ఏ క్యా మహేష్ జర్నీహై?  : ‘మహర్షి’ (మూవీ రివ్యూ)

రివ్యూ 

‘మహర్షి’
దర్శకత్వం : వంశీ పైడిపల్లి 
తారాగణం : మహేష్ బాబు, పూజా హెగ్డే, జయసుధ, అల్లరి నరేష్,  జగపతి బాబు, రావురమేష్, ప్రకాష్ రాజ్, పోసాని, వెన్నెల కిశోర్ తదితరులు  
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం :  
బ్యానర్స్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా 
నిర్మాతలు : దిల్ రాజు, సి/ అశ్వనీ దత్, పొట్లూరి ప్రసాద్ 
విడుదల : మే 9, 2019
2.75 / 5
***
          2015 లో ‘శ్రీమంతుడు’ హిట్ తర్వాత ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’, ‘భరత్ అనే  నేను’ లతో మెప్పించ లేకపోయిన మహేష్ బాబు- ఇప్పుడు తన 25 వ మూవీగా ‘మహర్షి’ తో వచ్చాడు. మే నెల మహేష్ కి మంచిది కాదనీ, కానీ నిర్మాతలకి గత సినిమాలతో మే నెలలో బాగానే కలిసి వచ్చిందనీ ఊహాగానాలు చేశారు.  దుబాయ్ నుంచి సెన్సార్ సభ్యుడినని చెప్పుకునే ఒక ఘనుడు ‘మహర్షి’ మొట్ట మొదటి రివ్యూ అంటూ రాసి, 4 స్టార్స్ ఇచ్చాడు. ఇతను గతంలో ఇచ్చిన రేటింగ్స్ ఎదురు తగిలాయి. మహేష్ బాబు మాత్రం ‘మహర్షి’తో సంతృప్తి కరంగా వచ్చిందన్నాడు.  ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే  నేను’ లాగే ఈసారి కూడా మెసేజి ఇచ్చే సినిమానే చేసినట్టు కన్పిస్తోంది. కథని చాలా మంది ప్రేక్షకులే ఊహించేశారు. అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్, పివిపిలు భారీ ఎత్తున 140 కోట్లు పెట్టుబడులు పెట్టామని చెప్పుకున్నారు.  దర్శకుడు వంశీ పైడిపల్లికి చాలా బాధ్యత మీద పడింది. మరి ఏం తేలింది? మహేష్ బాబు దగ్గర్నుంచి నిర్మాతలు, దర్శకుడు, బయ్యర్సూ అందరూ క్షేమమేనా? ఈ క్షేమ సమాచారం కింద తెలుసుకుందాం…
కథ
        రిషి కుమార్ (మహేష్ బాబు)  న్యూయార్క్ లో  ఓ కార్పొరేట్ కంపెనీ సీఈవో గా బాధ్యతలు స్వీకరిస్తాడు. అతను ఈ స్థితికి ఎలా చేరుకున్నాడో వెంటనే ఫ్లాష్ బ్యాక్  మొదలవుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఒకేవొక్క లక్ష్యం పెట్టుకున్న రిషి కాలేజీలో చదువుతూంటాడు. అక్కడ పూజ (పూజా హెగ్డే), రవిశంకర్ (అల్లరి నరేష్) లు పరిచయమవుతారు. పూజతో ప్రేమలో పడతాడు. రవి శంకర్ మంచి స్నేహితుడుగా వుంటాడు. చదువుతూండగానే అమెరికన్ కంపెనీ మంచి జాబ్ ఆఫర్ ఇస్తుంది రిషికి. ఇంతలో పరీక్షల్లో పేపర్ కొట్టేసిన ఆరోపణలు ఎదుర్కొని కాలేజీ నుంచి డీబార్ అవుతాడు. అంతలోనే ఆ ఆరోపణలు నిజం కాదని తేలి పరీక్షలు రాసి అమెరికా వెళ్ళిపోతాడు. అక్కడ జాబ్ చేస్తూ చూస్తూండగానే కంపెనీ సీఈవో గా ప్రమోటవుతాడు. ఇప్పుడు రవి శంకర్ గుర్తుకొస్తాడు. రవి శంకర్ ఎక్కాడున్నాడో, ఏం చేస్తున్నాడో మిత్రులెవరూ చెప్పరు. కానీ రైతు అయిన అతడి తండ్రి (తనికెళ్ళ భరణి) ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తారు. దీంతో రవిశంకర్ వూరుకి బయల్దేరతాడు రిషి. ఇంతకీ రవిశంకర్ కి ఏమైంది? అతడి తండ్రి  ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? వూళ్ళో పరిస్థితులేమిటి? ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాలని రిషి ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు?  తను సీఈవోగా ఎదిగి సక్సెస్ సాధించాడంటే దీని వెనకున్న రహస్యమేమిటి? ఈ వివరాలు తెలిపేదే మిగతా కథ. 
