మన టెంప్లెట్ – మన ఆమ్లెట్ : ‘గుణ 369’ స్క్రీన్ ప్లే విశ్లేషణ

మన టెంప్లెట్ – మన ఆమ్లెట్ : ‘గుణ 369’ స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఈ కాలంలో కూడా మాస్ సినిమా అంటే అదే పాత మూస వీసమెత్తు కథ, అదే నీరస హీరో పాత్ర. కానీ తరం మారిన మాస్ ప్రేక్షకులు ఇప్పుడు తమ దృక్కోణంతో కొత్త తరహా సినిమాల వైపు చూస్తున్నారు. మేకర్ల దృక్కోణం మసకబారిందని తెలుసుకుంటున్నారు. రోజుకో కొత్త ఆకర్షణని వాళ్ళ జీవితాల్లోనే వర్తమాన ప్రపంచం మోసుకొస్తోంది. ఒకప్పుడు టీవీ సీరియల్స్ సినిమాలకి ప్రేక్షకుల్ని తగ్గించేశాయి. సెకండ్ షోలకి ప్రేక్షకులుండే వాళ్ళు కాదు. ఇప్పుడు సెల్ ఫోన్లు టీవీ సీరియల్స్ కి మించిన రకరకాల వినోదాల మిఠాయిలు పంచుతూ కడుపు నింపేస్తున్నాయి. పాన్ షాపులో పార్ట్ టైం వర్కర్ గా కూర్చున్న తెలుగు టీనేజర్, అదే పనిగా సెల్ ఫోన్లోకి చూస్తూ ఎంజాయ్ చేస్తూంటాడు. ఇంకా సినిమాలకి ఎక్కడ పోతాడు. రోడ్డు పక్క ఆటోవాలా కాళ్ళెత్తి హేండిల్ మీద పడేసి పడుకుని, సెల్ ఫోన్లో ఏదో చూస్తూ గ్లోబల్ నవ్వులు ముసిముసిగా నవ్వుకుంటూ వుంటాడు. ఇంకా సినిమాలకి ఎక్కడ పోతాడు. తన మాస్ కులపు సినిమాలంటే అవే పాతమూస తాతలనాటి సినిమాలైనప్పుడు.

మాస్ ప్రేక్షకుడు మిస్టర్ మాస్ గా మారిపోయాడు. వాడికిప్పుడు గ్లోబల్ ప్రపంచాన్ని లోకల్ గా మార్చి, వాళ్ళ కులపు మాస్ సినిమాలుగా చూపిస్తూ ఎర్ర తివాచీ పర్చి స్వాగతం పలకాల్సిందే. సెల్ ఫోన్లో లెక్కలేనన్ని ప్రపంచ దృశ్యమాధ్యమాలు ఎప్పటి కప్పుడు అంతంత నూతన పోకడలు పోతూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. తెలుగులో వచ్చే మాస్ సినిమాలవైపు చూస్తే, ఆ మేకర్లు ఇంకా ఎక్కడో గడిచిపోయిన కాలంలో అవే రీసైక్లింగులు చేసుకుంటూ సేదదీరుతున్నారు. ఒక మార్కెట్ యాస్పెక్ట్ ఫికరు లేదు, ఒక క్రియేటివ్ యాస్పెక్ట్ ఫియర్ లేదు. ఇప్పటికైనా మిస్టర్ మాస్ జనరేషన్ కి తగ్గ రీబూట్ చేసిన మాస్ సినిమాలతో ముందుకెళ్ళాలంటే, గడిచిపోయిన తరం మాస్ ప్రేక్షకుల కాలంలో వుండిపోకూడదని, ఎలాగో సంకెళ్ళు తెంచుకుని ఇవతల పడ్డాడు ఇన్నాళ్ళకి పూరీ జగన్నాథ్. గ్లోబల్ టేస్టులు రుచిమరిగిన మిస్టర్ మాస్ ప్రేక్షక సింహాలకి, వాళ్ళకి సూటయ్యే డిజైనర్ మటన్ మాస్ వడ్డించి గంగవెర్రులెత్తించాడు – ‘ఇస్మార్ట్ శంకర్’ తో.

