‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమా రివ్యూ

―సికిందర్

Rating: 3 / 5

తమిళ రీమేకుల్ని మెప్పించేట్టుగా తీయడంలో విఫలమవుతున్న సమయంలో ‘బ్లఫ్ మాస్టర్’ ఇంకో రీమేకుగా విడుదలయింది. ‘96’ లాంటి తమిళ హిట్ ని అంతే ఈస్థటిక్ గా రీమేక్ చేయలేమని నిర్ణయించుకుని చివరికి డబ్బింగ్ తో సరిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళంలో హిట్టయిన ‘చదరంగ వేట్టై’ ని రీమేక్ చేసి ప్రేక్షకుల మీదికి వదిలారు. పైగా ఓ హీరోని తీసుకోకుండా సహాయ పాత్రలేసే సత్యదేవ్ ని హీరోగా పరిచయం చేశారు. అంతేగాక గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి అనే కొత్త దర్శకుడు దీనికి సాహసించాడు. ఇలా రిస్కులు పెంచుకుంటూ పోయి సాధించిందేమిటాని చూస్తే, కంటెంట్ తో అన్నీ సాధించేశారని తేలుతోంది. ఏమిటా కంటెంట్ గొప్పతనం? ఇది చూద్దాం…

కథ
ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) కొమ్ములు తిరిగిన బ్లఫ్ మాస్టర్. ఊహకందని ఐడియాలతో నమ్మించి మోసాలు చేస్తూంటాడు. కోట్లు గడిస్తాడు. చిన్నప్పుడు అనుభవించిన కొన్ని దారుణాలు అతణ్ణి ఇలాటి జీవితంలోకి నెట్టాయి. ఇతడి మోసాలకి డబ్బున్న వాళ్ళతోబాటు లేనివాళ్ళూ బాధితులుగా మారతారు. ఓ రోజు తనకి పరిచయమైన అవని (నందితా శ్వేత) అనే అమ్మాయి ముందు బయట పడిపోతాడు. ఆమె అసహ్యించుకుని వెళ్ళిపోతుంది. ఈ పాపాలన్నీ పండి అరెస్టవుతాడు. డబ్బు పడేసి కేసులోంచి విడుదలైపోతాడు.

కానీ జనం చేతిలో తన్నులు తింటాడు. ఆ బాధితుల్లో ఒకడు డబ్బు వసూలు చేసుకునేందుకు ఓ మాఫియా (ఆదిత్యా మీనన్) ని ఆశ్రయిస్తాడు. ఆ మాఫియాకి దొరికిన ఉత్తమ్ కుమార్ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒప్పందం చేసుకుంటాడు. ఇంకో నూరు కోట్ల స్కామ్ చేసి మాఫియాకి చెల్లించుకునేట్టు. ఏమిటా స్కామ్? తను మంచి వాడుగా మారి అవనిని పెళ్లి చేసుకుని బతుకుదామన్న ఆశయానికి ఈ స్కామ్ ఎలా అడ్డుపడింది? మాఫియాతో ఎలాటి ముప్పు ఏర్పడింది? వీటిని ఛేదించుకుని ఎలా బయట పడ్డాడు?…ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

జనాల బుద్ధి మారనంతవరకూ జనాల్ని ముంచే బ్లఫ్ మాస్టర్లు వుంటూనే వుంటారు. చిట్ ఫండ్ మోసాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు – ఈ ఉదంతాలు తరచూ ఎన్ని జరుగుతున్నా తనివిదీరక మళ్ళీమళ్ళీ జనాలు బఫూన్లు అవుతూనే వుంటారు. ఇలాటి వాళ్లకి గుణపాఠం లాంటి కథ. పాములో ఏదో వుందని రెండు వందల కోట్లకి అమ్మినా, కోడి గుడ్డులో ఇంకేదో వుందని లక్షకి అమ్మినా ఎగబడి కొనే ఛోటా బడా బఫూన్లు వున్నంత కాలం బ్లఫ్ మాస్టర్లకి పండగే. అక్షయ తృతీయకి బంగారం సగం ధరకి అమ్ముతున్నామంటే పొలోమని అర్థరాత్రి పోటెత్తే అమ్మలక్కల సంగతి ఇక చెప్పక్కర్లేదు. తనివిదీరా బఫూనరీ ప్రదర్శించుకుని బ్యారు మనడం. ఈ బఫూన్లతో బ్లఫ్ మాస్టర్ ఆటలో – ఎంత గజ ఈతగాడైనా మురిక్కాలవలో ఎక్కువ దూరం ఈదలేడు’ అనే హెచ్చరిక చేశారు. బ్లఫ్ మాస్టర్ కి ఎంత దుర్భర జీవితాన్ని రుచి చూపించాలో అంతా చూపించి, మోసం చేద్దామనుకునే వాళ్ళకి పీడకలలొచ్చేలా ఒక హార్డ్ కోర్ జానర్ సోషియో యాక్షన్ కథ చేశారు. సౌజన్యం: తమిళ దర్శకుడు. తెలుగులో వొరిజినల్ గా ఇలాటి కథలు రావు.

