ఫర్వాలేదులే  గురూ! ‘హలో గురూ ప్రేమ కోసమే’( మూవీ రివ్యూ)

 ( సికిందర్)

చిత్రం : హలో గురూ ప్రేమ కోసమే
రచన – దర్శకత్వం : త్రినాధ రావు నక్కిన 
తారాగణం : రామ్, అనుపమా పరమేశ్వరన్, ప్రణీతా సుభాష్, ప్రకాష్ రాజ్
సితార, జయప్రకాష్, పోసాని, సత్య, ప్రవీణ్  తదితరులు 
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : విజయ్ సి చక్రవర్తి 
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ 
నిర్మాత : దిల్ రాజు 
విడుదల : 18 అక్టోబర్, 2018


రేటింగ్ 2.5 / 5

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇంకో ప్రేమ సినిమాతో పండగ ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఎన్నేళ్ళు స్ట్రగుల్ చేసినా స్టార్ డమ్ ని అందుకోలేకపోతున్న రామ్ కి గత ‘హైపర్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’  రెండూ మైనస్ అయ్యాయి. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కూడా వరుసగా ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘తేజ్ ఐ లవ్యూ’ లతో ఫ్లాపు లెదుర్కొన్న హీరోయిన్ గానే  వుంది. ఇక ‘బ్రహ్మోత్సవం’ తర్వాత ఇంకో సినిమాలో కన్పించకుండా పోయిన  ప్రణీత సంగతి సరే. ఇప్పుడీ అపజయాలతో వున్న ముగ్గురూ కలిసి ‘హలో గురూ ప్రేమ కోసమే’  అంటూ రోమాంటిక్ కామెడీతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడ్డారు. వీరికి ‘సినిమా చూపిస్తా మావా’, ‘నేను లోకల్’ అనే రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు నక్కిన త్రినాథ రావు  దర్శకుడయ్యాడు. అగ్రనిర్మాత దిల్ రాజు బ్యానర్ వీళ్ళందరికీ తోడ్పడింది. మరి ఇవన్నీ ఫలించాయేమో ఓసారి చూద్దాం…

కథ 


          ఇంజనీరింగ్ చదివిన సంజు (రామ్)  కాకినాడలో అల్లరిగా తిరుగుతూ వుంటాడు. పుట్టిన వూరు వదిలి హైదరంబాద్ వెళ్లి ఉద్యోగం చేయడానికి కొన్ని సెంటిమెంట్లు అడ్దొస్తూ వుంటాయి. అలాటిది మావయ్య (పోసాని)  బలవంతంతో హైదరాబాద్ లో ఉద్యోగం సంపాదించుకుని బయల్దేరతాడు. తల్లి (సితార) హైదరాబాద్ లో తనకి తెలిసిన విశ్వనాథ రావు (ప్రకాష్ రాజ్) ఇంట్లో బస ఏర్పాటు చేస్తుంది. అక్కడ విశ్వనాథ రావు కూతురు అనుపమ (అనుపమా పరమేశ్వరన్) ఇంజనీరింగ్ చేస్తూంటుంది. సంజు చేరిన సాఫ్ట్ వేర్ కంపెనీలో రీతూ (ప్రణీత) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ప్రేమించేసరికి, సంజు తనకి అనుపమ మీదే ప్రేమ వుందని తెలుసుకుంటాడు. ఇంతలో అనుపమకి తండ్రి వేరే సంబంధం చూస్తాడు. దీంతో సంజు ఇరుకున పడతాడు. సంజు కూడా ఎవర్నైనా ప్రేమించివుంటే కలపడానికి ప్రయత్నిస్తానని మాటిస్తాడు విశ్వనాథ రావు. ఓ ఫ్రెండ్ గా వుంటానంటాడు. ఫ్రెండు వైతే తను ప్రేమిస్తున్న అనుపమతో కలపెయ్యమంటాడు సంజు. దీంతో విశ్వనాథ రావు ఇరుకున పడతాడు. ఇచ్చిన మాట కోసం ఫ్రెండ్ గానే వుంటూ,  అనుపమ తండ్రిగా నిర్ణయం తీసుకోలేక సతమతమవుతాడు. ఈ చిక్కుముడి ఎలా వీడిందనేదే మిగతా కథ.  

ఎలావుంది కథ 

          చాలాచాలా సార్లు చూసేసిన పాత కథే. కొత్తదనమేమీ లేదు. కథలో కూర్చోబెట్టే బలమైన పాయింటేమీ లేదుగానీ, కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అదికూడా ఫస్టాఫ్ లోనే. సెకండాఫ్ లో స్పీడు తగ్గి సెంటిమెంటల్ డ్రామాగా మారుతుంది. అందుకని దీన్ని రోమాంటిక్ కామెడీ కాక,  రోమాంటిక్ డ్రామా అనాలి. ఇచ్చిన మాట కోసం హీరోతో ఫ్రెండ్ గా  మెలగాల్సి వచ్చే హీరోయిన్ తండ్రి కథే ఇది. దీనికి  ముగింపు కూడా రొటీన్ గా ఇచ్చారు. కథనంలో ఇచ్చినన్ని ట్విస్టులు ముగింపుకి ఇవ్వకపోవడం పెద్ద లోపం. 