మళ్ళీ ‘రాక్షసుడు’ ఇదే పనిచేసింది. ఆటోవాలాలూ బైకుల బాబులూ థియేటర్ పార్కింగు, చుట్టూ కాంపౌండూ కూడా నింపేసి, బయట రోడ్డుమీది దాకా క్రిక్కిరిసేలా పర్చేశారు వాళ్ళు పయనమై వచ్చిన ఘన వాహనాలని. ‘రాక్షసుడు’ మాస్ కాదు. కొత్త అనుభూతుల్ని పంచితే దేన్నయినా అందుకుంటారు మిస్టర్ మాస్ ప్రేక్షకులని దీని భావం. కాలం చెల్లిన తాతలనాటి అనుభూతులు దగ్గరే ఆగిపోలేదు వాళ్ళు, కాలంతో బాటే అప్డేట్ అవుతున్నారు.

డిటో గుణ
మాస్ కులం, వాళ్ళ మాస్ సినిమాలూ ఎప్పటికీ వుండే బిజినెస్ ఐడియా. బిజినెస్ ఐడియా మడిగట్టుకు కూర్చుంటే ఇక ఈ సెగ్మెంట్ ని క్యాష్ చేసుకోవడం కచ్చితంగా వుండదు. మాస్ సినిమాల నిర్వచనం మార్చుకుంటే, ఆధునిక డిజైనర్ మాస్ సినిమాలుగా వస్తే ట్రెండ్ లో వున్నట్టు. హిందీలో విజయవంతంగా ఈ పని చేస్తున్నది ఏకైక రోహిత్ శెట్టి. మిస్టర్ మాస్ కి పట్టే మాస్ సినిమా అంటే హీరో నీతులు చెప్పడం కాదు, దర్శకుడు మెసేజి లివ్వడం కాదు, హీరోని ఈసురోమని బాధల ప్రపంచంలో బరువుగా ఈడ్చడం కాదు, ఏడ్పించడం కాదు. ఇవన్నీ ‘గుణ 369’ లో చక్కగా ముస్తాబై వున్నాయి.

కొత్త దర్శకుడు అర్జున్ జంధ్యాల గురువుగారు బోయపాటి శ్రీను తీసిన ‘జయజానకీ నాయక’, ‘వినయ విధేయ రామ’ లు సూపర్ అవుట్ డేటెడ్ మూవీస్ గా రుజువై ఆయనే ఆశ్చర్య పోయాక, తను ఆయన్ని మించిన సూపర్ సోనిక్ అవుట్ డేటెడ్ గా ‘గుణ 369’ మేకింగ్ చేశాడు. అసలే అవుట్ డేటెడ్, పైగా రీసైక్లింగ్ చేసిన విషయమూ అర్ధవంతంగా లేక, స్త్రక్చరూ లేక, అరువు దెచ్చుకున్న క్రియేటివ్ స్కూలు టెంప్లెట్ కళలు చూపెడితే ఏం జరుగుతుందో ఒక మంచి ఉదాహరణగా తన లాంటి యంగ్ క్రియేటివ్ మాస్టర్లకి పాఠ్యాంశంగా అందించాడు.

జానర్ వచ్చేసి మాస్ యాక్షన్, కథ వచ్చేసి పా(తా)త మూస ఫార్ములా, పాత్ర వచ్చేసి యూత్ అప్పీల్ లేని జమానా నాటి పక్కా పాసివ్, స్క్రీన్ ప్లే వచ్చేసి టెంప్లెట్ ఆమ్లెట్, మేకింగ్ వచ్చేసి డిమాండ్ లేని నోకియా.