ఎలావుంది కథ 
        బాలీవుడ్ లో చరిత్రల, జీవిత చరిత్రల బజార్ తెరిచినట్టు, టాలీవుడ్ లో గెలుపు సినిమాల షోరూమ్ తెర్చినట్టున్నారు. వరుసగా మజిలీ, చిత్రలహరి, జెర్సీ గెలుపు సినిమా లొచ్చాక, ఇంకో అడ్డగోలు గెలుపు ‘నువ్వు తోపురా’ కూడా గతవారమే పలకరించింది. ఇప్పుడు ‘మహర్షి’ హాయ్ చెప్పింది. ఇది తేడాగల గెలుపు కథ.  ‘సగటు నుంచి సంపదకి’ (ర్యాగ్ టు రిచెస్) కథల కోవలో ఇదొక కథ. ఐతే సంపన్నుడు కావడమే సక్సెస్ కి గీటురాయి కాదని, ఆ హోదాతో సామాజిక సమస్యల్ని పరిష్కరిస్తే అది నిజమైన సక్సెస్ అన్పించుకుంటుందనీ ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నారు. అయితే కథానాయకుడు ఆల్రెడీ ఒక బిగ్ కార్పొరేట్ కంపెనీ సీఈవో అయినందువల్ల, తన బాధ్యతల్లో భాగంగా కార్పొరేట్ కంపెనీలు బడ్జెట్లు కేటాయించుకుని చేపట్టే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) గురించి తెలిసే వుండాలి. అయితే పాతకాలపు ఓల్డ్ ఫార్ములా కథ చేయడం వల్ల స్నేహితుడి కోసం ఆ అసాంఘీక శక్తులతో పోరాడేందుకు దిగే పాత కథానాయకుడు మాత్రమే మనకిందులో కన్పిస్తాడు. 
        ఇలా దిగినప్పటికీ తను ఏదైనా కోల్పోవడానికి తీసుకున్న రిస్కు కూడా ఏమీ లేకపోవడంతో, కథానాయకుడు బలహీన పాత్రగా కన్పిస్తాడు.  ‘ఏ సివిల్ యాక్షన్’ అనే హాలీవుడ్ మూవీలో జాన్ ట్రవోల్టా,  నీటిని కలుషితం చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్న దుష్ట కంపెనీ మీద పోరాటానికి దిగినప్పుడు, అతను తన కెరీర్ నీ,  సొంత కంపెనీనీ రిస్కు చేసి పణంగా పెట్టేస్తాడు. చివరికి ఆ కంపెనీ మీద జయించి, తనకేమీ లేకుండా మిగిలిపోయి కన్నీళ్లు పెట్టిస్తాడు. కథలో సరయిన ఎలిమెంట్స్ ద్వారా ఇది భావోద్వేగాలకి లోనుజేస్తుంది. పణం, త్యాగం లేని విజయాలు డొల్లగా వుంటాయి. సక్సెస్ గురించి ‘మహర్షి’ ఇచ్చే మెసేజి ఇలా అప్డేట్ కాలేదు. పైగా ఇది సక్సెస్ గురించిన కథగా మధ్యలోనే దారి తప్పింది. తన సక్సెస్ కోసం స్నేహితుడు చేసిన త్యాగానికి బదులు తీర్చుకునే కథగా మాత్రమే ఇది సాగింది. 140 కోట్ల మెగా బడ్జెట్ సినిమాలో వీలయినంత స్పష్టతతో, ఎక్కువ ప్రమాణాలున్న కథని ఆశిస్తాం. ఈ కథ రైతు సమస్యల్ని కూడా కలుపుకుని కన్ఫ్యూజింగ్ గా కూడా తయారైంది. అయితే దర్శకుడు ఇచ్చిన 40 నిమిషాల నేరేషన్ లో మహేష్ బాబుకి ఈ కథ విపరీతంగా నచ్చేసింది. కాబట్టి ప్రేక్షకులకి కూడా నచ్చి, సంతోషం వచ్చి  తీరాలి. 
