ఇదేం ముగింపో! ‘ఐరా’  (మూవీ రివ్యూ)

‘ఐరా’ 
రచన, దర్శకత్వం : కెఎం సర్జున్ 
తారాగణం : నయనతార,  కళయరాసన్, యోగిబాబు, జయప్రకాష్, మీరా కృష్ణన్ తదితరులు 
సంగీతం : కెఎస్ సుందరమూర్తి, ఛాయాగ్రహణం : సుదర్శన్ శ్రీనివాసన్ 
బ్యానర్ : గంగా ఎంటర్ టైన్మెంట్స్, కేజీఆర్ స్టూడియోస్ 
 విడుదల : మార్చి 28, 2019

2. 25 / 5

***

 నయనతార సింగిల్ గా చేస్తున్న సినిమాల సిరీస్ లో ఇంకో హర్రర్ చేరింది. గత అంజలి సిబిఐ తర్వాత ఇప్పుడు ఐరా అనే హార్రర్ లో ద్విపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకుల ముందు కొచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు సర్జున్ తన రెండో సినిమాగా దీనికి దర్శకత్వం వహించాడు. ఈ మధ్య హార్రర్ సినిమాలు ఎక్కువైపోవడంతో భయాన్ని జయించిన ప్రేక్షకులు భయపడడం మానేశారు. దీంతో ఇప్పుడు హార్రర్  సినిమాలు తీయడంలో అర్ధమేలేకుండా పోయింది. ఐనా ఇంకేదో చేద్దామని నయనతార నటించింది. ఏం చేసింది నయనతార? ద్విపాత్రాభినయంతో ఏం చేసి ఈ హార్ర్రర్ ని హాస్యాస్పదంగా మార్చింది?…ఇది తెలుసుకుందాం. 

కథ 
         

ఓ పత్రికలో పని చేసే యమున (నయనతార) యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిద్దామని ఎడిటర్ తో అంటుంది. ఎడిటర్ ఒప్పుకోక పోవడంతో తనే అక్కయ్య పాలెం వెళ్ళిపోయి యూట్యూబ్ ఛానెల్ పెడుతుంది. ఇది ఆమె నాయనమ్మ వూరు. పెద్ద ఇల్లు. ఇక్కడ ఫేక్ హార్రర్ వీడియోలు తీస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూంటుంది. వీటికి విశేషమైన వ్యూస్ వస్తూ తను ట్రెండింగ్  అయ్యేంత పాపులర్ అవుతుంది. ఇంతలో తను తీస్తున్న ఫేక్ హార్రర్ కాస్తా రియల్ హార్రర్ గా మారిపోతుంది. ఓ ఆత్మ తననే చంపడానికి వెంతబడుతుంది. 
         

ఇంకోవైపు అభినయ్ (కళయరాసన్)  అనే అతను కొన్ని విచిత్ర మరణాలు చూస్తూంటాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేని ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో అతి కష్టం మీద అర్ధం జేసుకుంటాడు. ఈ హత్యలు భవానీ ఆత్మే చేస్తోందని తెలుసుకుని ఆమెని ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.

ఎవరీ భవానీ? ఎందుకు చంపుతోంది? అభినయ్ ఎవరు? దీంతో యమున కేం సంబంధం? యమునా తనని ఎలా కాపాడుకుంది?…ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ 

