వర్మ చెప్పబోయిన తీర్పు!‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (మూవీ రివ్యూ)

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
దర్శకత్వం : రాం గోపాల్ వర్మ, అగస్త్యా మంజూ  
తారాగణం : పి విజయ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీ తేజ్ తదితరులు 
రాఆఆచన : రాం గోపాల్ వర్మ, నరేంద్ర చారి, సంగీతం : కళ్యాణీ మాలిక్, ఛాయాగ్రహణం : రామీ 
నిర్మాతలు : రాకేశ్ రెడ్డి, దీప్తి 
విడుదల : మార్చి 29, 2019 

2 / 5

          చాలా కాలంగా వార్తల్లో వుంటూ వచ్చిన వర్మాస్ ఎన్టీఆర్ ఇక విడుదలైంది. కోర్టు ఉత్తర్వులతో ఏపీలో విడుదల ఆగి తెలంగాణలో విడుదలైంది. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రలతో వివాదాస్పదంగా తెరకెక్కించారని చూడకుండానే ఊహాగానాలు చేస్తూ ట్రెండింగ్ లో వుంచిన వర్గాలతో మంచి పబ్లిసిటీ లభించింది. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఈ ‘బయోపిక్’ తో ఒక పార్టీకి నష్టమని కూడా కోర్టు దాకా వెళ్ళారు. సినిమాల వల్ల పార్టీలు ఓడిపోవడమే కాదు, సమాజంలో మార్పులు వచ్చిన దాఖలాలు లేనేలేవు. సినిమాల దారి సినిమాలదే, ప్రజల దారి ప్రజలదే. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించిందంతా వాస్తవాలని నమ్మి ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసేంత అమాయకులేం కాదు ప్రేక్షకులు. పైగా ఎన్టీఆర్ ని చూపించిన విధానంతో వెన్నుపోటుకి చంద్రబాబుకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ నిచ్చేట్టుగా కూడా తయారయ్యింది సినిమా!

కథ 

          1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ పరాజయం పొంది అందరికీ దూరమై ఒంటరిగా జీవిస్తున్న సమయంలో, జీవిత చరిత్ర రాస్తానని దగ్గరవుతుంది లక్ష్మీపార్వతి. దీంతో ఎన్టీఆర్ అల్లుడు బాబు, ఎన్టీఅర్ కుటుంబ సభ్యులూ ఎలర్ట్ అవుతారు. పత్రికల్లో ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతిల సాన్నిహిత్యం గురించి పతాక శీర్షికలు వస్తాయి. దీంతో బాధపడిన లక్ష్మీ పార్వతిని ఓదారుస్తారు ఎన్టీఆర్. ఇంతటితో ఆగక పార్టీలో కూడా ముసలం బయలుదేరుతుంది. మరో వైపు ఎన్టీఆర్ తో మోహన్ బాబు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’  ఘన విజయం సాధిస్తుంది. ఆ తిరుపతి సభలో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించేస్తారు ఎన్టీఆర్. దీంతో బాబు అండ్ కో బేజారెత్తి పోతారు. ఎన్టీఆర్ కి నచ్చ జెప్పబోయి భంగపడతారు. పెళ్ళయి పోతుంది. ఇక పార్టీ వారసత్వం లక్ష్మీ పార్వతికి సంక్రమించినట్టేనని  భావించుకున్న బాబు పార్వతి మీద దుష్ప్రచారం ఉధృతం చేస్తారు. దీనికి ప్రతిస్పందనగా పార్టీలో ఎన్టీఆర్ తీసుకున్న చర్యల మూలంగా పార్టీ పగ్గాలు బాబు చేతికొస్తాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో వైస్రాయ్ మార్కు వెన్నుపోటు రచిస్తారు. దీంతో అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్ మానసికంగా కుంగిపోయి మరణానికి దగ్గరవుతారు…ఇదీ కథ.