ఎవరెలా చేశారు

‘మావూరి రామాయణం’ అనే సెమీ రియలిస్టిక్ లో, కథని రకరకాల మలుపులు తిప్పుతూ ప్రకాష్ రాజ్ ని ముప్పు తిప్పలు పెట్టే ఆటో డ్రైవర్ పాత్రలో సత్యదేవ్ ఎప్పుడో నిరూపించుకున్నాడు. ఇప్పుడు తొలిసారిగా హీరోగానూ నిలబెట్టుకున్నాడు. హీరో అంటే రో మాన్సూ డాన్సులూ కామెడీలూ చేసి, ఫైట్లతో ఎగిరే మసాలా హీరో కాదు. ఇవేవీ లేని సెమీ రియలిస్టిక్ పాత్ర రియలిస్టిక్ గా పోషించాడు. సినిమా మొత్తాన్నీ భుజానేసుకుని తన నటనతోనే మోశాడు. ఒక భాగం మోసాలు చేసే హుషారు పాత్ర, ఇంకో భాగం పాపాలు అనుభవించే విషాద పాత్ర రెండూ తొణక్కుండా పోషించి ప్రతీ సీనూ నిలబెట్టాడు.

హీరోయిన్ నందిత సెకండాఫ్ లో ఎక్కువుండే సాత్విక పాత్ర పోషించింది. ఈ పాత్రకి గ్లామరు, యూత్ అప్పీల్ అనే మూస ఆలోచనలు చేయక రియలిస్టిక్ అప్రోచ్ తో చిత్రణ చేశాడు దర్శకుడు.

ఇక మాఫియాగా ఆదిత్యా మీనన్ సహా ప్రతీ వొక్కరూ వాళ్ళ నటనలతో సీన్లకి బలాన్ని చేకూర్చి పెట్టారు. కంటెంట్ బలంగా వుంటే చాలదు. జానర్ ని దృష్టిలో పెట్టుకుని దాని చిత్రీకరణ సాగాలి. ఈ మేరకు కొత్త దర్శకుడు సూపర్ ఫాస్ట్ చిత్రీకరణతో, మాంటేజీలు, యానిమేషన్లూ ఉపయోగించుకుని ట్రెండీ మేకింగ్ చేశాడు. చాలా సినిమాల్లో మోసపోయిన బాధితుల అవే క్రౌడ్ సీన్లు క్రూడ్ గా వుంటాయి. ఈ మూసని బ్రేక్ చేసి, పాత వాసనేయకుండా, వున్న పాత విషయాన్నే కొత్త ఫ్రేమింగ్ తో చూపించాడు. కెమెరా వర్క్, సంగీతం బాగా తోడ్పడ్డాయి.

చివరికేమిటి

కంటెంట్ బలంగా వుంది. ప్రేక్షకులు తదేక ధ్యానంతో చూసేలా వేగంగా పరుగులెత్తే పకడ్బందీ కథనముంది. మార్కెట్ యాస్పెక్ట్ కి, సరైన ఎకనమిక్స్ కథ మంచి యూత్ అప్పీల్ తో వుంది. పాత మోసాల కథనే యువ ప్రేక్షకుల స్టయిల్లో, ట్రెండీగా చూపించడంతో సెమీ రియలిస్టిక్ అయినా సేఫ్ అయిపోయింది. సెకండాఫ్ లో కొన్ని చోట్ల ‘బిచ్చగాడు’ ఛాయలు కన్పించడం మాస్ కి కూడా కనెక్ట్ అయ్యే విషయం. ఈ రీమేకు రిస్క్ అని చెప్పలేం.

న‌టీన‌టులు: స‌త్య‌దేవ్‌, నందితా శ్వేత‌, బ్ర‌హ్మాజీ, పృథ్వీరాజ్‌, చైత‌న్య ‌కృష్ణ‌, సిజ్జు, టెంప‌ర్ వంశీ, బాల‌కృష్ణ, ఆదిత్య మేన‌న్ త‌దిత‌రులు

సంగీతం: సునీల్ క‌శ్య‌ప్

ఛాయాగ్ర‌హ‌ణం: దాశ‌ర‌థి శివేంద్ర

ర‌చ‌న: గోపిగ‌ణేష్‌, పుల‌గం చిన్నారాయ‌ణ‌

కూర్పు: న‌వీన్ ‌నూలి

క‌ళ‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి

స‌మ‌ర్ప‌ణ‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై

ద‌ర్శ‌క‌త్వం: గోపిగ‌ణేష్

విడుద‌ల‌: 28 డిసెంబ‌రు 2018