అసలు కథ ఫ్లాష్ బ్యాక్ లో భవానీ పాత్రతో వుంటుంది. మూఢ నమ్మకాలు  ఆడపిల్లల జీవితాల్ని ఎలా నరకప్రాయం చేస్తాయో తెలిపే కథ. హార్రర్ సినిమాల టెంప్లెట్ లోనే వుంటుంది. ఓ అమ్మాయికేదో అన్యాయం జరగడం, ఆమె ఆత్మగా మారి పగదీర్చుకోవడం. ఇందులో కొత్తదనమేమీ లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పుట్టిన క్షణం నుంచీ భవానీ అనుభవించే కష్టాలతో కథ బలంగా వుంటుంది. అయితే దురదృష్ట జాతకురాలని చెప్పి బంధువులు హింసించడం వరకూ ఒక కథ. దీనికి విధి కూడా తోడై ఆమె ఎవరో తెలియని కొందరు అపరిచయస్థులకి ప్రమేయం కల్పించి ఆమెని బలిగొనే కథ పూర్తిగా వేరు. ఈ రెండూ అతికేవి కావు. చెబితే బంధువుల మూఢనమ్మకాల గురించిన కథ చెప్పకుండా, దానికి విధిని జోడించి ఆమెని బలిగొనడంతో, మూఢ నమ్మకాలతో బంధువులు పాల్పడిన హింసని విధి (దేవుడు) కూడా ఓకే చేసిందన్న అర్ధం వచ్చింది. విధి తాలూకు జరిగే సంఘటనలకి సీతాకోక చిలుకని చూపిస్తూ బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటూ చెప్పారు. అసలు విధి పాత్రే సరైంది కానప్పుడు బటర్ ఫ్లై బిల్డప్ అర్ధం లేనిది. ఇక భవానీ ఆత్మ, బతికున్న యమునలతో క్లయిమాక్స్ చాలా హాస్యాస్పదంగా వుంది. ఇంత దారుణంగా నవ్వొచ్చే ముగింపుతో హార్రర్ సినిమాలు వచ్చి వుండవు. 

ఎవరెలా చేశారు 
         

బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ బ్యాక్ లో కారునలుపు అందవిహీన భవానీ పాత్రలో నయనతార సూపర్. ‘ఊర్వశి’ లో శారద పోషించిన కారునలుపు హీరోయిన్ పాత్రని గుర్తుకు తెస్తుంది. ఈ విషాద పాత్రలో నయనతార తన స్టార్ స్టేటస్ ని మర్చిపోయి, ఆర్ట్ సినిమా వాస్తవికతకి పూనుకుని నడుం బిగించి న్యాయం చేసింది. ఈ పాత్రని తీర్చిదిద్దడంలో దర్శకుడుకి కూడా – స్క్రీన్ ప్లే రచయిత్రి ప్రియాంకా రవీంద్రన్ కూడా – ప్రతిభ కనబర్చడంతో నయనతార నటన శక్తివంతంగా మారింది. ఇదే ఆమె ఆత్మగా మారాకా పాత్ర తేలిపోయింది. యమున పాత్రలో గ్లామరస్ గా కనిపిస్తుంది. కానీ హుషారుగా సరదాగా ఉంవుండాల్సిన సీన్స్ లో అలా వుండలేకపోవడం ఆమెకి మామూలే. నయనతార అంటే రిజర్ద్వుడుగా కన్పిస్తుందనే పేరుంది.

కళయరాసన్ ఫస్టాఫ్ లో పూర్తిగా సస్పెన్స్ తో కూడిన సబ్ ప్లాట్ లో కనిపిస్తాడు. ఇతడి గురించి సెకండాఫ్ లో రివీలవుతుంది. క్లయిమాక్స్ ని ఇతను కూడా నవ్వులాటగా మార్చేస్తాడు. సినిమాకి సాంకేతిక విలువలు బావున్నాయి, సంగీతం ఓకే. హార్రర్ దృశ్యాలు వృధా ప్రయాస అన్నట్టే వుంటాయి. హార్రర్ కామెడీలకి  ప్రేక్షకులు నవ్వడం మానేసినట్టే,  హార్రర్ సినిమాలకి భయపడడం మానేశారు. దర్శకుడు ఎన్ని ఎఫెక్ట్స్ వేస్తున్నా భయభక్తులు గాలికొదిలేసి,  నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటున్నారు ప్రేక్షకులు. ఇంకా హార్రర్ లు, హార్రర్ కామెడీలూ తీయడం అవసరమా అని ఎప్పుడు ప్రశ్నించుకుంటారో.

―సికిందర్