రివ్యూ: రాయలసీమ లవ్ స్టోరీ  

నటీనటులు :  వెంక‌ట్ ,హృశాలి, పావ‌ని, నాగినీడు, జీవా, మిర్చి మాధ‌వి, పృథ్వీ త‌దిత‌ర‌లు                 నిర్మాత‌లు: A 1 ఎంటర్ టైన్ మెంట్స్-  రాయ‌ల్ చిన్నా- నాగ‌రాజు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : రామ్ రణధీర్
విడుద‌ల‌:  సెప్టెంబ‌ర్ 27

వెంక‌ట్, హృషాలి, పావ‌ని హీరో, హీరోయిన్లుగా ఎ1 ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై రామ్ ర‌ణ‌ధీర్ ద‌ర్శ‌క‌త్వంలో రాయ‌ల్ చిన్నా-నాగ‌రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం `రాయ‌ల‌సీమ ల‌వ్ స్టోరీ`. రిలీజ్ కు ముందు సినిమాలో  అశ్లీల స‌న్నివేశాలున్నాయంటూ రాయ‌ల‌సీమ పోరాట‌ హ‌క్కుల స‌మితి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో హైలైట్ అయింది. ప‌బ్లిక్ లో సినిమా పోస్ట‌ర్ల‌ను ఆందోళ‌న‌కారులు ద‌గ్ధం చేయ‌డంతో సినిమాకు మ‌రింత ప‌బ్లిసిటీ ద‌క్కింది. తాజాగా ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ సినిమాలో అంత వివాదాస్ప‌ద అంశం ఏం ఉంది? ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా? లేదా? అన్న‌ది తెలియాలంటే స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
కృష్ణ (వెంక‌ట్), శృంగారం(వేణు)  హైద‌రాబాద్ లో ఎస్.ఐ కోచింగ్ తీసుకుంటారు. ఉద్యోగ‌మే ల‌క్ష్యంగా ప్రిపేర్ అయ్యే వెంక‌ట్ అనుకోకుండా హృశాలి( రాధిక‌)  ప్రేమ‌లో ప‌డ‌తాడు. ప్రేమంటే గిట్ట‌ని రాధిక‌ని చివ‌రికి ఎలాగూ ముగ్గులోకి దించుతాడు. పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. కానీ తండ్రి రాయుడు(నాగినీడు) మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి. అప్ప‌టికే వ్యాపార‌వేత్త‌ జీవా త‌న‌యుడికిచ్చి పెళ్లి చేస్తాన‌ని మాటిస్తాడు. ఈ క్ర‌మంలో రాధిక తండ్రి మాట కాద‌న‌లేని ప‌రిస్థితి. మ‌రి ఆ ప్రేమ‌లో నిజాయితీ ఎంత‌?  రాయ‌ల‌సీమ ప్రాంతానికి కృష్ణ‌కి సంబంధం ఏంటి? అక్క‌డ కృష్ణకున్న‌ మ‌రో ప్రేమ క‌థేంటి? ఈ మొత్తం క‌థ‌లో విల‌నిజం ఎలా న‌డించింది? అన్న ఆస‌క్తిక‌ర‌ అంశాలు తెర‌పైనే చూడాలి.

