డిఫరెంట్ జర్నీ  ‘W /O  రామ్’ (రివ్యూ)


రచన – దర్శకత్వం : విజయ్ యెలకంటి
తారాగణం : మంచు లక్ష్మీ, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్‌, , ఆదర్శ్‌, సామ్రాట్ త‌దిత‌రులు
సంగీతం : రఘు దీక్షిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం: సామల భాస్కర్‌
బ్యానర్స్ : మ‌ంచు ఎంట‌ర్‌టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్‌, మంచు లక్ష్మీ
విడుదల : జులై 20, 2018


రేటింగ్ : 2.5 / 5

***

      తెలుగులో స్వతంత్ర హీరోయిన్ గా ఏ ఇమేజులూ పెట్టుకోకుండా పాత్రలు నటిస్తూ పోయే మంచు లక్ష్మి ఈసారి అపరాధ పరిశోధకురాలి పాత్ర పోషించింది. చిన్న బడ్జెట్ సినిమాల విజయాలకి వైవిధ్యమే, కథాబలమే ముఖ్యమని నమ్ముతున్న అతి కొద్దిమంది కొత్త దర్శకులు, ఆమెకీ కొంత మార్కెట్ వుందని నమ్మే నిర్మాతలూ కృత్రిమ ఫార్ములా కోటల్ని బద్దలు కొడుతూ సహజత్వమున్న సినిమాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలో వచ్చిందే ‘w / o రామ్’ అనే మర్డర్ మిస్టరీ –థ్రిల్లర్.         ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం.

 

కథ 


          యాక్సిడెంట్ లో భర్తనీ,  గర్భంలో వున్న బిడ్డనీ కోల్పోయి ఆస్పత్రిలో చేరిన దీక్ష (మంచు లక్ష్మి)  అది యాక్సిడెంట్ కాదనీ, ఒక ముసుగు వ్యక్తి చేసిన హత్య అనీ నమ్ముతుంది. తన భర్తది హత్యేనని పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. పోలీసు అధికారి సత్యం (శ్రీకాంత్ అయ్యంగార్) నిర్లక్ష్యం చేస్తాడు. కొత్తగా చేరిన కానిస్టేబుల్ రమణాచారి (ప్రియదర్శి) సానుభూతితో వుంటాడు. దీక్ష విసిగిస్తూంటే ఆమె కేం కావాలో చూడమని రమణాచారిని పురమాయిస్తాడు సత్యం. ఇక  లాభంలేక  కేసుని తనే ఛేదించడానికి పూనుకుంటుంది దీక్ష. రమణాచారి సాయంగా వుంటాడు. దీక్ష సాక్ష్యాధారాల్ని సేకరిస్తూ సింగపూర్ లో వుంటున్న రాకీ (ఆదర్శ్) అనే హంతకుణ్ణి ట్రేస్ చేస్తుంది. ఇక్కడ్నుంచీ ఆ హంతకుడితో ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు హంతకుణ్ణి సింగపూర్ నుంచి ఎలా రప్పించి శిక్షించిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 


