సుదీప్ మాస్ యాక్షన్ డ్రామా – ‘పహిల్వాన్’ రివ్యూ!

సుదీప్ మాస్ యాక్షన్ డ్రామా – ‘పహిల్వాన్’ మూవీ రివ్యూ!

ఏకంగా తొమ్మిది భాషల్లో విడుదల చేయాలనుకుని, చివరికి 5 భాషలకి పరిమితమైన కన్నడ బాద్షా కిచ్చ సుదీప్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ‘పహిల్వాన్’ 3000 వేల థియేటర్లలో విడుదలవుతూ, ప్రేక్షకుల ముందుకొచ్చేసింది…గణేష్ నిమజ్జనం రోజునే విడుదల కావడంతో, పైగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలుండడంతో ఓపెనింగ్స్ పలచగా వున్నాయి. సుదీప్ కెరీర్ లోనే 50 కోట్లతో భారీగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకి దర్శకుడు ఎస్. కృష్ణ. ఛాయాగ్రాహకుడుగా 17 సినిమాల అనుభవం, దర్శకుడుగా రెండు సినిమాల అనుభవమున్న ఎస్. కృష్ణ ఈసారి తనే నిర్మాతగా మారి జీఫిలిమ్స్ తో కలిసి నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు. ‘దేవదాసు’, ‘మళ్ళీ రావా’ లతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఆకాంక్షా సింగ్ హీరోయిన్ గా నటించింది. మరి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజైన ‘పహిల్వాన్’ ఎలావుంది? కుస్తీ – బాక్సింగ్ రెండు క్రీడలని మిళితం చేసి దీన్నెలా తీశారు? ఈ రెండు వేరియేషన్స్ లో సుదీప్ ఎంత శ్రమించాడు? వివరాల్లో కెళ్దాం…

కథ
జనకరాజ పురం అనే వూళ్ళో చిన్నప్పుడు తిండి కోసం పోరాటాలు చేసే కృష్ణ (సుదీప్) అనే అనాధని చేరదీస్తాడు సర్కార్ (సునీల్ శెట్టి) అనే కుస్తీ గురువు. వాడికి కుస్తీ విద్యనేర్పి జాతీయ ఛాంపియన్ గా తీర్చిదిద్దాలని కలలు గంటాడు. కానీ పెద్దయ్యాక కృష్ణ, రుక్మిణి (ఆకాంక్షా సింగ్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఇంకోవైపు నగరంలో టోనీ (కబీర్ దుహన్ సింగ్) అనే బాక్సింగ్ కింగ్ ప్రత్యర్ధిని రింగులో చంపేసి సస్పెండ్ అవుతాడు. తనని ప్రశ్నించిన కోచ్ (శరత్ లోహితశ్వ) ని అవమానిస్తాడు. దీంతో టోనీ కి పోటీగా ఇంకొకడ్ని దింపుతానని సవాలు చేస్తాడు కోచ్. మరోవైపు రణస్థలిపురం రాజావారు వర్మ (సుశాంత్ సింగ్) ని కుస్తీ పోటీల్లో ఓడించి, రుక్మిణిని పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. దీంతో సర్కార్ ఆగ్రహించి, అనుకున్న లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుని పెళ్లి చేసుకున్నందుకు కృష్ణని బహిష్కరిస్తాడు. తను నేర్పిన విద్యని ఇంకెక్కడా ఉపయోగించుకోరాదని ఆంక్షలు విధిస్తాడు. దీంతో రుక్మిణిని తీసుకుని వూరు విడిచి వెళ్ళిపోతాడు కృష్ణ.