నొక్కి చెబుతున్న కథేమిటంటే, ఒక రాధా (ఆదిత్యా మీనన్) అనే సెటిల్మెంట్ గూండా. ఇతడికో ఆడ డాన్ లాంటి తల్లి (మంజూ భార్గవి). ఇంకోవైపు రవి కుమార్ అనే మెడికల్ షాపు వాడు. ఇతడికో గ్యాంగ్. ఆ గ్యాంగుతో గ్యాంగ్ రేపులు, బెదిరింపు వీడియోలు. మరింకోవైపు గుణ (కార్తికేయ) అనే గ్రానైట్ కంపెనీలో ‘మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్’. ఇతడికి తల్లి దండ్రులు, చెల్లెలు, భట్టు అనే ఓ ఫ్రెండ్ (మహేష్).

రాధా వూళ్ళో ఒకడు తన పేరు లెక్క చేయడంలేదని కొట్టడానికి పోతాడు. అరిచి తన పేరు చెప్పుకుని మరీ కొడతాడు. ఒక తోపులో ఓ ప్రేమజంటని వెంబడించి ఆమెని గ్యాంగ్ రేపు చేసి వీడియో తీస్తారు రవికుమార్ గ్యాంగ్. ఈ రెండు ప్రారంభ దృశ్యాల తర్వాత గుణ ఫ్యామిలీని చూపిస్తారు. నిద్ర పోతున్న గుణని లేపి డ్యూటీకి పంపుతారు. గుణ బయట కొట్లాడుకుంటున్న అన్నదమ్ములని విడదీసి, సమస్యకి హింస పరిష్కారం కాదని, రాజీ చేసుకోవాలనీ నీతి చెప్తాడు. గుణ బీటెక్ పాసవలేదు. ఆ పరీక్ష రాయడానికి పోతూ తనకి ఎవరైనా ఎదురు రావాలంటాడు. ఇంట్లో ఇది కుదరక పోతూంటే, గీత (అనఘ) అనే అమ్మాయి బండికి గుద్దుకుని ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ఎదురొచ్చింది కాబట్టి పరీక్ష బాగా రాస్తానంటాడు. ఆమె పెన్నుఇచ్చి దాంతో బాగా రాయమంటుంది. బాగా రాసి పాసై పోతాడు. ఫ్రెండ్ భట్టుతో మందు కొడుతూ గీతని తల్చుకుంటాడు.

మొబైల్ షాపులో పని చేసే గీతతో లవ్ ట్రాక్ మొదలెడతాడు. మాటిమాటికీ సెల్ ఫోన్ పగులగొట్టుకుని రిపేరు కోసం ఆమె దగ్గరికి పోతూంటాడు. పాట. ఇంట్లో చెల్లెలి సెంటిమెంటు, పెళ్లి విషయం. మెడికల్ షాపు వాడి సంబంధం మాట్లాడాలనుకోవడం. గీత బర్త్ డే. గిఫ్ట్ కొనివ్వడం. పాట. గీతమీద రవికుమార్ గ్యాంగ్ కన్నేయడం. గుణవచ్చి తరిమి కొట్టడం. ప్రేమ సంభాషణ. గీతకి ఉంగరం కొనిపెట్టడం. గీత లవ్ లో పడడం. పాట. భట్టు చెడుగా మాట్లాడాడని రాధా కొట్టబోతే, రాధా ఎవరో భట్టుకి తెలీదని వదలమని గుణ అనడం. రాధా వదిలేయడం.

ధాబా గొడవలో రవికుమార్ రాధని తోసెయ్యడం. అతను రాధా అని తెలిసి భయపడి గుణని కలవడం. నచ్చ జెప్పడానికి గుణ వెళ్ళడం. వాణ్ని తీసుకుని ఒక ప్లేస్ కి రమ్మని రాధ అనడం. గుణ తో ఆ ప్లేస్ కి వెళ్లిన రవికుమార్ క్షమించమని అడిగితే, రాధ చంపబోవడం. రవికుమార్ గ్యాంగ్ రాధ మీద దాడి చేసి చంపెయ్యడం. ఇంటర్వెల్.

