చియాన్ చించేయ లేదు – ‘మిస్టర్ కేకే’ రివ్యూ!

చియాన్ చించేయలేదు – ‘మిస్టర్ కేకే’ రివ్యూ!

వరస ఫ్లాపులతో సతమత మవుతున్న చియాన్ విక్రం, కమల్ హాసన్ నిర్మాతగా ఓ సినిమా చేసి చూద్దామని ‘మిస్టర్ కేకే’ గా వచ్చాడు. కమర్షియల్ స్టార్ గా ఎంటర్ టైన్ చేయని ఒక పూర్తి నిడివి సీరియస్ యాక్షన్ కి దిగి, ఫ్యాన్స్ కి వేరైటీ నందిద్దామని సంకల్పించాడు. నెగెటివ్ పాత్రతో యాంటీ హీరోగా హీరోయిజాన్ని ఒప్పించేందుకు చేసిన ఈ ప్రయత్నం, దర్శకుడు రమేష్ సెల్వ తోడవడంతో మంచి ప్రయత్నమే కావచ్చన్న అభిప్రాయానికి తావిచ్చింది. ట్రైలర్స్ కూడా పాపులరయ్యాయి. ఇంకేమిటి? కమల్ బ్రాండ్ నేమే వుండగా, బోనస్ గా ఇన్నిహంగులు సమకూరితే విక్రం ఇక హిట్టవాలి. అయ్యాడా? ఇది చూద్దాం…

కథ
మలేషియా లోని కౌలాలంపూర్ లో వాసు (అభి హాసన్) ఒక జ్యూనియర్ డాక్టర్. అతడి భార్య ఆథిరా (అక్షరా హాసన్) గర్భవతి. కేకే (విక్రం) ఒక కరుడుగట్టిన క్రిమినల్. ప్రత్యర్ధులు అతడ్నివెంటాడుతూంటే గాయపడి హాస్పిటల్లో చేరతాడు. అతడ్ని వాసు ట్రీట్ చేస్తూంటాడు. పోలీసులు కేకే ని ప్రశ్నించడానికి వచ్చేస్తారు. కేకే ఒక బిగ్ షాట్ హత్యకేసులో నిందితుడు. ఇంతలో కేకే ప్రత్యర్థులు వాసు భార్యని కిడ్నాప్ చేసి, కేకే ని హాస్పిటల్ బయటికి తెచ్చి తమకి అప్పగించాలని డిమాండ్ చేస్తారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో రెండు గ్రూపులుంటాయి. విన్సెంట్ (వికాస్) గ్రూపుని మఫియా గ్రూపు కంట్రోల్ చేస్తూంటుంది. కల్పనా (లీనా) గ్రూపు విన్సెంట్ కి అడ్డుపడుతూంటుంది. ఇప్పుడు ప్రత్యర్ధుల బెదిరింపులకి వాసు లొంగి, కేకేని హాస్పిటల్ బయటికి తేవడంతో, కేకేని చంపడానికి రెండు పోలీసు గ్రూపులూ వెంటబడతాయి. కేకే, వాసూలు వీళ్ళ నుంచి తప్పించుకుని క్షేమంగా ఎలా బయటపడి, ఆథిరాని విడిపించుకున్నారన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ
దీన్ని కమల్ హాసన్ సినిమాగా ఎందుకు నిర్మించారో, విక్రం ఎందుకు నటించారో వాళ్ళకే తెలియాలి. ఇదే దర్శకుడు రమేష్ సెల్వ మాత్రం 2015 లో కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్ లతో ‘చీకటి రాజ్యం’ (తూంగ వనం) అనే విజయవంతమైన థ్రిల్లర్ తీశాడు. ఒక రాత్రంతా జరిగే మాఫియా కిడ్నాప్ కథతో వచ్చిన ఫ్రెంచి మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ కి కొంచెం అటూ ఇటూ కాపీ చేశారు. అయితే స్క్రిప్టు కమల్ హాసనే రాసి ఈ థ్రిల్లర్ ని నిలబెట్టారని చెప్పొచ్చు. ఇప్పుడు ‘మిస్టర్ కేకే’ (కదరం కొండన్) ని దర్శకుడు ఇంకో ఫ్రెంచి మూవీ ‘పాయింట్ బ్లాంక్’ నుంచి దింపేశాడు. ఈ దింపడంలో ఈ సారి కమల్ కలం బలం లేకపోవడంతో దుంప తెంచాడు. ఫస్టాఫ్ అంతా హాస్పిటల్లోంచి ఎలా పారిపోవాలి, సెకండాఫ్ అంతా హస్పిటల్లోంచి పారిపోయాక ఎలా పారిపోవాలి….పారిపోవడాలే కథ! ఛేజింగ్ సీన్లే సినిమా! మూవీ మేకర్లు ఇందులోంచి నేర్చుకోవాల్సిందేమిటంటే, ఇలా తీస్తే చక్కగా రెండు క్లయిమాక్సులు చూస్తున్నట్టు వుంటుందని – ఫస్టాఫ్ అంతా ఒక క్లయిమాక్స్, సెకండాఫ్ అంతా ఇంకో క్లయిమాక్స్!

