క్లీన్ అండ్ గ్రీన్ డ్రామెడీ ! ‘చి. ల. సౌ’ మూవీ రివ్యూ

(సికిందర్)

‘చి. ల. సౌ’
రచన – ద‌ర్శ‌క‌త్వం : రాహుల్ ర‌వీంద్ర‌న్‌
తారాగ‌ణం: సుశాంత్‌, రుహానీ శ‌ర్మ‌, వెన్నెల‌ కిశోర్‌, రోహిణి, అనూ హాస‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు
సంగీతం : ప్రశాంత్ విహారి, ఛాయాగ్ర‌హ‌ణం: ఎం.సుకుమార్‌
బ్యానర్స్ : అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ కార్పొరేష‌న్‌
నిర్మాత‌లు : నాగార్జున అక్కినేని, జస్వంత్, భరత్ కుమార్, హరి

విడుదల : ఆగస్టు 3, 2018

తెలుగు రాజ్యం రేటింగ్  3 / 5

‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’ రోమాంటిక్ కామెడీల హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడయ్యాడు. హిట్సు లేని హీరో సుశాంత్ తో రోమాంటిక్ డ్రామెడీ తీశాడు. ప్రేమ సినిమాలంటే హీరో హీరోయిన్లు అపార్ధాలతో విడిపోవడమో, ప్రేమలో ఎస్ చెప్పడానికి నాన్చడమో చేసే రెండే రెండు టెంప్లెట్స్ తో పదేపదే నిస్సిగ్గుగా వచ్చిపడుతున్న భావదారిద్ర్యపు మాయదారి కాలంలో, రవీంద్రన్ ఒక తాజాదనాన్ని మోసుకొచ్చాడు. ఈ తజాదనంలో అతడి తాలూకు తమిళతనం ఎక్కడాలేదు. తెలుగులో అత్యంత అరుదై పోయిన, కాస్త నిజ జీవితాలు ఉట్టిపడే రియలిస్టిక్ ప్రేమ సినిమాల కొరత తీరుస్తూ, కథ ఏమీ లేకుండానే కథంతా కూర్చోబెట్టి చెప్పాడు.

ఒకప్పుడు కరీనాకపూర్ – రాహుల్ బోస్ లు నటించిన ‘చమేలీ’ చూశాం. అది ఒక బస్టాపులో తెల్లారే దాకా సాగే కథ. రాత్రంతా ఇద్దరి మధ్యా జీవితంలో జరగడానికి సాధ్యమయ్యే రకరకాల సంఘటనలు జరుగుతూంటాయి. అలాగే ప్రస్తుత డ్రామెడీలో కూడా హీరో సుశాంత్ – హీరోయిన్ రుహనీ శర్మల మధ్య ఖట్టా మీఠా (తీపి పులుపు) సంఘటనలు అనేకం జరుగుతాయి. కలిసింది పెళ్లి చూపులకోసం, కలవాల్సింది మనసులు. మన వాడికి 27 ఏళ్ళొచ్చాయి. ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు. మంచి సాఫ్ట్ వేర్ జాబ్ వెలగబెడుతున్న తను, కనీసం ఇంకో ఐదేళ్ళు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయాలనీ, ఇరవై లక్షల కారు కొనుక్కుని, యూరప్ టూరు చుట్టి రావాలనీ, అప్పుడే పెళ్లి చేసుకుని సెటిలవ్వాలనీ వుంటుంది. దీనికి తల్లిదండ్రులు (అనూ హాసన్, సంజయ్ స్వరూప్) వ్యతిరేకం. ఎన్ని సార్లు పెళ్లిచూపులకి ప్రయత్నించినా తిప్పి కొడుతూంటాడు. ఐదు నిమిషాలు ఒకర్నొకరు చూసుకుని ఎలా నిర్ణయం తీసుకుంటామని కొడుకు అర్జున్ వాదన. ఇలాకాదని తల్లి ఒకరోజు ప్లానేసి, భర్తతో ఇంట్లో వుండకుండా, చూసిన అమ్మాయిని ఇంటికి రప్పించి – ఏకాంతంగా కావాల్సినంత మాట్లాడుకొమ్మని పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది. వచ్చినమ్మాయి అంజలికి నో చెప్పేస్తాడు. ఆమె హర్టవుతుంది. ఆమె తల్లితో ఒక గడ్డు పరిస్థితిలో వుంటుంది. తల్లి గురించే ఎన్ని సంబంధాలు తప్పిపోయయో చెప్పుకొస్తుంది. ఇప్పుడు అర్జున్ కూడా కాదంటే, ఈ విషయం తల్లికెలా చెప్పాలా అని సందిగ్ధంలో పడుతుంది. అర్జున్ కిది సమస్యే కాదు. కానీ ఆమెకి చాలా పెద్ద సమస్య. ఇంటికెళ్ల లేని పరిస్థితి.