ఫస్టాఫ్ టెంప్లెట్
టెంప్లెట్ కథ అంటే ఏ కథనమైనా ఒకే చట్రంలో, ఒకే మూసలో అవే సీన్లతో అవే వరసలో వుండడం. కథనం కోసం పెద్దగా కష్టపడ నవసరం లేకపోవడం. ఒక క్రిమినల్ యాక్టివిటీ, హీరో ఫైట్, ఆ విజయంతో ఒక గ్రూప్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ కొనసాగింపు, హీరోయిన్ లవ్ లో పడగానే డ్యూయెట్, ఇలా లవ్ ట్రాక్, మూడు పాటల కోటా పూర్తయ్యాక విలన్ ఎంట్రీ, విలన్తో కథ మొదలై ఇంటర్వెల్… ఇలా వుంటుంది ఫస్టాఫ్ టెంప్లెట్. పదేపదే ఇలాగే చూపిస్తారు టెంప్లెట్ సినిమాలు.

సినిమా జ్ఞానం లేని ఎవరైనా ఈ వరసలో పెట్టి కథ రాసేయ్యొచ్చు. స్క్రీన్ ప్లే రాయడం కష్టంగానీ, టెంప్లెట్ ఆటోవాలా కూడా రాసేస్తాడు. విచారకరమైన విషయమేమిటంటే, నవతరం ప్రేక్షకుల్లో ఇంకో క్రేజ్ సంపాదించుకున్న హీరోగా మెరుస్తున్న కార్తికేయ – ఈ అరిగిపోయిన టెంప్లెట్ నే వాడుకోవడం.

ఈ టెంప్లెట్ కథనంలో వున్నవి కూడా చూసి చూసి వున్న టెంప్లెట్ సీన్లే. ఒక్కటీ ఉత్సాహ పర్చే ఫ్రెష్ సీను లేదు. తెల్లారి హీరోని నిద్రలేపే హీరో పరిచయ సీను (హీరో నిద్ర లేచే, ఆఫీసు కెళ్ళే, పరిచయ సీన్లు చూసి ఇప్పటి హాలీవుడ్ డైరెక్టర్లు నవ్వుకుంటున్నారు. తెలుగులో ఇంకో సీను కూడా చాలాకాలం టెంప్లెట్ చేసుకున్నారు కొత్త మేకర్లు – సినిమా ప్రారంభంలో హీరో తండ్రో, హీరోయిన్ తండ్రో పేపరు చదువుకుంటూ కూర్చుని – ఏమే కాఫీ తేవే – అని భార్యని కేకేయడం!).

గుణ బీటెక్ పాసవక పోవడం ఇంకో టెంప్లెట్. గ్రానైట్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఒక సీనులో చూపించి వదిలెయ్యడం ఇంకో టెంప్లెట్. పరీక్ష రాయడానికి వెళ్ళేప్పుడు ఎవరో ఎదురు రావాలనే చాదస్తం ఇంకో టెంప్లెట్. రోడ్డు మీద హీరో హీరోయిన్ల బళ్ళు డాష్ ఇచ్చుకుని ప్రేమ పుట్టడం, పరీక్ష పాసవగానే ఫ్రెండ్ తో మందు కొట్టడం, హీరోయిన్ని తల్చుకోవడం… కావాలని సెల్ ఫోన్ పగులగొట్టుకుంటూ ఆమెని కలవడం, పాటేసుకోవడం, చెల్లెలికి పెళ్లి సంబంధం అనుకోవడం, హీరోయిన్ బర్త్ డే, బర్త్ డే గిఫ్టు ఇవ్వడం, జ్యువెలరీ షాపులో ఉంగరం కొనివ్వడం ( జ్యువెలరీ షాపు కాకపోతే, పట్టు చీరల కోసం బట్టల షోరూం తప్పక వుండాల్సిందే)…ఇలా చూసి చూసివున్న అవే పాత సీన్లతో నింపేశారు. కొత్త థాట్స్, క్రియేటివిటీ లేవు.

