‘పడి పడి లేచె మనసు’ రివ్యూ

సికిందర్

శర్వానంద్, సాయి పల్లవి తొలిసారి నటిస్తున్న రోమాంటిక్ డ్రామా ట్రైలర్స్, టైటిల్ యూత్ ని బాగా ఆకర్షించాయి. పైగా కోల్ కత, నేపాల్ ప్రాంతాల నేపధ్యాలు, ఒకటి రెండు పాటలూ ఆసక్తి రేపాయి. ట్రైలర్స్ అసలు సినిమాలో వున్న కంటెంట్ కి శాంపిల్స్ గా వుంటాయా అంటే చాలాసార్లు వుండవు. గతవారం ‘భైరవ గీత’ ట్రైలర్స్ ఇదే చెప్పాయి. ప్రస్తుత రోమాంటిక్ డ్రామా ట్రైలర్స్ కూడా ఇదే చెప్తాయి. ట్రైలర్స్ వేరు, సినిమావేరు. సినిమా ట్రాజడీ కథగా వుంటే ఆకర్షణీయమైన సీన్ల నుంచి సెలెక్టివ్ గా ట్రైలర్స్ కట్ చేసి రిలీజ్ చేయడం ఇప్పుడున్న ట్రెండ్. ఈ మంత్రం విడుదల రోజు బుకింగ్స్ వరకే పనిచేస్తుంది. కవర్ చేస్తుంది. ఆ తర్వాత? ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం…

కథ

సూర్య ( శర్వానంద్) కోల్ కతలో ఫుట్ బాల్ ప్లేయర్. వైశాలి (సాయి పల్లవి) మెడిసిన్ చదువుతూంటుంది. ఆమె తండ్రి మురళీ శర్మ మేజిస్ట్రేట్. ఒకరోజు వైశాలిని చూసి ప్రేమలో పడిపోతాడు సూర్య. ఆమె వెంటపడి మొత్తానికి ప్రేమించేలా చేసుకుంటాడు. ఆమె మెడికల్ క్యాంపుకి నేపాల్ వెళ్తుంది. సూర్య అక్కడికెళ్ళి పెళ్లి చేసుకోనంటాడు.

ఎన్నాళ్ళు కలిసి వుంటామో తెలియని పెళ్లి వద్దంటాడు. కలిసి వుండలేక పోతే బతక లేమనుకునప్పుడు పెళ్లి చేసుకుందామంటాడు. ఆమె అయిష్టంగా ఒప్పుకుంటుంది. రెండేళ్ళు దూరంగా వుండి కలుద్దాం, ఆ రెండేళ్ళల్లో బతకలేమనుకుంటే పెళ్లి చేసుకుందామని విడిపోతారు. ఇక రెండేళ్ళు తర్వాత కలుసుకున్నాక ఏం జరిగిందన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ

కె. బాలచందర్ ‘మరో చరిత్ర’ లా వుంది. అందులో కమల్ హాసన్, సరితల పేరెంట్స్ వీళ్ళ ప్రేమల మీద నమ్మకం లేక, ఏడాది కలుసుకోకుండా దూరంగా వుండాలనీ, ఆతర్వాత కూడా ప్రేమలు బలంగా వున్నాయనిపిస్తే పెళ్లి చేస్తామ షరతు పెడతారు. ఇదే ప్రస్తుత రోమాంటిక్ డ్రామాకి మూలం. ‘మరో చరిత్ర’ ని ఆ మధ్యే దిల్ రాజు రీమేక్ కూడా చేశారు ఇప్పుడు మరోసారి ఈ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఐతే ఇంటర్వెల్లో ఈ పాయింటు చెప్పడానికి చాలా నసపెట్టారు. ‘మరో చరిత్ర’ పాయింటుని కప్పిపుచ్చేందుకు ఏవేవో కబుర్లు చెప్తూ విఫలయత్నం చేశారు. ఇదిలా వుండగా, అంతవరకూ ప్రేమంటూ వెంటబడ్డ హీరో శర్వానంద్, సడెన్ గా ప్లేటు ఫిరాయించి పెళ్లి వద్దనడం ఏ మాత్రం కన్విన్సింగ్ గా లేక ఫస్టాఫ్ తో బాటు సెకండాఫ్ వీగిపోయింది.

