువయ్యాక దేవ్ రూటు మార్చేస్తే? ముందు పార్వతి కోరిక మేరకు తన ప్రియమైన విప్రయాన్ ని ఫిక్స్ చేసేందుకు అనుమతిస్తేనే, వెనక్కి వచ్చి మిహిరని ఫిక్స్ చేస్తానని భీష్మించుకుంటే? బేరం పెడితే? ఈ ప్లేటు ఫిరాయింపు, డబుల్ క్రాస్, లేదా బ్లాక్ మెయిల్ మిడ్ పాయింట్ (ఇంటర్వెల్ ) కి ఎంత బలాన్నిస్తుంది… ఇలా కాకుండా చూపించిన ఇంటర్వెల్ విషయం లేకుండా ఎంత చప్పగా వుంది? కథంటే ఆర్గ్యుమెంట్. అలా ఆర్గ్యుమెంట్ నెగ్గించుకుని సెకండాఫ్ లో ముందు విప్రయాన్ ని బాగు చేస్తాడు. ఇక సమయంలేదు. కాలంతో పోటీ పడుతూ అర్జెంటుగా మిహిరని బాగు చేయకపోతే విశ్వమే సమాచార పరంగా కుప్ప కూలుతుంది. ఇదీ ప్లాట్ పాయింట్ టూ మలుపు. దీంతో స్ట్రక్చర్ ప్రాబ్లం తీరి గాథలు ఒకే కథగా మారడమే గాక టెన్షన్, ఎమోషన్, హీరో పాత్ర ఎలివేషన్ అన్నీ సమకూరుతాయి కదా?

స్టార్ వార్స్ లోనైనా, ఇట్సే వండర్ఫుల్ లైఫ్ లోనైనారెండు కథలు, రెండు గోల్స్ వుండవు. ఒకే కథతో హీరోకి ఒక గోల్ మారిపోయి ఇంకో గోల్ ముందుకొస్తుంది…

రచన – దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి
తారాగణం : వరుణ్ తేజ్, అదితీ రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠీ, అవసరాల శ్రీనివాస్, సత్యదేవ్ తదితరులు
సంగీతం : ప్రశాంత్ విహారీ, ఛాయాగ్రహణం : జ్ఞానశేఖర్
బ్యానర్ : ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్
నిర్మాత‌లు: రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
విడుదల : డిసెంబర్ 21, 2018
Rating: 2.5 / 5