సగం దిమాక్ జోష్ – ‘ఇస్మార్ట్ శంకర్’ రివ్యూ!

సగం దిమాక్ జోష్ – ‘ఇస్మార్ట్ శంకర్’ రివ్యూ!

‘టెంపర్’ ఘనవిజయం తర్వాత పరాజయాల బాటలో నడుస్తూ వస్తున్న మాస్ యాక్షన్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ పునరాగమనం ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రచారార్భాటంతో ఆశాజనకంగానే కనబడింది. దీనికి ప్రధాన కారణం ఎనర్జిటిక్ స్టార్ రామ్ మొదటిసారిగా సిక్స్ ప్యాక్ వూర మాస్ హీరో అప్పీరియెస్స్ వైరల్ కావడమే. రామ్ కి కూడా తను ఎంత ఎనర్జిటిక్ స్టార్ అయినా, 2011 లో ‘కందిరీగ’ తర్వాత ‘నేనూ శైలజ’ తప్ప, నటించిన 8 సినిమాలూ ఎనర్జీ నివ్వలేకపోయాయి. అందుకని పరాజయాల్లో వున్న పూరీ తో చేయికలిపి, విజృంభిస్తూ తెలంగాణా మాస్ యాక్షన్ హీరోగా మారి ఇద్దరి పరాజయాల రికార్డుని చేరిపెసేందుకు సిద్ధమయ్యాడు. మరి ఇందులో ఎంతవరకు సఫలమయ్యాడు? తను సఫలమై పూరీ విఫలమయ్యడా? పరిశీలిద్దాం…

కథ
ఒక హత్య కేసులో జైల్లో వున్న శంకర్ (రామ్) తప్పించుకుని పారిపోతాడు. గతంలో తను ప్రేమించిన చాందినీ (నభా పటేల్) గుర్తుకొస్తుంది. చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుంటూ రుబాబుగా బతుకుతున్న శంకర్, చాందినీని విపరీతంగా ప్రేమిస్తాడు. ఇంతలో కాకా అనే చిన్నప్పట్నుంచీ శంకర్ని పెంచినతను ఒక హత్య చేయమని డబ్బిస్తాడు. ఆ డబ్బు తీసుకుని మాజీ మంత్రి కాశీవిశ్వనాథ్ (పునీత్ ఇస్సార్) ని చంపిన శంకర్, చాందినీతో ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్ళిపోతాడు. కాశీ విశ్వనాథ్ కొడుకు ముఖ్యమంత్రి ధనుంజయ్ (దీపక్ శెట్టి). ఇతడి మామ రామ్మూర్తి (ఆశీష్ విద్యార్థి). వీళ్లిద్దరూ శంకర్ మీద పగబట్టి గోవాకి పోలీసుల్ని పంపుతారు. పోలీసుల దాడిలో చాందినీ చచ్చిపోయి, శంకర్ దొరికిపోయి జైలుకి పోతాడు.

ఇప్పుడు జైల్లోంచి పారిపోయిన శంకర్ చాందినీ చావుకు కారకులైన వాళ్ళ మీద పగబడతాడు. మరోవైపు సీబీఐ అధికారి పరమేశ్వరన్ ( సాయాజీ షిండే) కాశీవిశ్వనాథ్ హత్య  వెనుక  కుట్రదారుల్ని కనుక్కోవడానికి అసిస్టెంట్ అరుణ్ (సత్యదేవ్) తో ప్రయత్నాల్లో వుంటాడు. శంకర్ నీ, అరుణ్ నీ లేపెయ్యడానికి కుట్రదార్లు ప్లాన్ చేసి ఎటాక్ చేస్తారు. ఇద్దరూ చావుబతుకుల్లో వుంటారు. అరుణ్ ప్రేమిస్తున్న సారా (నిధీ అగర్వాల్) సైంటిస్టు. ఆమె జ్ఞాపకాల మార్పిడి పైన పరిశోధన చేస్తూంటుంది. సీబీఐ ఆఫీసర్ చనిపోతున్న అరుణ్ మెమరీని శంకర్ కి ట్రాన్స్ ఫర్ చేయమని ఆదేశిస్తాడు. కుట్ర దారుల్ని పట్టుకోవాలంటే అరుణ్ మెమరీ చాలా అవసరమంటాడు. అలా అరుణ్ మెమరీతో వున్న చిప్ ని శంకర్ మెదడులో అమరుస్తుంది సారా. కళ్ళు తెర్చిన శంకర్ సగం తన జ్ఞాపకాలతో, సగం అరుణ్ జ్ఞాపకాలతో విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలెడతాడు.