          మర్డర్ మిస్టరీ జానర్. ఐతే ఎండ్ సస్పెన్స్ సుడిగుండంలో పడకుండా సీన్ టు సీన్ సస్పన్స్ కథనాన్ని సంతరించుకుంది. దీంతో బాటే విడుదలయిన రాజ్ తరుణ్ ‘లవర్’ ఎండ్ సస్పెన్స్ సుడిగుండంలో పడి, అంతవరకూ కథలో ఏది ఎందుకు ఎలా జరిగిందో కార్యకారణ సంబంధాన్ని వివరించుకుంటూ కూర్చుంది. కార్యకారణ సంబంధం ఎప్పటికప్పుడు తెలిసిపోతూండాలి – అప్పుడు కథేమిటో తెలుస్తుంది. లేకపోతే  కథేమిటో చివర్లో కార్యకారణ సంబంధం చెప్తూ కూర్చున్నప్పుడు గానీ తెలియదు. ఇదే ఎండ్ సస్పెన్స్. తాము ఏ కథ చూస్తున్నామో ప్రేక్షకులకి తెలియకపోవడమంత అన్యాయం వుండదు. ‘w / o రామ్’  ఈ ప్రమాదాన్ని నివారించుకుంది. అయితే కేవలం భర్తని చంపిన వాణ్ణి పట్టుకోవడమేనా కథంటే, కాదు. చివర్లో ఒక ట్విస్టుతో కథకి ఈ సదా సీదాతనం వదిలిపోయింది. ఈ ట్విస్టు చివరి వరకూ చెప్పకుండా ఆపిన ఎండ్ సస్పెన్సే. అంటే కథంతా ఇదే, ఈ ట్విస్టు రివీల్ అయినప్పుడే వుంది, దీని గురించే కథ నడిపింది. కానీ దీని గురించి అన్నట్టు కాకుండా,  భర్త హత్యా పరిశోధన అనే పొర కప్పి నడిపారు. ఎండ్ సస్పెన్స్ కథని ఎండ్ సస్పెన్స్ అనిపించకుండా,  వేరే కథతో సీన్ టు సీన్ కథనం చేసిన ఇలాటి మరొక థ్రిల్లర్ ‘క్షణం’. అయితే  ‘w / o రామ్’ కి  బలాత్కారాల సామాజిక సమస్య అదనంగా తోడయింది.
ఎవరెలా చేశారు.
ఇందులో మూడు పాత్రలు ప్రధానంగా వుంటాయి. వీటిని నటించిన ముగ్గురు మంచు లక్ష్మి, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియదర్శి లు ఈ మిస్టరీ థ్రిల్లర్ ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. మంచు లక్ష్మి పాత్ర ముందుగా సానుభూతి పొందే, తర్వాత ప్రమాదంలో పడే,  ఆ తర్వాత సాహసాన్ని ప్రదర్శించే మూడు షేడ్స్ లో వుంటుంది. ఈ మూడింటినీ ఏ  మాత్రం ఓవరాక్షన్ చేయకుండా, సహజత్వానికి తావిచ్చి నటించింది.
శ్రీకాంత్ అయ్యంగార్ అవినీతిపరుడైన పోలీసు అధికారిగా సహజ నటన ప్రదర్శించాడు. అతడి హవభావ ప్రదర్శనా సామర్ధ్యమే పాత్రని ఆకట్టుకునేలా చేసింది. రియలిస్టిక్ పాత్రలకి అతనొక చిరునామా కాగలడు.
ఇక కానిస్టేబుల్ పాత్రలో ప్రియదర్శి నుంచి హాస్యాన్ని ఆశించకూడదు. హాస్యనటుడైన తను ఎక్కడా నవ్వించే ప్రయత్నం చేయకుండా,  సీరియస్ పాత్ర కూడా నటించి మెప్పించగలడని రుజువు చేసుకున్నాడు.
ఈ మూడు పాత్రల మీద  ప్రధానంగా దృష్టి పెట్టి మిస్టరీని నడపడం వల్ల అనవసర విషయాలు కథకి అడ్డుపడలేదు. సాంకేతికంగా చూస్తే, సామల భాస్కర్ ఛాయాగ్రహణం ఇండోర్స్ పరంగా కథ మూడ్ కి తగ్గ లైటింగ్ ఎఫెక్ట్స్ ని సృష్టించగల్గింది గానీ, అవుట్ డోర్స్ లో మామూలుగానే వుంది. రఘు దీక్షిత్ సంగీతం కథననం బలహీనపడ్డప్పుడల్లా హడావిడి చేస్తూ, ఆ లోపాల్ని కవర్ చేస్తున్నట్టు అన్పిస్తుంది. లో బడ్జెట్ మూవీ అయినా టెక్నికల్ గా జానర్ కి తగ్గ క్వాలిటీతోనే వుంది.

చివరికేమిటి 


          దర్శకుడు విజయ్ టెక్నికల్ గా ఓకే, క్రియేటివిటీ పరంగా ఇంకా బలంగా వుండాలి. ఈ మిస్టరీ థ్రిల్లర్ ని స్క్రీన్ ప్లే పరంగా స్ట్రక్చర్ లో పెట్టడం వరకూ బాగానే చేశాడు గానీ, స్ట్రక్చర్ లోపల సృజనాత్మకత విషయంలో వెనుకబడ్డాడు. పైగా లాజిక్ విషయంలో ఫార్ములా పోకడల్ని పోయాడు. కథ ఎలా నడిపినా చివర్లో ఒక ట్విస్టు వుంది కదా, ఇక ప్రేక్షకులు అన్నీ మర్చిపోతారన్న అభిప్రాయం కావచ్చు. అసలు భర్త శవం గురించి ఆలోచిస్తే, ఈ కథంతా పుట్టడానికి అవకాశమే వుండదు. అలాగే ఈ కేసుని పోలీసులు పట్టించుకోరని ఎలా వూహించి, తనే పరిశోధించే పథకమేసిందో అలోచిస్తే కూడా ఈ కథ వుండే అవకాశం లేదు. ఇలాటి కథల్లో ఇలాటి ప్రధానమైన లోపాలుంటే ఆలోచించే ప్రేక్షకుల్ని ఈ సినిమాతో నమ్మించడం కష్టం. పెద్దగా ఆలోచనలు పెట్టుకోకుండా చూస్తే మాత్రం ఇదొక డిఫరెంట్ జర్నీయే.

సికిందర్