ఉండీ లేనట్టుండే కథ. కథనమే ఈ రెండు గంటల విషయాన్ని కదలకుండా కూర్చోబెడుతుంది. రాత్రంతా ఇంటా బయటా, హాస్పిటల్లో, పోలీస్ స్టేషన్లో జరిగే విచిత్ర సంఘటనలు వచ్చిపోతూంటాయి. ఈ సంఘటనలతో వాళ్లేమిటో పరస్పరం బయటపడుతూంటుంది. ‘చమేలీ’ లో ఓ దొంగోడితో ఏటీఎంలో క్రైం ఎలిమెంట్ వున్నట్టే, ఇక్కడ హీరో హీరోయిన్లూ ఒక ‘మర్డర్’ లో ఇరుక్కుని లో పోలీస్ స్టేషన్లో పడతారు. ఆ ఎస్సై (రాహుల్ రామకృష్ణ) తో అదంతా వొక ఫన్నీ సీన్.

పెళ్లి సంబంధాలతో హీరోయిన్ ఫ్లాష్ బ్యాకే కాకుండా, ఆమె చిన్నప్పటి జీవితం కథకి బలమైన అంశాలు. అయితే ఆమె మేనమామ పాత్ర అతికేలా వుండదు. చిన్నపుడే తండ్రి చనిపోవడంతో తల్లి (రోహిణి)ని, చెల్లెల్ని (విద్యుల్లేఖా రామన్), ఓ బామ్మనీ పోషించుకునే బాధ్యత పదమూడేళ్ళ హీరోయిన్ మీద పడ్డప్పుడు, ఏకైక మగదిక్కు మేనమామ (జయప్రకాష్) తను నిస్సహాయుణ్ణని వెళ్ళిపోవడం సహజంగా వుండదు. తర్వాత జీవితం లో పైకొచ్చి, వాళ్ళని తీసికెళ్ళి ఉద్ధరిస్తానంటాడు. దీనికి హీరోయిన్ ఒప్పుకోదు. అయినా అతను ఆర్ధికంగా తోడ్పడ వచ్చు. అదికూడా చెయ్యడు. వూరికే వచ్చిపోతూ పెద్ద పెద్ద మాటలు చెప్తూంటాడు. అంతా అతను చేస్తే హీరోయిన్ పాత్రే వుండదనేది నిజమే. అలాంటపుడు అతడి పాత్రే లేకుండా వుంటే బావుండేది.

హీరోయిన్ పాత్ర మానసిక లోకాన్ని, దాని ఒడిదుడుకుల్ని అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించాడు దర్శకుడు. ఈ పాత్రని రుహానీ శర్మ అపూర్వంగా, హత్తుకునేలా పోషించింది. చాలా సంకీర్ణ పాత్ర ఇది. చాలా కాలానికి ఒక సజీవ హీరోయిన్ పాత్రని తెరపై చూస్తాం. అభిజాత్యానికీ అవసరానికీ మధ్య నలిగిపోయే వాస్తవిక పాత్ర.
కొత్త సుశాంత్ ని చూస్తామిక్కడ. ఏ హీరో వేషాలూ వెయ్యని సహజ పాత్ర ఇది కూడా. ఇందులో తను కన్పించడు. పాత్రే కన్పిస్తుంది. ఇంత సహజ నటుడెప్పుయ్యాడని ఆశ్చర్యపోవాల్సిందే. అంతా దర్శకుడి విజన్ తోనే వుంటుంది. మనకి లొట్టపీసు రోమాంటిక్ కామెడీల దర్శకులున్నంత కాలం ఆర్టిస్టులు ఎదగరు.

అలాగే వెన్నెల కిషోర్ మంచి బలమైన కామెడీ చేశాడు. మెట్ల మీద చేసే కామెడీకి నవ్వాలంటే కడుపులో పేగులు మెలిక పడి పోతాయి. అలాగే ఎదురింటావిడతో చేసే ఆరెంజి జ్యూస్ కామెడీ.

‘కిల్ బిల్’ లో అయిదారు సీన్లే ఇంటర్వెల్ వరకూ నడిచినట్టు, లేదా ‘ఒక్కడు’ లో ఇరవై సీన్లు మాత్రమే ఇంటర్వెల్ కల్లా సరిపోయినట్టూ, ఇక్కడా పెళ్లి చూపులకి ఇద్దరూ ఇంట్లో కలిసింది లగాయత్తూ, ఆ సీనే ఇంటర్వెల్ దాకాసాగుతుంది. చాలా తక్కువ కథ, తక్కువ సీన్లు, ఎక్కువ కథనం, ఎక్కువ విషయం. డిటో సెకండాఫ్. ఆఫ్ కోర్స్, ఇది ఒకరాత్రి జరిగే కథ కాబట్టి ఇలా సాధ్యమైంది.

దర్శకుడు రవీంద్రన్ ఈ తొలి ప్రయత్నం అనుభవమున్న దర్శకుడిలా చేశాడు. సంగీ తం, ఛాయాగ్రహణం వంటి హంగుల్ని అర్ధవంతంగా ఉపయోగించుకున్నాడు. కథ నడక నిదానంగా వుంటుంది. ఇలా వుండక పోతే నిలబడదు. స్పీడ్ నడకతో సినిమాలు కేవలం హడావిడిగా, మెదడుతో చూసేట్టు చేసినట్టు, ఇది నిదానంగా సాగుతూ, ప్రశాంతంగా మనసుతో చూసేట్టు చేస్తుంది.