ఎవరెలా చేశారు.

శర్వానంద్, సాయి పల్లవిలు పోషించిన పాత్రలు మరీ పదహారేళ్ళ టీనేజి పిల్లల పాత్రల్లాగా వున్నాయి. వీళ్ళిద్దరి మధ్య నడిచే లవ్ ట్రాకు కూడా డిస్నీ చానెల్లో వచ్చే మీసాల్లేని టీనేజర్ల అపరిపక్వ ప్రేమ కామెడీల్లాగా వుంటాయి. తారల వయసుకి సంబంధం లేని పాత్రల్లాగా వున్నాయి. ఇంత సిల్లీ ప్రేమ సీన్లు ఒక పుట్ బాల్ ప్లేయర్ కీ, మెడికోకీ మధ్య వుంటాయని ఎవరూ వూహించరు. కానీ ఆ స్థాయి మానసిక స్థితిలో వున్న ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేశారు.

సాయి పల్లవిని ప్రేమలో పడెయ్యడానికి శర్వానంద్ ఆడే నాటకం – ఎవరో రౌడీలు తనని కొట్టడానికి వెంటబడుతున్నారని ఆమెని నమ్మించడం. ఫస్టాఫ్ అంతా ఇదే పసలేని నాటకం. ఆ రౌడీలుగా తన ఫ్రెండ్స్ నే పెట్టుకుంటాడు. ఇదీ పాత రొటీనే. అయినా ఫస్టాఫ్ అంతా ఈ పసలేని రొటీన్ నాటకాన్ని ఒకవర్గం ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేశారు. ఈ వర్గం ప్రేక్షకులే ఈ సినిమాని సక్సెస్ చేయాలి.

ఇక సెకండాఫ్ లో బరువైన కథ, బరువైన పాత్రాలు, బరువైల నటనలు, ఏదో విషాదం. ఇలా సెకండాఫ్ ని నిలబెట్టడం ఈ ప్రేమ వల్ల ఇక కాలేదు. కూర్చోవడం చాలా మంది ప్రేక్షకుల వల్ల కూడా కాలేదు. పోతే మురళీ శర్మ మేజిస్ట్రేట్ పాత్ర మెదడు లేని జోకర్ పాత్రలాగా వుంది కామెడీలు చేస్తూ. ఇక ఫస్టాఫ్ లో ప్రియదర్శి, సెకండాఫ్ లో సునీల్ వెన్నెలే కిషోర్ లున్నా కామెడీకి నవ్వొచ్చే ప్రసక్తే లేదు.

విషయం లేని సీన్లకి పాటలూ వాటి చిత్రీకరణా అట్టహాసంగా వున్నాయి. విజువల్స్ కూడా అద్భుతంగా వున్నాయి. అద్భుతంగా వుండాల్సింది కూర్చోబెట్టే రోమాంటిక్ డ్రామా. దీనికే మార్కెట్ యాస్పెక్ట్ తో బాటు, క్రియేటివ్ యాస్పెక్ట్ పూర్తిగా కొరవడ్డాయి.

ఒక్క మాటలో ..

లేచి లేచి పడింది!

తారాగణం : శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషార్, ప్రియదర్శి తదితరులు.

సంగీతం : విశాల్ చంద్రశేఖర్,
ఛాయాగ్రహణం : జేకే

బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్

నిర్మాత : సి. ప్రసాద్, సి. సుధాకర్

రచన – దర్శకత్వం : హను రాఘవపూడి

విడుదల : డిసెంబర్ 21, 2018

Rating: 2.25/5