రివ్యూ ‘జెర్సీ’ – నేచురల్ జర్నీలో నాని!

రచన దర్శకత్వం : గౌతమ్ టి. 
తారాగణం : నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు తదితరులు 
సంగీతం : అనిరుధ్, ఛాయగ్రహణం : సానూ వర్ఘీస్ 
బ్యానర్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్ 
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ 
విడుదల : ఏప్రెల్ 19,2019
3.25 / 5

***

        నేచురల్ స్టార్ నాని గత రెండు ఫ్లాప్స్ తర్వాత (కృష్ణార్జున యుద్ధం, దేవదాసు) తిరిగి ఫ్రెష్ గా రంగంలో కొచ్చాడు. ఈసారి క్రికెట్ కథతో నేచురల్ స్టార్ గా వాస్తవికతతో వచ్చాడు. ‘మళ్ళీ రావా’ అనే ప్రేమ సినిమా తీసిన దర్శకుడు గౌతమ్ దీనికి దర్శకత్వం వహించాడు. శ్రద్ధా శ్రీనాథ్ అనే మరో కొత్త తార హీరోయిన్. స్పోర్ట్స్ మూవీ జానర్ లో స్ట్రగుల్ చేసే లేటు వయసు హీరోగా నాని నటించిన ఈ ‘జెర్సీ’ ప్రత్యేకతేమిటో చూద్దాం…

కథ 
          
1986 లో క్రికెటర్ గా ఎంత బాగా ఆడినా రాజకీయాలవల్ల జాతీయ స్థాయి టీమ్స్ లో సెలెక్ట్ కాలేకపోతున్న అర్జున్ (నాని), ఇక భార్య సారా (శ్రద్ధా శ్రీనాథ్) కి చెప్పేసి ప్రభుత్వోద్యోగంలో చేరిపోతాడు. ఆ ఉద్యోగంలో తప్పుడు అవినీతి కేసులో ఇరుక్కుని సస్పెండ్ అయి పోతాడు. అప్పటి నుంచి పదేళ్ళూ భార్య సంపాదన మీద ఆధారపడి, అవమానాలు పొందుతూ జీవిస్తూంటాడు. కొడుకు నాని (రోణిత్ కమ్రా) ని బాగా ప్రేమిస్తాడు. అయితే వాడి పుట్టిన రోజుకి  గిఫ్ట్ గా ఇస్తానన్న జెర్సీ ఐదొందలు పెట్టి కొనివ్వలేకపోతాడుఇలాటి చేదు అనుభవాలతో తిరిగి క్రికెట్ లో స్థిరపడాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పటికి ఏజ్ బార్ అయి 36 ఏళ్ళు వచ్చాయి. ఈ వయసులో రంజీ మ్యాచ్ లో స్థానం సంపాదించి, తిరిగి తన క్రికెట్ ప్రాభవాన్ని పొంది జీవితంలో ఎలా విజేత అయ్యాడనేది మిగతా కథ.  

ఎలావుంది కథ 
          
వరసగా మూడు వారాలుగా మూడు సినిమాలు ఇదే పరాజితులు విజేతలయ్యే కథలతో వచ్చాయి : మజిలీ, చిత్రలహరి, ఇప్పుడు జెర్సీ. మజిలీ, జెర్సీ రెండూ అయితే క్రికెట్ గురించి, భార్య సంపాదన మీద బతకడం గురించే వున్నాయి. కాకపోతే జెర్సీ లో ఆలస్యం విజయానికి అడ్డు కాదని చెప్పదల్చుకున్నారు. విషయం పురాతనమైనది. దీన్ని ఫార్ములా కమర్షియల్ చేయకుండా సెమీ రియలిస్టిక్ గా తీశారు. కమర్షియల్ హంగులు లేని పాత్రలో నాని కథలో వున్న భావోద్వేగాల మీద ఆధారపడి నటించాడు. సంఘర్షణాత్మక మైన జీవితంలో ఎదురయ్యే  ఫక్తు భావోద్వేగాలతో కూడా సినిమాని నిలబెట్ట వచ్చని రుజువు చేశాడు. 
ఎవరెలా చేశారు
          