మెడికల్ షాపు వాడితో చెల్లెలి పెళ్లి సంబంధమని రెండు మూడు సార్లు అనుకోవడమే గానీ, వెళ్లి ఆ గ్యాంగ్ రేపులు చేసున్నవెధవని కలిసింది లేదు. సెకండాఫ్ లో ఈ పెళ్లి సంబంధం వూసే వుండదు. ఇలా పే ఆఫ్ చేయని సెటప్ గా వుండిపోయింది.

ప్రారంభంలో రెండు విలన్ గ్రూపుల్ని, హీరోని పరిచయం చేసి ఇంటర్వెల్ దాకా ప్రేమ ట్రాకుతో, కుటంబ సీన్లతో నడిపారు టెంప్లెట్లో. ఇంటర్వెల్లో విలన్ ని తెచ్చి కథ ప్రారంభించారు. ఈ విలన్ చాలా వీక్. ఆదిత్యా మీనన్ అనే పేరున్న దుష్టపాత్రల ఆర్టిస్టుతో సెటిల్మెంట్ గూండాగా ఒక్క సెటిల్మెంట్ చేసే సీనుండదు. చిల్లర తగాదాలతో వుంటాడు. ఇతడితో జనం ఆడుకుంటున్నారా అన్నట్టుంటుంది. ఇతను కొట్టబోతాడు గానీ, ఎవరైనా నచ్చజెప్తే, వీడు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నానని వదిలేస్తాడు. ఇంత పెద్ద గూండా అని చెప్తూ, ఇతడి గురించి వూళ్ళోనే ఎవరికీ తెలీనట్టు చూపిస్తారు. ఎంట్రీ సీను ఇదే. నా పేరు తెలియదా అని ఒకడ్నికొట్ట బోతాడు. తర్వాత హీరో ఫ్రెండ్ భట్టు ఇతనెవరో తెలీక ఓ మాట అనడం, హీరో వచ్చి నచ్చజెప్పి విడిపించడం, ఆ తర్వాత మళ్ళీ ధాబా గొడవలో ఇతనెవరో తెలియక మెడికల్ షాపు వాడు నెట్టేయడం…ఇలా ప్రతీచోటా ఈ గూండా జనంలో జంపఖానా అయిపోతాడు. ఇంత పెద్ద ఆర్టిస్టుని ఇలా వాడుకున్నారంటే మార్కెట్ యాస్పెక్ట్ ఏపాటి ఆలోచించారో అర్థం జేసుకోవచ్చు. దాభా దగ్గర తనని నెట్టేసిన స్వల్ప సంఘటనని పట్టుకుని, వాణ్ణి చంపేదాకా పోవడం, వాడి చేతిలోనే ఇంటర్వెల్లో చావడం హాస్యాస్పదంగా వుంది.

ఇక్కడ హింస వద్దని, రాజీ మేలని హీరో చెప్పే నీతి కూడా పనికి రాకుండా ఇంటర్వెల్ కే ముగిసిపోయింది. ఇప్పటిదాకా హీరోపాసివ్. ఈ పాసివ్ నెస్ క్లయిమాక్స్ దాకా సాగుతుంది. ఇంటర్వెల్లో చెయ్యని హత్యలో ఇరుక్కుంటాడు. ఈ పరిస్థితి గురించి తర్వాత సెకండాఫ్ లో రివీలయ్యే విషయం ఏమిటంటే, హీరో ఫ్రెండ్ భట్టుయే రవికుమార్ గ్యాంగుతో కుమ్మక్కై ఇదంతా చేయించాడని. అంత క్లోజ్ ఫ్రెండ్ ఎందుకిలా చేశాడో చెప్పే కారణం కూడా స్వార్ధంతో కూడినదై వుండదు. స్నేహంలో వెన్నుపోట్ల చేదు వాస్తవాన్ని ఆవిష్కరించేదిగా వుండదు. వాళ్ళు తన కుటుంబాన్ని బెదిరించడంతో ఇలా చేశానంటాడు. బలహీన పాత్ర, బలహీన కారణం, బలహీన పే ఆఫ్.