ఎవరెలా చేశారు 
        కథ, పాత్ర సకల లోపల మయంగా వున్నా, ప్రిన్స్ మహేష్ బాబు డబుల్ ప్రిన్స్ లా వున్నాడు. ముఖ్యంగా మీసాలున్న స్టూడెంట్ పాత్రలో. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకి మీసాలు పెడితే ఎంత బావుంటారో, మీసాలున్న పాత్రలో మహేష్ అంత బావున్నాడు. సీఈవోగా కొంచెం అతిగా ప్రేక్షకులకి దూరంగా వున్నాడు. పాత్ర, కాన్సెప్ట్, కథాకథనాలూ కూడా సరీగ్గా కుదిరి వుంటే, ఈ లుక్ తో, నటనతో ప్రేక్షకుల్లో ఇంకా జోష్ నింపేవాడు. తనుతప్ప సినిమాలో మిగతావన్నీ నీరసించిపోవడంతో, అదీ మూడు గంటల సేపు సాగదీయడంతో, జోష్ జ్యూసులా కారిపోయింది. 
        అల్లరి నరేష్ బాధితుడి సాఫ్ట్ రోల్ నటించాడు ఫర్వాలేదు. హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమ కోసం, పాటల కోసం ఒక షెడ్యూలు ప్రకారం వచ్చి పోతూంటుంది. ఆమె వస్తూంటే టైమెంత అయిందో మనకి తెలిసిపోతూ వుంటుంది. విలన్ పాత్రలో జగపతి బాబు విలనీ అంటే బొత్తిగా ఇష్టంలేని విలన్ పాత్ర వేసినట్టు కన్పిస్తాడు. సినిమాలో చేసిందేమీ లేదు. సరయిన క్లయిమాక్స్ కూడా లేకుండా ఉత్తుత్తిగానే అరెస్టయి పోతాడు. పైగా ‘మిట్టల్’ అని మంచి పారిశ్రామిక వేత్త పేరు పెట్టుకుంటాడు. ఈ మధ్య సంచలనం సృష్టించిన పారిశ్రామిక పరారీ వేత్తల పేర్లు దొరకలేదేమో. 
        మహేష్ తల్లిదండ్రుల పాత్రల్లో జయసుధ, ప్రకాష్ రాజ్ లు ఫ్యామిలీ సెంటిమెంట్లు కురిపిస్తారు. మహేష్ ఓడిపోయి వెళ్లిపోతున్నప్పుడు జయసుధ చెప్పే డైలాగులు పవర్ఫుల్ డైలాగులు. రావురమేష్ ప్రొఫెసర్ పాత్రలో ఫర్వాలేదు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ పెద్దగా ఏమీ లేదు. ఫస్టాఫ్ కాలేజీ సీన్స్ లో స్వల్ప కామెడీ వుంటే, సెకండాఫ్ లో వినోదం పాలు పూర్తిగా తగ్గిన స్టార్ కమర్షియల్ సినిమాగా వుంటుంది. 
        దేవీశ్రీ ప్రసాద్ సంగీతంలో యజిన్ నిజర్ వాయిస్ లో ‘నువ్వే సమస్తం’, దేవీశ్రీ ప్రసాద్ వాయిస్ లో ‘ఛోటీ ఛోటీ బాతేఁ’ అనే మొదటి రెండు పాటలు బావున్నాయి. మిగిలిన పాటలు సోసోగా వున్నాయి. కేయూ మోహనన్ ఛాయగ్రహణం నైట్ పూట విలేజి ఫైట్ సీనులో బెస్ట్. రాం లక్ష్మణ్ లు కూడా ఫస్టాఫ్ లో రెండు ఫైట్ల కంటే, దీన్నే ఎక్కువ పంచ్ తో ఎమోషనల్ గా కంపోజ్ చేశారు. ఈ షాట్స్ కి కళాదర్శకత్వం కూడా (సునీల్ బాబు) హైలైట్. ఇకపోతే మూడు గంటల సాగతీత విషయంలో ఎడిటర్ ప్రవీణ్ మరికొంచెం ఎక్కువ మేధోమధనం జరిపి వుండాల్సింది. కానీ కాన్సెప్ట్ కన్ఫూజింగ్ గా వుంటే ఎడిటింగ్ కి మనకెందుకొచ్చిన గొడవని లాకులు ఎత్తేయడమే జరుగుతుందేమో.