నానికిలాటి పాత్రలు నటించడం కొట్టిన పిండి. ఇందుకే నేచురల్ స్టార్ అనే పేరొచ్చింది. ఇలాటి స్ట్రగుల్ చేసే సామాన్యుడి పాత్రకి అతడి సహజ హావభావాలు అతడి ఎస్సెట్. గతవారం ‘లూసిఫర్’ అనే క్లాస్ కథలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని మాస్ పాత్రగా చూపించి క్లాస్ కథని మాస్ ప్రేక్షకులకి దగ్గర చేసి పెద్ద హిట్ కొట్టినట్టే, ‘జెర్సీ’ క్లాస్ కథలో నాని పాత్రని మాస్ కి దగ్గరగా వుండే సామాన్య వేష భాషల్లో చూపించడం కమర్షియల్ గిమ్మిక్కే. ముగింపు దృశ్యాల్ని గుండెల్ని బరువేక్కించే నటనతో మరపురాని విధంగా చేశాడు. 
          క్రిస్టియన్ పాత్రలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ పోలికలు సరిపోయాయి. భర్తని పోషించే భార్యగా సమస్యాత్మక పాత్రని తనూ నిలబెట్టుకుంది. కొడుకు పాత్రలో బాల నటుడు ఓకే. క్రికెట్ కోచ్ గా, నానికి ఫాదర్ ఫిగర్ గా సత్యరాజ్ ది ముఖ్యపాత్ర, నటన. 
        అనిరుధ్ సంగీతం, సానూ వర్ఘీస్ ఛాయగ్రహణం ఫర్వాలేదు. క్రికెట్ దృశ్యాలు చాలానే వున్నాయి. 1996 లో న్యూజీలాండ్ తో ఇంటర్వెల్లో వచ్చే క్రికెట్ దృశ్యాలు అంత బలంగా లేవు. స్టేడియంలో కూడా జనం పలచగా కన్పిస్తారు. నాని బ్యాట్ తీసుకున్నప్పుడు మాత్రం ప్రేక్షకులకి ఫస్టాఫ్ మొత్తంలో మొట్ట మొదటిసారి హుషారొస్తుంది. కింది తరగతి మాస్ ప్రేక్షకులకి ఇక్కడ్నించీ కనెక్ట్ అవుతుంది మూవీ.

చివరికేమిటి 
          
దర్శకుడు గౌతం ఫార్ములా వాడకుండా సహజంగా నీటుగా తీశాడు. ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్న ఆలోచన లేనట్టు ఫస్టాఫ్ ని నాని నిరుద్యోగ కథతో, భార్య తో సంసార గొడవలతో ఆర్ట్ మూవీ వాస్తవికతకి పోయి, గ్లామర్ పోషణని పూర్తిగా దూరం పెట్టాడు. నాని కాకుండా ఈ దృశ్యాలు ప్రేక్షకులకి కష్టం. ఫస్టాఫ్ ఈ పాథోస్ ని ఓపిగ్గా నాని గురించే  చూడాల్సిన అవసరాన్ని ప్రేక్షకులకి కల్పించాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ యాక్షన్ లోకి వెళ్ళిపోతాయి పాత్ర, కథ. లేటు వయసులో పరాజితుడు విజేత అయ్యే ఎమోషనల్ పోరాటం. క్రీడా సినిమాల ఫార్ములానే ఈ విజయగాథ పార్టుకి వాడాడు. దీనికి ముగింపు కిచ్చిన ఎమోషనల్ టచ్ గుర్తుండి పోయేలా చేస్తుంది. కృత్రిమ పోకడలకి దూరంగా నేచురల్ జర్నీ ఈ జెర్సీ. మాస్ లోకి వెళ్తే మంచి హిట్.

సికిందర్