అదే పాత మోడల్ ప్రేమ! : హ్యాపీ వెడ్డింగ్  (మూవీ రివ్యూ)

 (సికిందర్ రివ్యూ)

రచన – దర్శకత్వం : లక్ష్మణ్ ఆర్య 
తారాగణం : సుమంత్ అశ్విన్, నిహారిక,మురళీ శర్మ, నరేష్, పవిత్రా లోకేష్, తులసి, ఇంద్రజ తదితరులు 
సంగీతం : శక్తికాంత్ కార్తీక్, ఛాయగ్రహణం : పి. బాలిరెడ్డి 
బ్యానర్ : పాకెట్ సినిమా, యూవీ క్రియేషన్స్  
విడుదల : జూలై 28, 2018 

రేటింగ్ : 2 / 5

          పరాజయాల రేసు గుర్రంమీద స్వారీ చేస్తున్న సుమంత్ అశ్విన్, నిహారికలు మరో ప్రేమ రేసు గుర్రం మీద ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘ఒక మనసు’ తో పరిచయమైన నాగబాబు కుమార్తె నిహారిక, ఆ సినిమా పరాజయం తర్వాత తిరిగి నటించిన ప్రేమ సినిమా ఇదే. ‘అంతకు ముందు ఆ తర్వాత’,  ‘లవర్స్’  అనే రెండు విజయాల తర్వాత, వరసగా నాల్గు ఫ్లాపు లెదుర్కొన్న సుమంత్ అశ్విన్,  ఈసారి కూడా  ‘హేపీ వెడ్డింగ్’ అనే మరో ప్రేమ సినిమాతో వచ్చాడు. ఇప్పుడు ఒక హిట్ ని ఆశిస్తున్న వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే ఏమైనా కలిసి వచ్చిందా? తమ కాంబినేషన్ ఏమైనా క్రేజ్ సృష్టించేట్టు వుందా? కొత్తగా పరిచయమవుతున్న దర్శకుడు లక్ష్మణ్ ఆర్య ఈ స్టార్స్ ఇద్దరికీ ఏ విధమైన న్యాయం చేయగలిగాడు? కొత్త దర్శకుల మూస డ్రామాల చట్రంలోంచి బయటపడగల్గాడా? మొత్తంగా ప్రేక్షకులకి ఎలాటి కొత్తదనాన్నిచ్చాడు?… ఇవొకసారి పరిశీలిద్దాం.

కథ 


          విజయవాడలో వుండే ఆనంద్ (సుమంత్ అశ్విన్) యాడ్ జింగిల్స్ కి పాటలు రాస్తూంటాడు. హైదరాబాద్ లో వుండే అక్షర (నిహారిక) బొథీక్ నడుపుతూంటుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆక్షర నిర్ణయాలు తీసుకోవాలంటే కన్ఫ్యూజన్ కి లోనవుతుంది. ఎటూ తేల్చుకోదు. అలాటి ఆమెకి  ఇద్దరి కుటుంబాలూ కలిసి ఆనంద్ తో నిశ్చితార్ధం జరిపేస్తాయి. నిశ్చితార్ధం తర్వాత ఆనంద్ మారిపోయాడని అనుమానిస్తుంది ఆక్షర. వస్తానన్న టైముకి రెండు సార్లూ మిస్ అవడంతో తనని కేర్ చేయడం లేదని ఫీలవుతుంది. ఇప్పుడే ఇలా వుంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెలా వుంటాడోనని, తనకి ఆలోచించుకునేందుకు టైం కావాలని అంటుంది.  గతంలో ఆమె ఇంకొకర్ని ప్రేమించి వుంటుంది. అతడి వైపు మొగ్గు చూపుతుంది. విషయం తెలుసుకున్న ఆనంద్ తండ్రి ఆమెకి దగ్గరయ్యే చిట్కాలు చెప్తాడు. ఇంకో వైపు పెళ్లి రోజు దగ్గర పడుతూంటుంది. పెళ్లి రోజు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అక్షర ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకుందా లేదా? ఇదీ కథ.

ఎలావుంది కథ 

          గత రెండు దశబ్దాలుగా తెలుగు ప్రేమ సినిమా తీయాలంటే రెండే పాయింట్లు దొరుకుతాయి. అవే రిపీట్ చేస్తూంటారు ప్రపంచంలో ప్రేమికులకి ఇంకేం సమస్యా లేనట్టు. వుంటే ప్రేమలో ప్రేమ చెప్పలేకపోవడం, లేదంటే చిన్న విషయానికి అపార్ధం జేసుకుని విడిపోవడం. ప్రతీ కొత్త దర్శకుడూ ఈ సుత్తి వేసివేసి ఫ్లాపవువుతూనే వున్నాడు. అయినా ఈ టెంప్లెట్ ఒక పవిత్ర గ్రంథంలా నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం హీరోయిన్ నిర్ణయం తీసుకోలేకపోవడం గురించే మొత్తం కథంతా. ఇటీవలే ఇలాటిదే ‘కాదలి’ వచ్చి ఫ్లాపయ్యింది. శ్రీ విష్ణు నటించిన ‘మెంటల్ మదిలో’ కూడా ఫ్లాపయ్యింది. ఇప్పుడు ‘హేపీ వెడ్డింగ్’ కూడా ఇదే వడ్డిస్తోంది. ఇక చూసే ప్రేక్షకుల ఓపిక!  