విశ్లేష‌ణ‌:
ఇది ఓ ర‌కంగా ముక్కోణ‌పు ప్రేమ‌క‌థా చిత్రం. కానీ ద‌ర్శ‌కుడు రెండు ప్రేమ క‌థ‌ల‌నే క‌థా వ‌స్తువుగా తీసుకుని తెర‌కెక్కించాడు. ల‌వ్ ని ఎన్నిర‌కాలుగా ఎక్స్ ప్రెస్ చేస్తారో చ‌క్క‌గా ఎగ్జిక్యూట్  చేయ‌గ‌లిగాడు. ప్ర‌థ‌మార్థంలో ప్రేమ‌.. ద్వితియార్థంలో కృష్ణ ల‌వ్ స్టోరీని కన్వెన్సింగ్ గా చెప్ప‌గ‌లిగాడు. ఆరంభం క‌థ స్లోగా ప్రారంభ‌మైనా ల‌వ్ స్టోరీ లోకి వెళ్లేస‌రికి క‌థ స్వ‌రూపం మారిపోయింది. కృష్ణ‌-రాధిక మ‌ధ్య ఘాటైన పెద‌వి ముద్దులు, బెడ్ రూమ్ స‌న్నివేశాల‌తో  ఒక్కసారిగా వేడెక్కించాడు.  ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులకు కావాల్సిన అంశాల‌తో ప్ర‌త‌మార్థం  క‌థ‌ను న‌డిపాడు. ప్రేమ‌లో ఘాడ‌తను తెలిపే క్ర‌మంలో శృతి మించే స‌న్నివేశాలకు కొద‌వ లేదు. ఇక ద్వితియార్థం పూర్తిగా స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను హైలైట్ చేసాడు.  ఇక్క‌డ నుంచి క‌థ రాయ‌ల‌సీమ ప్రాంతానికి షిప్ట్ అవుతుంది. చిన్న వ‌య‌సులో క‌లిసి తిరిగిన అమ్మాయితో వెంక‌ట్‌ ల‌వ్ ట్రాక్ ఓకే.  ప్రేమికురాలిని కోల్పోయిన బాధ‌లో వెంక‌ట్ ఎలాంటి ప‌రిస్థిత‌కుల‌కు లోన‌య్యాడు? వ‌ంటి స‌న్నివేశాల్లో అత‌డు చక్క‌గా న‌టించాడు. వేణు, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ర్టీ  పృథ్వీ, గెట‌ప్  శ్రీను, భ‌ద్రం  ర‌ఘు, తాగుబోతు ర‌మేష్  లాంటి మంచి క‌మెడియ‌న్లు ఉన్నా  వాళ్ల‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు  ఫెయిల‌య్యార‌నే చెప్పాలి. ఏ సినిమాకైనా వినోదం ప్ర‌ధానం. కానీ క‌థ‌లో వినోదం కొర‌వ‌డింది. అక్క‌డ‌క్కా గెట‌ప్ శ్రీను కామెడీ న‌వ్విస్తుంది.  దాదాపు ప్ర‌తీ ప్రేమ్ లోనూ హీరో క‌నిపిస్తాడు. హీరోయిన్ హృశాలి అందాలు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.  

న‌టీన‌టులు:  
వెంక‌ట్ కొత్త కుర్రాడైనా చక్క‌గా న‌టించాడు. కెమెరా ఫియ‌ర్ క‌నిపించ‌లేదు. మునుముందు మ‌రింత బెట‌ర్ మెంట్ అవ‌స‌రం. హృశాలి గ్లామ‌ర్ షో తో ఆక‌ట్టుకుంది.  పావ‌ని ట్రెడిష‌నల్ గాళ్‌ పాత్ర‌లో ఓకే. ప‌ల్ల‌వి పాత్ర‌లో న‌టించిన అమ్మాయి రోల్ పెంచుంటే బాగుండేది. ఆమెను కేవ‌లం రెండు, మూడు స‌న్నివేశాల‌కే ప‌రిమితం చేసారు. హీరోయిన్ తండ్రి పాత్ర‌లో  నాగినీడు చ‌క్క‌గా న‌టించాడు. క‌మీడియ‌న్లు ఉన్నా ద‌ర్శ‌కుడు  వాళ్ల‌ను ఉప‌యోగించుకోలేక‌పోయాడు.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం బాగుంది. అక్క‌డ‌క్క‌డా డెబ్యూ లోపాలున్నాయి.  శ్రీసాయి యేలేంద‌ర్ అందించిన సంగీతం ఓకే. ముద్దు తొలి ముద్దు పాట సినిమాలో హైలైట్. అలాగే మ‌రోపాట నువ్వంటే పిచ్చి పిచ్చి సాంగ్ బాగుంది. ఆర్ ఆర్ ఆర్ బాగుంది. రామ్ మ‌హేంద‌ర్ కెమెరా వ‌ర్క్ ప‌ర్వాలేదు. సినిమాలో ల్యాగ్ ఉంది. వినోద్ అద్వైత్ కొన్ని స‌న్నివేశాల‌కు క‌త్తెర వేసుంటే బాగుండేది. ర‌మేష్ ఆర్ట్ వ‌ర్క్ బాగుంది.  

చివ‌రిగా: రాయ‌ల‌సీమ ల‌వ్ జ‌స్ట్ టైంపాస్