వెళ్ళిపోయిన కృష్ణ ఎక్కడున్నాడు? ఏం చేసి భార్యని, కూతుర్ని పోషించుకుంటున్నాడు? అతణ్ణి కోచ్ తన అవసరం కోసం ఎలా పట్టుకున్నాడు? మరోవైపు తనని  ఓడించాడన్న కసితో వున్న వర్మ ఏం చేశాడు? అసలు సర్కార్ కిచ్చిన మాట ప్రకారం, కుస్తీకి స్వస్తి చెప్పి సాధారణ జీవితం గడుపుతున్న కృష్ణ వీళ్ళిద్దర్నీ ఎలా ఎదుర్కొన్నాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
రెండు క్రీడల మల్టీ స్టోరీ ఇది. స్పోర్ట్స్ డ్రామాల్లో ఒకే పాత్రతో రెండు క్రీడల కథ అనేది కొత్తే. దీంతో సింగిల్ క్రీడతో రొటీన్ గా వుండే స్పోర్ట్స్ డ్రామాలకి భిన్నంగా ఈ ఐడియా బావుంది. ఈ క్రీడలతో హీరోనే విజేతగా చూపించకుండా, పిల్లల్ని కూడా క్రీడాకారులుగా తీర్చిదిద్దే ఇంకో మోటివే షనల్ కథ కూడా జతచేయడంతో కథాపరంగా బలంగా వుంది. అయితే ఈ కథ ఓల్డ్ డ్రామా ఆధారంగా, సెంటిమెంట్లమయంగా వుందన్నది నిజం. కలలు వుంటాయి, కానీ ఆకలికూడా వుంటుంది. చివరికి ఆకలి కలల్ని తినేస్తుందనే కొటేషన్ ఒకటిచ్చి, తమకి వివిధ క్రీడల్లో టాలెంట్ వున్నా, ముందుకు పోలేక కూలి పనులు చేసుకునే పేద బాల బాలికల కలల్ని నెరవేర్చే తాపత్రయాన్ని కూడా కథానాయకుడికి కల్పించడంతో నిడివి కూడా పెరిగింది. ఈ మూవీని ప్రధానంగా కన్నడ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసి, వాళ్ళ ‘బాద్షా కిచ్చ’ ని ఎలా చూపిస్తే సంతృప్తి పడతారో, ఆ హంగులన్నీ జోడించి వాళ్ళ వరకూ బలమైన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తీశారు.

ఎవరెలా చేశారు
కథా కథనాలు మూసగానే వున్నా, ఒక స్టార్ ని పాత్రచిత్రణతో మాస్ ప్రేక్షకుల్లో ఎలా నిలబెట్టవచ్చన్న టాలెంట్ నంతా ప్రదర్శించాడు దర్శకుడు కృష్ణ. దీంతో సుదీప్ ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైన్ చేసి, సెకండాఫ్ లో బహిష్కృతుడైన పాత్రలో భార్యతో, కూతురితో, బస్తీలో తోటి వాళ్లతో, పగబట్టి వచ్చిన వర్మతో, అవసరం పెట్టుకుని వచ్చిన కోచ్ తో, చివరికి తనని బహిష్కరించిన సర్కార్ తో, తను బాధ పెట్టిన మామతో, ఆఖరికి బాక్సర్ టోనీతో – ఇన్ని మానవ, దానవ సంబంధాలతో పాత్ర నటించడమన్నది మామూలు విషయం కాదు. ఇదంతా కూల్ గా ప్రేక్షకుల్ని కదిలించే విధంగా చేస్తూ పోయాడు. కుస్తీ పోటీల్లో హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. క్లయిమాక్స్ బాక్సింగ్ ఈవెంట్ లో తన స్టార్ డమ్ ని ప్రకాశింపజేశాడు. తన ఫ్యాన్స్ ఎవరూ ఈ సినిమా చూసి అసంతృప్తి చెడె సమస్యే లేకుండా చేశాడు. మాస్ పాటల్లో చేసిన డాన్సులు సహా. పంచ్ డైలాగులు, ఫన్ డైలాగులు లేకపోయినా పాత్రలో మాస్ దమ్ముంది.

ఇక హీరోయిన్ ఆకాంక్షది మరో ఫార్ములా హీరోయిన్ పాత్ర. ఫస్టాఫ్ లో పెళ్లి కానప్పుడు గ్లామర్ కన్నా, సెకండాఫ్ లో పెళ్ళయ్యాకే బావుంది. అయితే ఎక్కడా ఇంటి పనులు చేస్తూ కన్పించదు. నీళ్ళు మోయడం, వంట చేయడం సుదీప్ చేస్తూంటాడు. బస్తీ వాసిగా అతడి కష్టాన్ని హైలైట్ చేయడానికి కాబోలు.