ఎవరెలా చేశారు 

          తన పాత్రని హుషారుగా నటించాలనుకుని సుమంత్ అశ్విన్ ఓవరాక్షన్ చేశాడు. కానీ ప్రేక్షకులు ఇలా తనని రిసీవ్ చేసుకోరనేది మరోసారి తేలింది. తను ఎంత కామెడీ చేసినా నవ్వే పరిస్థితి లేకపోగా పేలవంగా వుంటోంది. పోతే ఇది రోమాంటిక్ కామెడీ కూడా కాదు. నిర్ణయం తీసుకోలేని  హీరోయిన్ తో సాగే రోమాంటిక్ డ్రామా. ఇందులో యూత్ అప్పీల్, రోమాంటిక్ అప్పీల్ కూడా లేవు. పైగా ఈ కథ తనది కాదు, హీరోయిన్ మీద నడిచే కథ. అంటే తను పాసివ్ పాత్ర, ఆమె యాక్టివ్ పాత్ర. ఇకపోతే హీరోయిన్ తో రోమాన్సే లేదు. ఇలా మార్కెట్ యాస్పెక్ట్ కి సంబంధించి ఎదురయ్యే ప్రశ్నలు చాలావున్నాయి.  
          హీరోయిన్ నిహారిక గత సినిమా కంటే బాగా మెరుగుపడింది నటనలో. కానీ పాత్రే అవాస్తవికంగా, సిల్లీగా వుంది. తక్షణ నిర్ణయాలు తీసుకోలేని తను ముందుగా పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సుల  కెళ్ళాలి నిజానికి. నిర్ణయాలు తీసుకోలేని తను బొథీక్ ఎలా నడుపుతోంది?  అసలది నిర్ణయాలు తీసుకోలేక పోవడమా? ప్రతీదీ నెగెటివ్ గా తీసుకోవడమా? హీరోతో విడిపోవడానికి నెగెటివ్ ఫీలింగ్సే కారణం కదా? దేని గురించి పాత్రచిత్రణ? ఎందుకంటే ఒకే వ్యక్తిత్వ లోపంతో పాత్రచిత్రణ వుండాలి. అది కాసేపు ఇది కాసేపు కాదు. విడిపోయే ఇంటర్వెల్ ఘట్టంలో ‘నన్ను వెయిట్ చేయించి సారీ చెప్తావా’ అంటుంది. ఇది నెగెటివిజంనో, ఇగోనో తెలుపుతుంది.  ఇలా సిల్లీ కారణాలతో విడిపోతోందంటే వెనుక ఇంకో ఎఫైర్  వుంటేనే జరుగుతుంది. ఇంత సాధించిన తను చివరికి సిల్లీగా ఏడ్పులు ఏడ్చి పెళ్లి చేసుకుంటుంది. 
          ఇక్కడ తండ్రి పాత్ర పోషించిన మురళీశర్మ, ఆమె ఏం నిర్ణయం తీసుకున్నా సమర్ధి స్తానంటాడు. మరోవైపు పెళ్లి చెడినందుకు హీరో కుటుంబానికి తను వెళ్లి క్షమాపణ చెప్తానంటాడు. ఇది కూతురితో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లా వుందే తప్ప, ఆదర్శ తండ్రి మాటల్లా లేవు. 
          పి. బాలిరెడ్డి చాలాకాలం తర్వాత ఈ సినిమాకి మాత్రం అందమైన ఛాయాగ్రహణాన్ని సమకూర్చాడు.  అయితే కొన్ని చోట్ల కళాదర్శకత్వం అతిగా వుంది. సినిమా సాంతం బ్లూ టింట్ ని వాడారు. పాటలకి పెద్దగా  ప్రాధాన్యం లేదు. కొత్త దర్శకుడి పనితనంలో ప్రత్యేకత ఏమీలేదు.

 

చివరికేమిటి?

          సినిమా ప్రారంభం నుంచీ ముగింపు వరకూ రిలీఫ్ లేకుండా పెళ్లి కుదిరిన నేపథ్య  వాతావరణంలోనే సాగుతుంది. ఇందులో అటు ఇటు రెండు కుటుంబాల ఇళ్ళ నిండా జనాలు, గానా బజానాలు,  ఏవేవో వేడుకలు. ఇంకా ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘పెళ్లి సందడి’ పాత దృశ్యాలు. అసలే ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో తెలియని హీరోయిన్ అడుగు పెట్టే ఇంట్లో కాబోయే మామగారు నరేష్ వేళాపాళా లేకుండా హార్మోనియం పెట్టె ముందేసుకుని పాత పాటలు అందుకోవడం. హీరో సంగతి పక్కన పెడదాం, మనకి తెలిసి హీరో తండ్రిని చూసి ఒక్కరోజు కూడా అక్కడుండదు పెళ్ళయ్యాక హీరోయిన్!
          ఇక స్థలం మార్చి ఫాంహౌస్ లో మళ్ళీ ఆటల పోటీలు. ఇక ముగింపులో హీరో, హీరోయిన్ తండ్రి, హీరోయిన్ ఒకరి తర్వాత ఒకరు చేసే నీతి బోధలు – అసలీ సినిమా మొత్తం నాటకం చూస్తున్నామా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది. హీరోయిన్ విడిపోతున్నప్పుడు హీరో ఒక డైలాగ్ అని ఇంటర్వెల్ కార్డు వేస్తాడు – నీకే మాత్రం డౌట్ వున్నా మనమిక్కడే ఆపేద్దామని. నిజమే, ఈ సిల్లీ డ్రామా ఇక్కడితో ఆపేస్తే బావుండేది.