‘ఎవరు’ – ట్రైలర్ రివ్యూ!

‘ఎవరు’ –ట్రైలర్ రివ్యూ!

అడివి శేష్ ‘ఎవరు’ ట్రైలర్ మర్డర్ మిస్టరీని తెరమీదికి తెస్తోంది. స్పానిష్ లో 2016 లో ఓరియో పులో తీసిన ‘కాంట్రింపో’, ఇటాలియన్ లో ‘టెస్టిమోన్ ఇన్విజిబుల్’ గా రీమేక్ అయింది. తిరిగి 2019 లో హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీలతో ‘బద్లా’ (ప్రతీకారం) గా రీమేకయింది. దీనికి ‘కహానీ’ ఫేమ్ సుజోయ్ ఘోష్ దర్శకుడు. ఒరిజినల్ తో బాటు ఈ రెండు రీమేక్స్ హిట్టయ్యాయి. ఇప్పుడు మూడో రీమేక్ గా వస్తున్న ‘ఎవరు’ ట్రైలర్ పై ఒరిజినల్ కి , రీమేక్స్ కి భిన్నంగా పాత్రల మార్పుతో కన్పిస్తోంది.

ఒరిజినల్లో, ఇటాలియన్ లో, హత్యకేసులో నిందితుడైన బిజినెస్ మాన్ మేల్ క్యారక్టర్ , అతడి లాయర్ గా ఫిమేల్ క్యారక్టర్ వుంటాయి. హిందీ రీమేక్ లో రోల్ రివర్సల్ చేశారు. అమితాబ్ ని లాయర్ గా, తాప్సీని నిందితురాలిగా చూపించారు. తెలుగులో లాయర్ పాత్రని అడివి శేష్ సబిన్స్ పెక్టర్ పాత్రగా మార్చి, నిందితురాలిగా రెజీనాని చూపిస్తున్నారు.

రేజీనా హత్య కేసులో నిందితురాలు. శేష్ అవినీతిపరుడైన ఎస్సై. ప్రతీ కథ వెనుక ఓ రహస్యముంటుందని థీమ్. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం కోసమే శేష్ జరిపే దర్యాప్తు. అక్కడక్కడ కట్ చేసిన బిట్ డైలాగ్స్ తో ట్రైలర్ లో సస్పెన్స్ ని బిల్డప్ చేశారు. ముందు రేజీనా మీద రేప్ ప్రయత్నం, ఆమె రివాల్వర్ తో షూట్ చేయడం, ఆ రేపిస్టు ఎవరో చూపించకపోవడం. కట్ చేసి – కరప్ట్ ఎస్సైగా శేష్ ఎంట్రీ. అతడి దర్యాప్తు….అసలేం జరిగింది? – నేను తనని మంచి ఫ్రెండ్ అనుకున్నాను – మీమీద మర్డర్ కేసుంది, మీరేమో రేపంటున్నారు – ఇన్వర్మేషన్ ఇవ్వడానికొచ్చావా, ఇంటరాగేషన్ చేయడానికి వచ్చావా – త్రీ డేస్ అయింది సార్ మా ఫాదర్ కన్పించడం లేదు – ఈ మిస్సింగ్ కేసేంటి…వంటి సస్పెన్స్ ని రేకెత్తించే కట్ డైలాగ్స్ తర్వాత, మిస్టరీ వీడిపోయేందుకు యాక్షన్ మొదలవుతుంది….

అడివి శేష్ సీరియస్ ప్రొఫెషనల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం కన్పిస్తోంది. రెజీనా ముందు భయస్థురాలిగా, తర్వాత తెలివైన గర్ల్ గా షేడ్స్ బయటపెడుతోంది. సౌండ్ ట్రాక్, కెమెరా వర్క్, లొకేషన్స్ రక్తి కట్టిస్తున్న డ్రామాని బలంగా ఎలివేట్ చేస్తున్నాయి.

ఈ సస్పెన్స్ – మర్డర్ మిస్టరీ లో ఒరిజినల్లో, ఇతర రీమేకుల్లో వున్న లాయర్ పాత్రని ఎస్సైగా మార్చి కథని ఎలా మేనేజ్ చేశారో సినిమా విడులయ్యాకే తెలుస్తుంది. లాయర్ పాత్రకి చాలా లాజిక్స్, లిబర్టీ కుదిరినట్టు ఎస్సై పాత్రతో కుదిరిందో లేదో చూడాలి. లాయర్ పాత్ర చివర్లో అదిరిపోయే ‘కహానీ’ టైపు ట్విస్టు ఇచ్చే షాకింగ్ పాత్ర. ఈ ట్విస్టుని పోలీసు ఉద్యోగంలో పాత్రతో ఎలా నిర్వహించారో కూడా చూడాలి.

హిందీ రిమేక్ లో రోల్ రివర్సల్ చేసినప్పుడు ఒక మైనస్ కొట్టొచ్చినట్టూ కన్పిస్తుంది. బిగ్ బీ అమితాబ్ వంటి స్టార్ ని లాయర్ గా చూపిస్తూ, నునులేత తాప్సీ మీద ప్రయోగించడంతో అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్పించుకుంది. ఒరిజినల్లో ఈ సమస్య లేదు. అందులో లాయరే ఫిమేల్ క్యారక్టర్ కావడంతో మేల్ క్యారక్టర్ మీద ప్రయోగించడం ఆసక్తి రేపుతుంది. అమితాబ్, తాప్సీ లు గతంలో నటించిన ‘పింక్’ అనే సూపర్ హిట్ లో, అమితాబ్ లాయర్ గా వుండి, తాప్సీ ని కాపాడతాడు. ‘బద్లా’ లో తాప్సీ యే లాయర్ గా వుండి అమితాబ్ అంతు చూస్తూంటే ఎంటర్ టైన్మెంట్ వేల్యూ ఎక్కడికో వెళ్ళిపోయేది…

అడివి శేష్ ఎస్సై పాత్రకీ, ఓ లాయర్ ఎస్సై పాత్రకీ ఇన్వెస్టిగేషన్ కథనం వేర్వేరుగా వుంటాయి. ఎస్సైకి వుండే డిపార్ట్ మెంటల్ యాక్సెస్ లాయర్ కి వుండదు. దీంతో కథ, దృశ్యాలు ఎంతో మారిపోయే అవకాశముంది. ఇలా కథాపరంగానే గాక, పాత్ర మార్పు కూడా సినిమాపై ఆసక్తి కల్గించేలా వుంది.

అడివిశేష్‌, రెజీనా కాసాండ్రా లతో బాటు న‌వీన్ చంద్ర నటించాడు. సంగీతం శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఛాయాగ్రహణం వంసశీ ప‌చ్చిపులుసు, మాటలు అబ్బూరి ర‌వి నిర్మాత‌లు పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, ద‌ర్శ‌క‌త్వం వెంక‌ట్ రామ్‌జీ, విడుదల ఆగస్టు 15.

EVARU Theatrical Trailer | Adivi Sesh | Regina Cassandra | Naveen Chandra | Venkat Ramji |PVP Cinema