పాత ఫ్యాక్షన్ తో బంపర్ యాక్షన్! ‘అరవింద సమెత వీర రాఘవ’ (మూవీ రివ్యూ)

 (సికిందర్)


రచన – దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్ 
తారాగణం : ఎన్టీఆర్, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, సునీల్, జగపతిబాబు, రావురమేష్, నాగబాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్ తదితరులు 
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : పిఎస్. వినోద్ 
బ్యానర్ : హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ 
నిర్మాత : ఎస్. రాధాకృష్ణ 
విడుదల : అక్టోబర్ 11, 2018

 

           మా రేటింగ్ 2.75 / 5

ఎన్టీఆర్ తిరిగి రెగ్యులర్ పాత్రతో రొటీన్ మూవీ చేస్తేనే గానీ తన నేటివిటీలోకి ఇమిడే పరిస్థితి కనిపించడం లేదని భావించినట్టుంది. గత నాల్గైదు సినిమాలు డిఫరెంట్ నేటివిటీలు కలిసిరాకపోవడంతో తిరిగి తనని పాపులర్ చేసిన ఫ్యాక్షన్ నేటివిటీకే యూటర్న్ తీసుకుని ప్రస్తుత ఫ్యాక్షన్ యాక్షన్ ని దసరా కానుకగా అందించాడు. దశాబ్డం క్రితమే ముగిసిపోయిన ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ ని మళ్ళీ గుర్తు చేస్తూ, అదే పాత కథకి, వాతావరణానికీ కొత్త పాయింటు ఏదో జోడించామనిపిస్తూ ప్రేక్షకుల ముందుకు ‘అరవింద సమేత వీర రాఘవ’ గా విచ్చేశాడు. ఇదెలా వుందో ఓ లుక్కేద్దాం…

 

కథ 

          రాయలసీమ లోని కొమ్మద్దిలో నారపరెడ్డి (జగపతిబాబు) అనే ఫ్యాక్షనిస్టు. నల్లగుడిలో బసిరెడ్డి (జగపతి బాబు) అనే ఇంకో ఫ్యాక్షనిస్టు. ఇద్దరి మధ్యా ముప్పై ఏళ్లుగా ఫ్యాక్షన్ కాష్ఠం. అమెరికాలో చదువు ముగించుకుని వస్తున్న కొడుకు వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్) ని రిసీవ్ చేసుకోడానికి నారపరెడ్డి తన వర్గంతో వెళ్తే,  మాటు వేసి బసిరెడ్డి దాడి చేస్తాడు. కళ్ళ ముందే తండ్రి చనిపోవడంతో తిరగబడి నారప రెడ్డిని చంపేస్తాడు వీర రాఘవ రెడ్డి. ఇక ఈ చంపుకోవడాలు వద్దని నానమ్మ వారించడంతో,  గ్రామాల్లో శాంతి వుండాలని హైదరాబాద్ వెళ్ళిపోతాడు వీర రాఘవ రెడ్డి. అక్కడ ఆంత్రోపాలజీ చదువుతూ ఫ్యాక్షనిస్టుల మీద పరిశోధన చేస్తున్న అరవింద (పూజా హెగ్డే)  పరిచయమౌతుంది. ఆమె చెప్పే మాటలతో అతడికి కర్తవ్యం బోధపడుతుంది. దీంతో పార్టీ ఇంచార్జి (రావురమేష్)ని కలిసి,  బసిరెడ్డి కొడుకు బాలి రెడ్డి (నవీన్ చంద్ర) తో శాంతి చర్చలకి సిద్ధమని ప్రకటిస్తాడు వీర రాఘవ రెడ్డి. అయితే అటు ప్రాణాలతో వున్న నారపరెడ్డి దీనికి అడ్డుపడతాడు. దీంతో తిరిగి చిచ్చు రగులుకుంటుంది. ఇప్పడు శాంతిని నెలకొల్పాలన్న ఆశయాన్ని వీర రాఘవ రెడ్డి ఎలా నేరవేర్చుకున్నాడనేదే  మిగతా కథ.

 

ఎలావుంది కథ


          స్టార్ సినిమాలకి అవే కథల్ని రిపీట్ చేయడంతప్ప వేరే మార్గం లేదన్నట్టుంది ఈ ఫ్యాక్షన్ కథ. దశాబ్దం క్రితమే ముగిసిపోయిన ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ ని తట్టి లేపుతూ ఈ కథ తయారు చేశారు. నిజానికి సీమ ఫ్యాక్షన్ ఎప్పుడో ముగిసిపోయిన చరిత్ర. పదేళ్ళ క్రితం వరకూ ఈ కథలతో సినిమాలు వచ్చాయంటే ఆ జ్ఞాపకాలు మిగిలున్నాయనే. ఇప్పుడా జ్ఞాపకాలు కూడా సమసిపోయాక ఫ్యాక్షన్ సినిమా అంటే పాత సినిమానే మళ్ళీ  చూపించడమే. పైగా ఈ ఫ్యాక్షన్ కూడా ఒక ప్రాంతానికి పరిమితమైన పరిస్థితి. దీంతో ఈ కథ సమకాలీన కథ కాదుగదా, ప్రధాన స్రవంతి కథ కూడా కాలేకపోయింది. ఇప్పుడు ప్రాంతాల కతీతంగా వేరే రూపాల్లో చాలా హింస వుంది, రాజకీయలున్నాయి. వీటి మీద కథ ఆశిస్తారెవరైనా. ఇప్పుడు లేని ఫ్యాక్షన్ కి శాంతితో పరిష్కారమంటూ ఈ కథ చూపించడం కూడా మరో విచిత్రం. ప్రత్యర్ధితో శాంతి కోసం ప్రయత్నమంటూ అదే ప్రత్యర్ధిని చంపి శాంతిని  స్థాపించా మనడమేంటో కూడా కాన్సెప్ట్ పరమైన తికమక. అందుకని ఈ కథ కథకోసం కాదు, కేవలం ఎన్టీఆర్ కత్తి పట్టుకుని తన బ్రాండ్ ఎమోషన్స్ తో తిరిగి ఆకట్టుకోవడం కోసమే.