చివరికేమిటి 
        దర్శకుడు వంశీ పైడిపల్లి, రచయితలు హరి, ఆహిషోర్ సాల్మన్ లు కథా రచన చేశారు. ఇంకో హస్తం దిల్ రాజు వుంటారనేది తెలిసిందే. త్రీ ఈడియెట్స్, మనుషులు మారాలి, దీవార్, కరణ్ అర్జున్ లాంటి ఛాయలు కథనిండా వ్యాపించివున్నాయి. ఇదేం తప్పుకాదు. ముందు కథేమిటో అర్ధంగావాలి. సక్సెస్ గురించైతే ఇది కథ కాదు. స్నేహితులమధ్య పరోప కారపు కథ మాత్రమే. దీనికి గ్రామాల భూములు కబళిస్తున్న ఆయిల్ కంపెనీ కుట్ర, దీన్నుంచి స్నేహితుడి భూముల్నీ, గ్రామాన్నీ కాపాడే కథానాయకుడి పరోపకార కథ. ఇది కాస్తా సంబంధం లేని రైతుల ఆత్మహత్యల కథగా మారిపోయింది. సక్సెస్ కోసం హీరో జర్నీ కథ కాస్తా ఫ్రెండ్ బదులు తీర్చుకునే కథగా ఎలా మారిపోయిందో, అలా భూముల ఆక్రమణ కథ వ్యవసాయం మీద, రైతుల ఆత్మహత్యల మీద కథగా మారిపోయింది. ఈ కన్ఫ్యూజన్ తో ఏదో కథ చేశామంటే చేశామన్నట్టు  వుంది గానీ, ఒక లైనులో కథ, పాత్ర చెప్పలేని పరిస్థితి. బిగ్ స్టార్ సినిమా అంటే సింపుల్ లైను మీద భారీ యాక్షన్ వుంటుంది. కానీ ఇక్కడ కన్ఫ్యూజింగ్ లైను తో భారీ కథ, జీరో యాక్షన్ కన్పిస్తుంది

        పైగా సక్సెస్ కోసం మహర్షి జర్నీ అనడంవల్ల దీనికి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కూడా లేకుండా పోయింది. జర్నీకి స్ట్రక్చర్ ఏముంటుంది. రకరకాల అనుభవాలు పొందడమే జర్నీ. అందుకని కథలో ఇమడని ఎన్నో అంశాలతో, పాత్రలతో ఎపిసోడ్లుగా సాగుతుంది కథనం. ఎపిసోడ్లు స్ట్రక్చర్ నివ్వవు. ఎపిసోడిక్ కథనం కమర్షియల్ సినిమా అవదు. స్ట్రక్చర్ నివ్వకుండా కమర్షియల్ సినిమా లేదు. అందుకని ఇదొక అనంత జర్నీ కాబట్టి ఇంటర్వెల్ కి కూడా కథలోకి వెళ్ళదు కథనం. ఇంటర్వెల్ తర్వాత పావుగంటకి జగపతిబాబు విలన్ పాత్ర వస్తేనే కథలోకి వెళ్తుంది కథనం. ఇదికూడా తూతూ మంత్రంగానే. సెకండాఫ్ కథేమిటో, ఎటు పోతోందో అర్ధంగాకుండా పోయింది. ఇలా మే నెల మహేష్ కి మంచిది కాదనే  నిరూపిస్తూ శాయశక్తులా కృషి చేశారు. మహేష్ బాబు నాలుగు నిమిషాలే స్టోరీ విన్నాచాలు,అది స్టోరీలా వున్నట్టు పసిగట్ట గల్గితే.
సికిందర్