ఎలావుంది కథ 

          లక్ష్మీ పార్వతి కళ్ళతో చూసి వర్మ తీసిన కథ ఇది. ఇది టైటిల్ లోనే తెలుస్తోంది. కాబట్టి ఇది పూర్తిగా లక్ష్మీ పార్వతి వాంగ్మూలం. తప్పంతా అవతలి పక్షానిదే అన్నట్టు నిందాపూర్వకంగా వున్న  ఈ వాంగ్మూలాన్ని ప్రేక్షకులు నమ్మాలా వద్దా అన్నది విశ్వసనీయతకి సంబంధించిన విషయం. వర్మ కూడా రీసెర్చి చేశానన్నారు. రీసెర్చి కూడా ఏకపక్షంగానే కన్పిస్తోంది. నేనేం తప్పు చేశానని ఎన్టీఆర్ పాత్రచేత అన్పిస్తారు చివరికి. కానీ ఒక సినిమా కథగా చూసినప్పుడు, ఆ పరంగా పాత్ర చిత్రణ చూసినప్పుడు,  అసలు తప్పంతా ఎన్టీఆర్ దే అన్నట్టు వుంటుంది ఆలోచించే ప్రేక్షకులకి. కారణం లేకుండా కల్లోలం రేగదు. అయినా లక్ష్మీ పార్వతి పాత్రని ఒక అమాయకురాలిగా, బాధితురాలిగా చూపిస్తూ, ఎన్టీఆర్ కి బాబు చేసింది అన్యాయమేనని బలవంతంగా రుద్దారు. రాజకోట రహస్యా లెప్పుడూ స్పెక్యులేషనే. రాజకీయ హత్యలైతే కోర్టుల కెక్కుతాయి. ఫలానా ఈ విధంగా  జరిగిందని తీర్పులు వెలువడుతాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే స్పెక్యులేషన్ తో వర్మ ఎలా తీర్పు ఇస్తారు. ఎవరు నమ్ముతారు. 
ఎవరెలా చేశారు 

          ఎన్టీఆర్ పాత్రలో విజయకుమార్ రూపంలో, హవాభావాల్లో సాధ్యమైనంత దగ్గరగా కన్పిస్తాడు. ఇంతకంటే న్యాయం చేయడం కుదరదు. ఈ బయోపిక్ లో నటనలు కాదు ముఖ్యం, విషయమేమిటా అనేదే చూస్తారు. కానీ చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ మాత్రం పూర్తిగా సరిపోయాడు. చూపు, గొంతు, చేత బాబు అన్నట్టే వున్నాడు. ఇంతకంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ వుండదు. లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞా శెట్టికి పోలికలు అవసర పడలేదు. కానీ నటించింది. 

          వర్మ స్టడీ కెమెరా షాట్స్ చాలా రిలీఫ్. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాఫియా – లేదా హర్రర్ ముద్రతో వుండాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ల మీద రెండు నేపధ్యాల గీతల్లో సాహిత్యం బావుంది. ఇక పీరియడ్ దృశ్యాల్లో కొన్ని తప్పులున్నాయి. ఆ కాలపు బ్లాక్ అండ్ వైట్ పత్రికలు చూపిస్తూనే కలర్ ఈనాడు చూపించడం. డైలాగుల్లో మీడియా అనే పదం వాడడం. మీడియా అనే పదం ఎలక్ట్రానిక్ మీడియాతో వచ్చింది. 

చివరికేమిటి 

ఎన్టీఅర్ జీవితంలోని చివరి దశతో ఈ బయోపిక్ లో విషయం ఎలావున్నా, సీన్లు అర్ధవంతంగా పేర్చుకుంటూ పోయారు. ఈ డ్రామా ప్రేక్షకుల మెదళ్ళలో సింక్ అవాలంటే దానికుండే నడకతో నెమ్మదిగానే నడిపారు. ఈ మొత్తం డ్రామాని త్రీ యాక్ట్ స్ట్రక్చర్ చేశారు. అందువల్ల మూడు విభాగాలుగా, ఆ విభాగాల తాలూకు కథనాలతో ఒక ఫ్లోలో పోతూంటుంది. మొదటి విభాగం ఎన్టీఆర్ – లక్ష్మీ పార్వతిల పాత్రల పరిచయం, వాళ్ళ ―సాన్నిహిత్యం, పుకార్లు చూపించారు. రెండో భాగంలో పార్వతికి టార్గెట్ చేసుకుని బాబు రంగంలో దిగడంతో బాబుకీ, ఎన్టీఆర్ కీ మధ్య యాక్షన్ రియాక్షన్ లతో కూడిన సంఘర్షణ చూపిస్తూ, ఇంటర్వెల్లో పెళ్లి చేసి తీవ్రత పెంచారు. ఈ రెండో విభాగం సంఘర్షణతో ఇంకా కొనసాగి, బాబు వైస్రాయ్ పతకంతో మూడో విభాగానికి చేరుతుంది. స్క్రీన్ ప్లే ఆర్డర్ లో పర్ఫెక్టుగా చేశారు. విషయమే విజ్ఞతకి వదిలేయాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ ది తీర్పులు చెప్పేంత కథాకథనాలు కావు. ఇది ప్రజాకోర్టులో విన్పించిన ఒక పక్షం వాంగ్మూలం మాత్రమే.

―సికిందర్