ఎవరెలా చేశారు
విక్రం ఫస్టాఫ్ అంతా హాస్పిటల్ బెడ్ మీదే వుంటే ప్రేక్షకులెలా భరిస్తారనుకున్నారో తెలీదు. కరుగు గట్టిన క్రిమినల్ గా నెరసిన గడ్డంతో లుక్ అంతా బాగానే వుంది. ఐతే సెకండాఫ్ లో యాక్షన్ లో కొచ్చాక ఫైరింగ్స్, ఛేజింగ్స్ తప్ప ఫైట్స్ లేకపోవడంతో యాక్షన్ పాత్రగా అసంతృప్తి మిగులుస్తాడు. పైగా కథ లేకపోవడంతో, పాత్ర గురించి వివరాలు లేకపోవడంతో, 2005 లో రాం గోపాల్ వర్మ నిర్మించిన ‘జేమ్స్’ లో హీరోలాగా కార్డ్ బోర్డ్ క్యారక్టర్ లాగా తయారయ్యింది విక్రం పాత్ర. పాత్రకి ఎమోషన్స్ లేవు, మనోభావాలేమిటో తెలీవు, ముఖభావాలు కూడా కనెక్ట్ కావు. ఆడియెన్స్ తో ఏ కనెక్టివిటీ లేకుండా యాంత్రికంగా యాక్షన్ చేసుకుపోవడమే.

అభి హాసన్ క్యారక్టర్ కి ఎమోషన్స్ వున్నాయి, టెన్షన్ వుంది, సస్పెన్స్ వుంది. పాత్ర సజీవంగా వుంది. నటించడానికి స్కోపు వుంది. ఎందుకంటే గర్భవతైన భార్య కిడ్నాపయ్యింది. కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ తో విక్రంని డామినేట్ చేశాడు. అయితే అభి పాత్ర, నటన బావున్నా ఇవి మాత్రమే కథలేని సినిమాని నిలబెట్టలేవు. సినిమాని నిలబెట్టాల్సింది అసలు హీరోగా విక్రం.
ఇక కమల్ కుమార్తె అక్షరా హాసన్ నిండు గర్భవతిగా బందీగా గడపడమే సినిమా అంతా. పోలీసు పాత్రల్లో లీనా, వికాస్ లు బాగా చేశారు. ఇక మిగిలిన పాత్రలు సహాయ పాత్రలు.

టెక్నికల్ గా బాగా తీశాడు సెల్వ. యాక్షన్ సీన్స్ ఎంత సేపూ ఛేజింగులే కావడంతో మొనాటనీ మేట వేస్తుంది. జిబ్రాన్ సంగీతం విషయం లేని సీన్స్ కూడా ఏదో విషయం వున్నట్టు భ్రమ కల్గించేలా వుంది. ఆర్. శ్రీనివాస్ కెమెరా వర్క్ మాఫియా మూడ్ ని సృష్టించింది. మూవీ మొత్తం మలేషియా లోని కౌలాలంపూర్ లో తీసినా అక్కడి అందమైన లొకేషన్స్ జోలికి పోలేదు. పోయివుంటే ఈ మూవీ మాఫియా లుక్ కి హాని కల్గేది.

చివరికేమిటి
విక్రంకి ఇంకో నిరాశ. కమల్ హాసన్ నటించాల్సి వుంటే ఆయన ఎన్నికల హడావిడీలో వుండి విక్రంతో నిర్మించడానికి సిద్ధపడ్డారు. విక్రం ఈ పాత్రని, కథనీ బాగా నమ్మినట్టుంది. కమల్ హాసన్ నటించాల్సిన పాత్ర కాబట్టి కళ్ళు మూసుకుని ఒప్పేసుకున్నట్టుంది. ఫస్టాఫ్ లో హాస్పిటల్లోనే పడుకుని వున్నా అది కూడా వెరైటీగా రైటే అనుకున్నట్టుంది. ఎవరైనా కమర్షియల్ సినిమాలో హాస్పిటల్లో పడుకుని వుంటారా? అందులోనూ స్టార్? తెలుగు తమిళంలలో ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న చియాన్ విక్రం?

ఫస్టాఫ్ లో గర్భవతి కిడ్నాప్, బెదిరింపు తప్ప, అసలు విక్రం పాత్రని ఎవరు చంపాలనుకుంటున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు తెలియజేసే పాపాన పోడు దర్శకుడు. ఇంటర్వెల్ కి కూడా కథేమిటో చెప్పడు. సెకండాఫ్ ప్రారంభమయ్యాక విక్రం పాత్ర బ్యాడ్ పోలీసుని అడిగితే తప్ప, తనని ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారో విక్రం పాత్రకి కూడా తెలీదు. పూర్తిగా ఇది కథతో పాత్రతో మిస్ మేనేజి మెంట్. దీని పర్యవసానం తీవ్రమైన సహన పరీక్ష. సీజన్ వన్, సీజన్ టూ అనే రెండు క్లయిమాక్సులు చూపించి, ఇదే సినిమా అనుకోమంటూ దర్శకుడు చేతులు జోడించాడు.

రచన – దర్శకత్వం : రమేష్ సెల్వ
తారాగణం : విక్రం, అభి హాసన్, అక్షరా హాసన్, లీనా, వికాస్ తదితరులు
సంగీతం : జిబ్రాన్, ఛాయాగ్రహణం : శ్రీనివాస్ ఆర్.
బ్యానర్ : రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్
నిర్మాత : కమల్ హాసన్
విడుదల : జులై 19,2019
2 / 5

-సికిందర్