దీంతో అయిపోలేదు. బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు ఇంకో ద్రోహం కూడా చేస్తాడు. హీరోని హత్యలో ఇరికించింది గాక, మళ్ళీ అదే గ్యాంగ్ చేతిలో హీరోయిన్ గ్యాంగ్ రేప్ కి గురై ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు సెకండాఫ్ కథలో. ఒక కథలో ఒక పాత్ర ద్రోహం చేస్తే, ఒకే ద్రోహంతో వుండాలనీ, లేదా ఒక కథ పాత్రల మధ్య తలెత్తే అపార్ధంతోవుంటే, ఒకే అపార్ధం చుట్టూ కథ నడవాలన్న ఏకసూత్రత పాటించకపోవడం వల్ల – ఈ అర్ధం పర్ధం లేని ఫస్టాఫ్- సెకండాఫ్ కథలు తయారయ్యాయి. తన కుటుంబాన్ని బెదిరిస్తే హీరోకి చెప్పాలన్న లాజిక్ కూడా లేకుండా స్నేహం నడిపారు.

ఇలా ఇంటర్వెల్లో విలన్ చచ్చి హీరో ఇరుక్కోవడంతో ఈ టెంప్లెట్ కథ ఇక ప్రారంభమయిందనుకుంటాం. కానీ సెకండాఫ్ లో ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటాం.

ఈ కథేంటి?
గుణ అరెస్టయి జైలు కెళ్ళడం. తల్లిదండ్రులు వచ్చి ఏడ్వడం. గుణ జైల్లో ఖైదీ నంబర్ 369 గా ఇతర ఖైదీలతో కలిసి కార్మిక పనులు చేయడం. భగవద్గీత చేతిలోకి తీసుకుంటే గీత గుర్తుకురావడం. ఆమెతో డ్రీమ్ సాంగేసుకోవడం. జైలు నుంచి విడుదలై పోవడం. వూళ్ళో అతణ్ణి అందరూ దూరంగా వుంచడం. గీత ఇంటికి వెళ్తే ఆమె తండ్రి రానీయక పోవడం. గీతకి వేరే పెళ్లి చేయబోతే ఆత్మహత్య చేసుకుందని ఫ్లాష్ బ్యాక్ వేసుకోవడం. గుణ విషాద గీతం వేసుకోవడం. గుణ తండ్రిమీద రాధా అనుచరులు ఎటాక్ చేయడం. తండ్రి చెయ్యి తెగిపోవడం. గుణ రాధ అనుచరుల మీదికి పోవడం. రాధా తల్లి రవికుమార్ గ్యాంగ్ ని వారం రోజుల్లో పట్టుకుని తనకి అప్పజెప్పాలని వార్నింగ్ ఇవ్వడం. ఎస్సై ఇంట్లో దాక్కున్న గ్యాంగ్ ని పట్టుకోబోతే పారిపోవడం. ఫ్రెండ్ భట్టు నిజస్వరూపం తెలియడం. మొదటి ద్రోహం తోబాటు రెండో ద్రోహం ఎందుకు చేయాల్సి వచ్చిందో ఫ్లాష్ బ్యాకేసుకోవడం. గీతని తనే గ్యాంగ్ కి అప్పజెప్పినట్టు చెప్పుకోవడం. గుణ ఆ గ్యాంగ్ ని గాలించి వధించడం. గుణ స్త్రీ జాతికి గొప్ప మేలు చేశాడని టీవీ ఛానెల్స్ మోత మోగించడం. గుణ అలా జైలు కెళ్ళి ఇలా వచ్చేయడం. శుభం.