ఇప్పుడేం జరిగింది? అరుణ్ జ్ఞాపకాలతో వున్న శంకర్ నుపయోగించుకుని పరమేశ్వరన్ కుట్రదారుల్ని పట్టుకున్నాడా? తన జ్ఞాపకాలతో కూడా వున్న శంకర్, చాందినీ చంపిన వాళ్ళ మీద పగ దీర్చుకున్నాడా? ఇదీ కథ…

ఎలావుంది కథ
ఒకరిలో ఇంకొకరుండే కథలతో సినిమాలు ఇంకా అదే పనిగా వస్తున్నాయి. సవ్యసాచి, అమర్ అక్బర్ అంటోనీ, గేమ్ ఓవర్, బుర్రకథ, ఓ బేబీ, నిను వీడని నీడను నేనే…ఐస్మార్ట్ శంకర్! ఈసారి బ్రెయిన్ లో డబుల్ సిమ్ కథ. ఉద్దేశం సిమ్ లో వున్న మెమరీతో కుట్రదారుల్ని పట్టుకోవడం. అంటే శంకర్ లోకి అరుణ్ ని పంపించి కుట్ర దారుల మీదికి ప్రయోగించడం. మరి ఈ పాయింటు మీద కథ నడిచిందా అంటే లేదు. ఈ పాయింటుని క్లయిమాక్స్ లోనే వాడుకుని ముగించారు.

అమితాబ్ బచ్చన్ తో తీసిన సూపర్ హిట్ ‘డాన్’ లో మాఫియా డాన్ అమితాబ్ చనిపోతే, ఈ విషయం రహస్యంగా వుంచి పోలీసులు అమాయకుడైన అమితాబ్ ని డాన్ లాగా రంగం లోకి దింపి మాఫియా నెట్వర్క్ ని అంతమొందించాలనుకుంటారు. ఇందులో ఎమోషనల్ కనెక్ట్ ఏమిటంటే, మధ్యలో ఆ పోలీసు అధికారి చనిపోతే, అమాయక అమితాబ్ తను డాన్ ని కాదని నిరూపించుకోలేక చిక్కుల్లోపడి గిలగిల కొట్టుకుంటాడు.

ఇలాటి సూటి కథ, ఎమోషనల్ కనెక్ట్ ‘ఇస్మార్ట్ శంకర్’ లో వుంటే బావుండేది. ఈ కథ ఎంతసేపూ ‘నిను వీడని నీడను నేనే’ ఇంటర్వెల్ ట్విస్టుతో సిట్యుయేషన్ గానే వుండిపోయిన విధంగా, స్టోరీగా మారలేదు. క్లయిమాక్స్ లో మాత్రమే కథగా మారింది. ఇంతవరకూ సెకండాఫ్ దారితప్పిన అనాధలా తిరుగాడింది. దీని గురించి వివరంగా స్క్రీన్ ప్లే విశ్లేషణలో తెలుసుకుందాం.

ఎవరెలా చేశారు
చావోరేవో తేల్చుకుందామన్నట్టుగా రామ్ చేశాడు. అతడి క్యారక్టరైజేషనే ఈ రొటీన్ మూవీకి ఏంతో కొంత బలం. శృతి మించిన నటన, హీరోయిన్ తో మితిమీరిన రోమాన్స్, డైలాగులూ, పక్కా మాస్ ప్రేక్షకుల కోసమే. కానీ ఇలా నటించడానికి, మూవీ అంతా ఒకే తరహా జోష్ ని మెయింటెయిన్ చేయడానికి రామ్ కి చాలా టాలెంట్ వుండాలి. టోటల్ మాస్ మేకోవర్ తో, మాస్ స్టెప్స్ తో, సిక్స్ ప్యాక్ తో, తెలంగాణా బూతులతో, ఫైటింగ్ స్కిల్స్ తో కేరింతలు కొట్టించాడన్నది నిజం. కాకపోతే సెకండాఫ్ లో కూడా ఈ క్యారక్టరైజేషనే బోరు కొట్టేసినట్టు మౌనంగా వుండిపోయారు పూరీ టార్గెట్ చేసిన మాస్ ప్రేక్షకులే. కారణం, ఇంటర్వెల్లో రేకెత్తించిన పాయింటు ప్రకారం, ఇక రామ్ అరుణ్ గా, నీటుగా ఇంకో క్యారక్టరైజేషన్ తో ఎంటరవుతాడని ఆశించి భంగపడి వుంటారు ప్రేక్షకులు. ఇది కథతో పూరీ చేసిన పొరపాటే.