సీనియర్ పాత్రలో సునీల్ శెట్టికి ఒక యాక్షన్ సీన్ కూడా పెట్టారు. పాత్రలో హుందాగా నటించే ప్రయత్నం చేశాడు. కబీర్ దుహన్ సింగ్ మానవలోకంలో దానవుడిగా తన ట్రేడ్ మార్క్ తో వున్నాడు. సుశాంత్ సింగ్ చిన్న దానవుడు. రాజావారి వేషంలో వుంటాడు.

ప్రొడక్షన్ పరంగా బ్రహ్మాండంగా వుంది. ఈ స్పోర్ట్స్ తమదే కాబట్టి యాక్షన్ డైరెక్టర్లు రాం లక్ష్మణ్ లు చెలరేగిపోయారు కుస్తీ పట్ల చిత్రీకరణతో. హాలీవుడ్ నుంచి ఆరన్ అలెగ్జాండర్ క్లయిమాక్స్ బాక్సింగ్ కి తన మెళకువలు ప్రదర్శించాడు. ఐతే ఈ బాక్సింగ్ ని బాగా సాగదీశారు. కెమెరా వర్క్, మ్యూజిక్ కూడా బావున్నాయి.

చివరికేమిటి
సుదీప్ కిది ఐదు భాషల్లో మాస్ లో గుర్తింపు తెచ్చే స్పోర్ట్స్ డ్రామా. కుస్తీలో, బాక్సింగులో రెండిట్లో శిక్షణ పొంది ఒకే సినిమాలో నటించిన స్టార్ తనే బహుశా. ఐతే ఫస్టాఫ్ ఇరవై నిమిషాల్లో నాల్గు సార్లు కుస్తీ లుండడం కొంచెం ఎక్కువే. ఆ తర్వాత ఇంటర్వెల్ వరకు ఇంకో మూడు సార్లు కుస్తీ పోటీలు మరీ ఎక్కువ. ఫస్టాఫ్ ఏడుసార్లు కుస్తీలే. అందుకే కథ ప్రారంభం కాలేకపోయింది. కథ ఇంటర్వెల్ తర్వాత ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ లో కోచ్ సుదీప్ కోసం వచ్చినప్పుడు, అతడని, వూరు విడిచి వెళ్లిపోయాడని చెప్పడంతో మొదలయ్యే  ఫ్లాష్ బ్యాక్, ఇంటర్వెల్లో కూడా పూర్తి కాదు. ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే సర్కార్ బహిష్కరించే ఘట్టంతో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది.

ఇక సుదీప్ వేరే వూళ్ళో బస్తీలో ఉంటున్న దృశ్యాలతో కథ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన ఈ ఐదేళ్ళ టైం గ్యాప్ ని పూర్తి చేస్తూ ఆ జీవితం గురించిన ఫ్లాష్ బ్యాక్. దీనితర్వాతే రాజావారు రావడం, కోచ్ రావడంతో ఆసక్తికర పాయింటుతో కథ ముందుకెళ్తుంది… సర్కార్ నేర్పిన విద్యని ఉపయోగించుకోకూడదన్న నిబంధనతో వున్న తను ఇప్పుడేం చేస్తాడన్న పాయింటు. ఇదెలా పరిష్కారమయ్యిందన్న సమస్య.

ఫస్టాఫ్ ఫ్లాష్ బ్యాక్ తో ఉపోద్ఘాతమే కావడంతో ఇంటర్వెల్లో ప్రేక్షకులు ఏమీ లేక తెల్ల మొహాలేస్తారు. ఆ తర్వాత సెకండాఫ్ అంతా కదలకుండా కూర్చుంటారు. కథ సెకండాఫ్ లోనే వున్నా అది బిగిసడలని కథనంతో వుండడం వల్ల, పైగా పాత్ర రక్తమాంసాలతో సజీవంగా కన్పించడం వల్ల, దాని వెంట సాగిపోతారు ప్రేక్షకులు.

తారాగణం : సుదీప్, ఆకాంక్షా సింగ్, సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్, కబీర్ దుహన్ సింగ్ తదితరులు
సంగీతం : అర్జున్ జన్య, ఛాయాగ్రహణం: కరుణాకర
విడుదల : సెప్టెంబర్ 12, 2019
3 / 5

― సికిందర్