 

ఎవరెలా చేశారు

          ఎన్టీఆర్ ఈ బలమైన, భావోద్వేగాపూరిత నటన ఇంకేదైనా సామాజిక అంశంతో ప్రదర్శించి వుంటే – ఇది మరో ‘టెంపర్’ అయ్యేది. తేలిపోయిన ఫ్యాక్షన్ నేపధ్యంలో ఎన్టీఆర్ రౌద్ర, పౌరుష నటన అతికినట్టు వుండదు. నేపధ్యాన్ని ఫీలవకుండా చూసే మాస్ వరకూ ఇది ఓకే. పాత్రకి ట్రెండ్ లో వున్న సమకాలీన మూలాలు వుండివుంటే సంచలనం సృష్టించేది. ఎన్టీఆర్ ది దాదాపూ సినిమా అంతా సీరియస్ గా వుండే నటన. తండ్రిని కోల్పోయిన బాధ వుండగా, శాంతిని నెలకొల్పే పట్టుదల ఇంకో పక్క. ఈ రెండు కోణాల్లోనే పాత్రకి హీరోయిన్ తో ప్రేమ.  ఈ ప్రేమ అక్కడక్కడా కాస్త రిలీఫే గానీ, సెకెండాఫ్ లో పూర్తిగా ఇది కూడా ఫ్యాక్షన్ పోరులో కలిసిపోతుంది. కొన్ని గుర్తుండే దృశ్యాలు ఎన్టీఆర్ తో వున్నాయి. కారులో చనిపోయి వున్న తండ్రి పక్కన కూర్చుని చూస్తున్నప్పుడు, పార్టీ నాయకుడితో మాట్లాడుతున్నప్పుడు, ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు. ఇక పాటలకి అభిమానులు ఈలలేసెంత డాన్సు లేమీ లేవు. మొదటి డ్యూయెట్ హీరోయిన్ తో సగం మాంటేజెస్ గానే సాగుతుంది. చివర ఫోక్ సాంగ్ రొటీనే. మధ్యలో ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం తల్లిపాడిన పాట పాడుకోవడం. 

          హీరోయిన్ పూజా హెగ్డేకి కనీసం ఒక పనికొచ్చే పాత్రంటూ వుంది. నటన అంతా గ్లామర్ ని పోషించడం కోసమే. ఎన్టీఆర్ తర్వాత పచ్చిగా కన్పించే పాత్రలో జగపతి బాబు నటన కూడా ఎఫెక్టివే గానీ, ఇది కూడా ఇప్పుడు ఉనికిలో లేని ఫ్యాక్షన్ పాత్ర. నటనా పరంగా ఆయన ఓకే గానీ ఇప్పుడీ పాత్ర కనెక్ట్ అవడం కష్టం. సునీల్ పాత్రకి కూడా కామెడీ లేకపోవడం ఒక లోపం.       
          రాం లక్ష్మణ్ సమకూర్చిన యాక్షన్ సీన్స్ హింసెక్కువ. సినిమా ప్రారంభంలో సుదీర్ఘమైన యాక్షన్ సీన్ లో ఎన్టీఆర్ విజృంభణ అభిమానులకి పండగ. ఇక ఛాయాగ్రహణం సహా ప్రొడక్షన్ విలువలు చెప్పుకోనవసరం లేకుండా రిచ్ గానే వున్నాయి.

 

చివరికేమిటి 


          బోయపాటి సినిమా ఇంకోటి చూస్తున్నట్టు వుంటుంది. సినిమాలో డైలాగులు ఆయా సన్నివేశాలకి పరిమితమై సూటిగా వుండాల్సింది. డైలాగులకి ముందు సందేశాలు జోడించడంతో సినిమా నడక వేగం తగ్గడమే కాక, యూత్ అప్పీల్ కనాకష్టమై పోయింది. సందేశాలు తీసేస్తే సినిమా నిడివి కూడా రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అరగంట తగ్గిపోతుంది. కాన్సెప్ట్ పరంగా ఫ్యాక్షన్ పోరుకి శాంతితో పరిష్కారమనే పాయింటు కూడా వర్కౌట్ కాలేదు. యుద్ధం చేసే సత్తా లేనివాడు శాంతిని అడిగే హక్కులేదంటాడు ఎన్టీఆర్ తన గురించి. కానీ ప్రత్యర్ధిని చంపకుండా నెలకొల్పేదే శాంతి అవుతుందని గ్రహించడు. కాన్సెప్ట్ ప్రకారమైతే  ప్రత్యర్ధి పాత్రదారి జగపతిబాబు జీవించే వుండే ముగింపు నివ్వాలి. కనెక్టివిటీ లేని కథకి కనీసం ఆలోచనాత్మకమైన ముగింపుని కూడా ఇవ్వకుండా, విలన్ చావాలనే  ఫార్ములాతోనే  ముగించేశారు. 

          ‘అరవింద సమేత వీర రాఘవ’ కథగా చూస్తే అదే పాత ఫ్యాక్షన్, ఎన్టీఆర్ ని చూస్తే మాత్రం బంపర్ యాక్షన్! కథని, పాత్ర మూలాల్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ ని చూడదల్చుకుంటే ఓ సారి చూడొచ్చు.