ఎవరెలా చేశారు 


          ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫ్రెష్ గా కన్పిస్తాడు. మంచి టైమింగ్ తో కామెడీ, రోమాన్స్  చేస్తాడు. పాటల్లో మంచి మూవ్ మెంట్స్ ఇస్తాడు. ఒకటి రెండు ఫైట్స్ తో టెంపో పెంచుతాడు. కథ క్లాస్ గానే వున్నా మాస్ ని అలరించే ఎలిమెంట్స్ తగ్గకుండా చూసుకున్నాడు. అయితే ఫస్టాఫ్ లో తన పాత్రతో వున్న ఫన్, సెకెండాఫ్ లోనూ వుండేట్టు చూసుకోలేదు. కేవలం ప్రకాష్ రాజ్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే పాత్రగా మిగిలిపోయాడు. దీంతో ఇటు హీరోయిన్ తండ్రిగా, అటు హీరో ఫ్రెండ్ గా స్ట్రగుల్ అంతా ప్రకాష్ రాజ్ పాత్రకే ప్లస్ అయి, లవ్ కోసం స్ట్రగుల్ చెయ్యని పాత్రగా రామ్ బలహీనపడ్డాడు. 

          ఫస్టాఫ్ లో ప్రణీతతో కాఫీ షాప్ ఫన్ ఒక హైలైట్ గా వుంటే, అదే సెకండాఫ్ లో అనుపమా, ప్రకాష్ రాజ్ లతో రెస్టారెంట్ సీనుకి ఫన్ కుదరక వెలవెలబోయింది. కారణం, ప్రణీతతో తను ఇరుకున పడ్డట్టు. ఇక్కడ పడకపోవడం- ఇరుకున పడేది యూత్ అప్పీల్ కి విరుద్ధంగా ప్రకాష్ రాజ్ కావడం. సెకండాఫ్ కథకి రామ్, ప్రకాష్ రాజ్ ల పాత్రలు తారుమారు అవడంతో ఈ సమస్య. కమర్షియల్ కథల్లో సాధించాల్సిన సమస్య హీరోకి వుంటుంది, ఎదుటి పాత్రకి కాదు.

          హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అసలు కథలో ఏం జరుగుతోందో, ఎవరేం చేస్తున్నారో తెలియకుండా వుండిపోయే నిమిత్తమాత్రురాలైన పక్కా పాసివ్ పాత్ర. దీంతో హీరోయిన్ వైపు నుంచి వుండాల్సిన యూత్ అప్పీల్ చల్లారిపోయింది. ఆమె చాలా గ్లామరస్ గా,  టాలెంటెడ్ గా వుండే మాట నిజమే – మొత్తం సినిమాలో  ఏమీ చెయ్యని నల్లపూస పాత్రగా వుండిపోతే హీరోయిన్ గా వేయడమెందుకు? 

          ప్రణీత ఇప్పుడు కాస్త గ్లామర్ చెదిరి తన శక్తి కొద్దీ రోమాంటిక్ సీన్స్ పండించేందుకు కృషి చేసింది. తన పాత్రకి అర్ధం లేని ముగింపు నిచ్చి కట్ చేయడమే చూసేందుకు కూడా కష్టంగా వుంటుంది. ఇక ప్రకాష్ రాజ్ కి వంక పెట్టేదేముంటుంది –  పైగా ఈ కథే తనదయ్యాక! 

          సాంకేతికంగా నీటుగా వుంది, ఎడిటింగ్, మిక్సింగ్ వగైరా. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమే డల్ ఐపోయింది.  ఏం పాటలో, ఎందుకొస్తున్నాయో అర్ధంగాదు. విజయ్ కుమార్ కెమెరా వర్క్ క్లాస్ గా, రంగుల మిఠాయి తిన్నంత ప్లెజెంట్ గా వుంది. నిర్మాతగా దిల్ రాజు ఎంత కావాలో అంత ఆర్ధిక అండదండ లందించి ధైర్యాన్నిస్తూ నిలబడ్డారు దర్శకుడికి.

చివరికేమిటి 

          ఎక్కువ ఆలోచనలు పెట్టుకోని ప్రేక్షకులు చూసిందే చూడరా అని సరదాగా చూసెయ్యవచ్చు. ఏం చేస్తాం, దిల్రాజు తీసేవి అవే ప్రేమ సినిమాలు, అవే కుటుంబ సినిమాలయినప్పుడు. ఆయన బడ్జెట్ కి ఎంతో ప్రాముఖ్యమిస్తారు గానీ, కొత్త దనానికి అస్సలు సాహసం చెయ్యరు. దర్శకుడు త్రినాథ రావు నమ్మిన ఫార్ములా కూడా పాతని పాతగా, వీలు కుదిరినప్పుడు కొత్తగా చూపించడమే. ఈ సారి పాతనే ఫస్టాఫ్ వరకూ కొత్తగా చేసి, సెకండాఫ్ లో మెత్తబడ్డారు. కతికితే అతకదని ఇంటర్వెల్లో లెటర్స్ వేశారు. సెకండాఫ్ లో అతకనే లేదు. చిత్రీకరణ వరకూ ఆయన ట్రెండీగానే వున్నారు – రోమాన్స్ కి మాత్రం ట్రెండీ పాయింటు లేదు. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆలోచించాల్సింది, సబ్జెక్ట్ కూడా ఎనర్జిటిక్ గా వుండేట్టు చూసుకోవడమే. ఈసారి కెలాగో గట్టెక్కినట్టయింది. కానీ ఇంకోసారి చాలా ఎనర్జిటిక్ మూవీ కావాలి!