సెకండాఫ్ టెంప్లెట్
సినిమాల్లో సెకండాఫ్ టెంప్లెట్ ఇలా వుంటుంది : ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ తో లవ్ ట్రాక్ వదిలేసి ఇంటర్వెల్లో వచ్చిన విలన్ తో యాక్షన్ కథ మొదలు, బ్లాక్ కాస్ట్యూమ్స్ వేసుకుని కొండ కోనల్లో హీరోయిన్ తో మెలోడీ సాంగ్, విలన్ తో పోరాటం, హీరోయిన్ తో ఇంకో డ్యూయెట్, విలన్ తో ఇంకో పోరాటం, జానపద కాస్ట్యూమ్స్ లో హీరోయిన్నేసుకుని ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్… ఖతం! గుంటూరు జిల్లా తిరునాళ్ళలో వేసే రికార్డింగ్ డాన్సుల బాషా నాటకాలు కూడా ఇలాగే వుంటాయని గమనించారో లేదో మేకర్లు.

ఈ టెంప్లెట్ ని పూరీ జగన్నాథ్ వాడి వాడి భావి మేకర్లకి మార్గదర్శకుడయ్యాడు. అయితే గుణ సెకండాఫ్ లో ఈ టెంప్లెట్ కాస్త మారింది. ఎందుకంటే హీరోయిన్ ప్రేమపురాణం సెకండాఫ్ లో కూడా కొనసాగింది. ఫస్టాఫ్ గొడవలతో హీరో నీతి మీద, సెకండాఫ్ హీరోయిన్ ట్రాజడీ మీద నడిచింది. ఈ రెండూ విజాతి ధృవాలు కదా అంటే, స్ట్రక్చర్ పాటిస్తే కదా ఏక ధృవ సదృశంగా దృశ్యమానమయ్యేది.

నిజానికి హీరోయిన్ కి హాని చేస్తే రాధ అనుచరులు చెయ్యాలి. తమ రాధాని హీరో చంపాడని అనుకుంటున్నారు కాబట్టి. కానీ హీరోని రాధ హత్య లో ఇరికించిన రేపిస్టుల గ్యాంగే హీరోయిన్ మీద అఘాయిత్యం తలపెడతారు. హీరో మీద అంత పగ దేనికో తెలీదు. అర్ధం పర్ధంలేదు. సెటప్ లేని పే ఆఫ్స్. హత్య కేసులో రిమాండ్ ఖైదీ గా వున్న గుణ అంతలోనే ఎలా విడుదలయ్యాడో తెలీదు. ఒక వైపు గ్యాంగ్ ని పోలీసులు గాలిస్తూంటే ఇతణ్ణి బెయిలు మీద విడిచి పెట్టేశారా? రిమాండ్ ఖైదీ జైల్లో కార్మిక పనులు చేయడమేమిటి. మాస్ ప్రేక్షకులంటే అజ్ఞానులని అడ్డగోలుగా చూపెట్టేయడమేనా? జైలు గదిలో హీరో పక్కన భగవద్గీత వుండడమేమిటి? హీరో దాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు, అందులో కర్మ యోగం చదువుకుని అసలీ కథలో తానేం చేయాలో తెలుసుకోక, లవర్ గీతని తల్చుకుని డ్రీమ్ సాంగేసుకోవడమేమిటి?

హీరోయిన్ వేరే పెళ్లి చేస్తూంటే ఆత్మహత్య చేసుకుందని నమ్మేయడమేమిటి? గ్యాంగ్ రేప్ కి గురైందని పోస్ట్ మార్టంలో బయటపడదా? ఇలా ఎలా పడితే అలా రాసుకున్న కథతో, టైటిల్ కి సరైన జస్టిఫికేషన్ కూడా లేకుండా – కార్తికేయ పాత్రకి గానీ కథకి గానీ ఎక్కడా యూత్ అప్పీల్ అనేదే లేకుండా – ఒక నీతితో ప్రారంభించి, ఇంకేదో ఛానెళ్ళ మోతతో ముగించి మెసేజి కూడా ఇచ్చారు.

―సికిందర్