హీరోయిన్లు నభా పటేల్ మాస్ క్యారక్టర్, నిధీ అగర్వాల్ క్లాస్ క్యారక్టర్ వేశారు. సివిల్ ఇంజనీరింగ్ చదివాననే నభా పాత్ర,కూరగాయల మార్కెట్ మాస్ పాత్రలా వుంది భాషతో, చేష్టలతో. ఇతర పాత్రల్లో తారాగణం షరా మామూలే. సత్య దేవ్ పాత్ర, నటన కూడా మామూలుగా వుంది. బలమైన విలన్ పాత్ర లేకపోవడం కూడా ఒక లోపం.

మణిశర్మ రెండు డ్యూయెట్లు ఫర్వాలేదన్నట్టుగా కంపోజ్ చేశాడు. బోనాల మాస్ పాటతో హోరేత్తించాడు. బ్యాక్ గ్రౌండ్ బాణీలు కూడా ఫర్వాలేదు. పూరీ సినిమాల్లో సాంకేతిక విలువల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కెమెరా వర్క్, విజువల్స్, లొకేషన్స్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా వున్నాయి. కాకపోతే ప్రతీ పదిహేను నిమిషాలకో ఫైటింగ్ పెట్టడమే కథలేదనే ఫీలింగ్ కి దారితీసింది.

చివరికేమిటి
రామ్ కి డబుల్ సిమ్ అమర్చి ఇంటర్వెల్ ఇవ్వడంతో ‘హౌ ఈజ్ ది జోష్?’ అని విజయవంతంగా అనగల్గిన పూరీ, సినిమా పూర్తయ్యాక అదే ‘హౌ ఈజ్ ది జోష్?’ అనలేని పరిస్థితి. ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ ఒకదానితో ఒకటి సంబంధమున్న సీన్లతో స్పీడుగా, కళ్ళు తిప్పుకోనివ్వకుండా నడిపిన కథనం, ఇంటర్వెల్ తర్వాత చేతులెత్తేసి, ఇక నువ్వే చూసుకో అని రామ్ రామ్ చెప్పేశారు రామ్ కి. ఇంటర్వెల్ మలుపుతో అరుణ్ పాత్రలోకి వెళ్ళకుండా రామ్ ఇంకా శంకర్ నే నటిస్తున్నప్పుడే ఫస్టాఫ్ ఇచ్చిన మంచి రిజల్టు మసకబార సాగింది.

కాసేపు ఇతను, కాసేపు అతను అనే డబుల్ సిమ్ ఐడియానే కథ కుదరకుండా చేసింది. అసలు సెకండాఫ్ లో అయినా కథే ప్రారంభం కాకుండా చేసింది క్లయిమాక్స్ వరకూ. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే తయారయ్యింది. అరుణ్ పాత్రతో కథ ముందు కెళ్ళకుండా,ఇంకా సెకండాఫ్ లో కూడా ఎప్పుడో ఫస్టాఫ్ లో చనిపోయిన చాందినీ పాత్రనే శంకర్ గుర్తుచేసునే సీన్లూ, మరో పాటా నాల్గు సార్లు రావడం భరించలేని పరిస్థితిగా, సమయం వృధాగా మార్చింది.

ఫస్టాఫ్ లో చేసిన షార్ప్ కథనం, సెకండాఫ్ లో కథని నిర్ణయించుకోలేక మొండికేసింది. దర్శకుడుగా ఇంత సుదీర్ఘ మైన అనుభవమున్న పూరీకి ఇంకా కథల మీద అవగాహన లేదనుకోలేం. ఈ సినిమాకి కథకంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్న రామ్ క్యారక్టరే మంచి సెల్లింగ్ పాయింటు అవుతుందనుకుని వుండొచ్చు. అందుకే కథని బలి పెట్టయినా సరే చివరి వరకూ అదే శంకర్ పాత్రని వదల్లేదు.

ఇలా మరో వన్ బై టూ క్యారక్టర్ సినిమాగా ‘ఇస్మార్ట్ శంకర్’ తో బి, సి సెంటర్స్ ని టార్గెట్ చేసిన పూరీ వ్యూహం ఫుల్ జోష్ ని కూడా ఇస్తే బావుండేది.

రచన – దర్శకత్వం : పూరీ జగన్నాథ్
తారాగణం : రామ్, నభా నటేష్, నిధీ అగర్వాల్, రావు రమేష్, బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఆశీష్ విద్యార్థి, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : రాజ్ తోట
బ్యానర్ : పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
నిర్మాతలు : పూరీ జగన్నాథ్, ఛార్మి
విడుదల : జులై 18, 2019
2.5

-సికిందర్